రాష్ట్ర బడ్జెట్ 2012 - 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర బడ్జెట్ 2012 - 2013

రాష్ట్ర బడ్జెట్ 2012 - 2013

Written By ysrcongress on Saturday, February 18, 2012 | 2/18/2012

వివిధ అంశాలపై ప్రముఖుల సూక్తులను ప్రస్తావిస్తూ ఆనం బడ్జెట్ ప్రసంగం సాగింది...
వ్యవసాయంపై..: నేలను సాగుచేయటం ఆరంభమైన తర్వాతే ఇతర కళలు అనుసరించి వచ్చాయి. కాబట్టి రైతులు మానవ నాగరికతకు ఆద్యులు -డేనియల్ వెబ్‌స్టర్ 
మహిళల సంఘటిత శక్తి సందర్భంలో..: వ్యక్తికి బహువచనం శక్తి -శ్రీశ్రీ 
పాఠశాల విద్యపై..: విద్య అనేది సంపత్తిలో ఆభర ణంగానూ, ప్రతికూల స్థితిలో అండగానూ ఉండగలదు -అరిస్టాటిల్
సాంకేతిక విద్య సందర్భంలో..: శ్రమ రూపం దాల్చనట్టి జ్ఞానమంతయు వృథా -కాళోజీ నారాయణరావు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టటానికి వీలుగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం శక్తివంతమైన ఎదుగుదల దిశగా పయనిస్తోందన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,45,854 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలను ఆనం శుక్రవారం మధ్యాహ్నం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళిక పద్దు కింద రూ. 54,030 కోట్లు (అందులో 5,080 కోట్లు కేంద్ర సాయం), ప్రణాళికేతర పద్దు కింద రూ. 91,824 కోట్లు వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ. 20,008 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రస్తుత (2011-12) ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ. 3,856 కోట్లుగా ఉంటుందని భావించినా.. సవరించిన అంచనాల ప్రకారం గణనీయంగా తగ్గి రూ. 780 కోట్లుగా ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరుగుదల 19.5 శాతం ఉందని మంత్రి ఆనం తెలిపారు. 

పన్ను సామర్థ్యాన్ని మెరుగుపరచటం, పన్నుల వసూళ్లలో లొసుగులను అధిగమించటం, కొన్ని పన్నులను విధించటం వల్ల ఆదాయ వనరులను అనుకున్న మేరకు రాబట్టుకోలగమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 8.64 శాతం ఉంటే.. 2005-06 నుంచి 20011-12 మధ్య కాలంలో మన రాష్ట్ర సగటు ఆర్థిక వృద్ధి రేటు 9.26%గా ఉందని చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొందన్నారు. గత సంవత్సరంలో ఖరీఫ్‌లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, ఉద్యమాలు సుదీర్ఘకాలం కొనసాగటం వల్ల.. ఆ పరిణామాలు సాధారణ ఆర్థిక పని తీరును దెబ్బతీశాయన్నారు. ఫలితంగా.. జాతీయ స్థూల ఉత్పత్తితో పోలిస్తే రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తి తగ్గిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోటానికి రూ. 3,006 కోట్ల సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలివీ..

వివిధ శాఖల కింద యువకిరణాలకు 777 కోట్లు కేటాయించాం. ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కల్పించాం. 
రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1,075 కోట్లు. 
ఇందిరా జలప్రభ కింద 10 లక్షల ఎకరాల బీడు భూములను సాగుయోగ్యం చేస్తాం. 
రచ్చబండలో ఇప్పటికే 50 లక్షల మందికి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, గృహస్థలాలు ఇచ్చాం. 
ప్రస్తుత ఏడాదిలో ఆహార ధాన్యాలు 14.82 శాతం, నూనె గింజలు 36.09 శాతం దిగుబడి తగ్గుతాయని అంచనా. 
మహిళా సంఘాలకు రుణాలు పెంచటానికి స్త్రీనిధి. 

జలయజ్ఞానికి గత సంవత్సరం కేటాయించిన మొత్తాన్నే ఈసారి కేటాయించాం. 
గృహ నిర్మాణానికి రూ.2,300 కోట్లు కేటాయించాం. అందులో 400 కోట్లు రుణాల చెల్లింపునకు. 
విద్యుత్ రంగానికి రూ.5,937 కోట్లు కేటాయించాం. 
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి రూ.220 కోట్లు కేటాయించాం. 
108, ఆరోగ్యశ్రీ మెరుగుపరుస్తున్నాం. ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. 
ఇకపై ఆర్థిక కార్యకలాపాలన్నీ అందరూ చూడటానికి వీలుగా ఆన్‌లైన్‌లో కొనసాగిస్తాం. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలన్నీ ఆన్‌లైన్‌లోనే తెప్పించుకున్నాం. కాగిత రహితంగా బడ్జెట్ కసరత్తు సాగింది. 

మండలిలో శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగం

శాసన మండలిలో బడ్జెట్‌ను పౌర సరఫరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తెలుగు ప్రసంగం చదవడంలో ఆయన ఇబ్బందులు పడ్డారు. అనేక తప్పులు దొర్లాయి. తెలంగాణ వైతాళికుడైన కాళోజీ నారాయణరావు సూక్తిని కూడా ఆయన సరిగా చదవలేకపోయారు.‘శ్రమరూపం దాల్చనట్టి జ్ఞానమంతయు వృథా’ అన్న కాళోజీ మాటను శ్రీధర్‌బాబు పూర్తిగా తప్పుడు అర్థం దొర్లేలా ‘శ్రమరూపం దాల్చినట్టి జ్ఞానమంతయు వృథా’ అని చదవడంతో సభ్యులంతా నవ్వుకున్నారు. ప్రసంగ ప్రతిలోని పదాలను ఉన్నదున్నట్లుగా చదవలేకపోయారు. కీలక అని ఉన్న ప్రతిచోటా కీలిక అని, ఆకాంక్షలకు బదులు ఆంక్షలు, కౌమార అని ఉంటే కౌమూర, పథకం ఉన్నచోట్ల ప్రథకం, నిష్పత్తికి బదులు నిష్పతి... ఇలా చదివారు.

అస్వస్థతకు గురైన ఆనం - కొంతసేపు ప్రసంగం చదివిన పొన్నాల

మంత్రి ఆనం తన ప్రసంగంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల గురించి వివరిస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. నిద్ర లేకపోవటం, శరీరంలో చక్కెర స్థాయి (షుగర్ లెవల్స్) తగ్గిపోవటంతో.. ఆయనకు కళ్లు తిరిగి, విపరీతంగా చెమటలు పట్టాయి. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి తన సీట్లో కూర్చుండిపోయారు. కూర్చోవటానికి ముందు ఆయన ‘బడ్జెట్ ప్రసంగం ఆపి కూర్చోవచ్చా?’ అని ఉప ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని అడిగారు. ఆనం బడ్జెట్ ప్రసంగాన్ని ఆపటంతో.. సీఎం జోక్యం చేసుకుని పొన్నాల లక్ష్మయ్యను ప్రసంగం చదవాల్సిందిగా కోరారు. ఈ సమయంలో లోక్‌సత్తా పార్టీ సభ్యుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వచ్చి.. ఆనం చేయి పట్టుకుని నాడి చూశారు. ఆ వెంటనే సీఎం వద్దకు వెళ్లి ఏదో చెప్పారు. ఆ తరువాత భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ గీతారెడ్డి వచ్చి పరిశీలించారు. ఆయనకు నిమ్మకాయ నీళ్లతోపాటు, మంచినీళ్లు తెప్పించారు. అసెంబ్లీలోని డాక్టర్లు, అధికారులు కూర్చున్న గదిలోకి వచ్చి బీపీ మిషన్ తీసుకొచ్చి పరిశీలించాలని ప్రయత్నించారు. కానీ ఆనం బయటకు వెళ్లి చెక్ చేయించుకోకుండా తన స్థానంలోనే 15 నిమిషాలపాటు అలాగే కూర్చుండిపోయారు. తేరుకున్న తరువాత ఆయన పొన్నాల లక్ష్మయ్యను ఆపించి మళ్లీ బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.







ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు:
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని, ప్రాధాన్యత రంగాలను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ నాయకత్వంలో ఇచ్చిన హామీలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. లక్షా యాభై వేల కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే పేదలకు కించిత్ లాభంలేదని ధ్వజమెత్తారు. ఇద్దరు మంత్రులు చదివి వినిపించడం తప్ప ఈ బడ్జెట్‌లో కొత్తదనమేదీ లేదని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు హెచ్.ఎ.రెహమాన్, గట్టు రామచంద్రరావులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘బడ్జెట్‌లో వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే సబ్సిడీ బియ్యం 20 నుంచి 30 కేజీల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించలేదు’’ అని కొణతాల చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో విద్యుత్తు కోత విధించిన ఘనత సీఎం కిరణ్‌కే దక్కుతుంది. రైతులు పండించే ధాన్యానికి కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అందిస్తామని కిరణ్‌తోపాటు పీసీసీ చీఫ్ బొత్స గొప్పగా ప్రకటించారు. 

కానీ వాటిని బడ్జెట్‌లో మాటమాత్రంగా కూడా చెప్పలేకపోయారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. రైతుకు ఊరటనిచ్చే అంశాలను ఒక్కటీ చేర్చలేకపోయారు. కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. వాస్తవ పరిస్థితి చూస్తే వారికి ఇప్పటిదాకా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఖజానా నింపుకోవడానికి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచారు’’ అని దుయ్యబట్టారు. ‘‘వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా ఈ పథకానికి సరిపడా నిధులు కేటాయించడంలేదు. దీనివల్ల విద్యార్థుల చదువులు గాల్లో దీపంలా తయారయ్యాయి. ఈ పథకానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవగా కేవలం రూ.4 వేల కోట్లే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా విస్మరించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు, నాలుగు రెట్లు పెంచిన కిరణ్ ప్రభుత్వం, పేదలకిచ్చే పెన్షన్‌ను పెంచాలనే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే పెన్షన్ చంద్రబాబు హయాంలో నెలకు రూ.75 ఉండగా, వైఎస్ దానిని రూ.200కు పెంచారు. ఈ ప్రభుత్వం పెన్షన్‌ను కనీసం యాభై నుంచి వంద రూపాయలకు పెంచే ఆలోచన చేయలేదు. వాళ్ల జీతాలు మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సీఎం కిరణ్ ఆయన విచక్షణ పరిధి కింద రూ.600 కోట్లు పెంచుకోవడం సిగ్గుచేటు. దీనివల్ల పేదలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’’ అని నిలదీశారు.

మైనారిటీలను విస్మరించిన బడ్జెట్: రెహమాన్

రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. మహా నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేని లోటు ముస్లింలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్ ఉండి ఉంటే ముస్లిం సంక్షేమానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించేవారన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న జనాభాకు కేవలం 0.1 శాతం నిధులు కేటాయించడం ఏ విధంగా సమర్థనీయమని ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం మైనారిటీ శాఖకు ఏదో కొంత విదిల్చి తామెంతో చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
Share this article :

0 comments: