2జీపై సుప్రీం కొరడా, లైసెన్సుల రద్దుకు ఆదేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2జీపై సుప్రీం కొరడా, లైసెన్సుల రద్దుకు ఆదేశం

2జీపై సుప్రీం కొరడా, లైసెన్సుల రద్దుకు ఆదేశం

Written By ysrcongress on Friday, February 3, 2012 | 2/03/2012

2008లో జారీ అయిన 122 లైసెన్సులు బుట్టదాఖలు
వాటిని బహిరంగంగా వేలం వేయాలంటూ తీర్పు
యూపీఏ సర్కారును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం
జాతి సంపదను కారుచౌకగా రాసిచ్చారంటూ రాజాపై ధ్వజం
2001 నాటి ధరలనే సిఫార్సు చేసినందుకు ట్రాయ్‌కీ అక్షింతలు
{పస్తుత లెసైన్సులు 4 నెలల పాటు కొనసాగేందుకు అనుమతి

లైసెన్సుల జారీ, స్పెక్ట్రం కేటాయింపులపై రెండు నెలల్లో కొత్త సిఫార్సులు చేయాలని ట్రాయ్‌కి ఆదేశం
నెల లోపు వేలం నిర్వహించాలని కేంద్రానికి ఆదేశం
న్యాయ సమీక్షకు అతీతమన్న వాదనను తోసిపారేసిన సుప్రీం
చిదంబరంపై సీబీఐ దర్యాప్తుపై ట్రయల్ కోర్టే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్య

‘‘ఏకపక్ష, చట్టవిరుద్ధ, రాజ్యాంగవిరుద్ధమైన, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన, ఏ మాత్రం మతిలేకుండా జరిపిన కేటాయింపులివి. సమానత్వ సిద్ధాంతాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ, ఖజానాకు అపార నష్టం కలిగిస్తూ, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న నిర్ణయాలు’’

‘ప్రధాని, కేంద్ర న్యాయమంత్రి ఇచ్చిన సలహాలను కూడా రాజా పెడచెవిన పెట్టారు. 2జీ వంటి అతి విలువైన జాతి సంపదను దాదాపుగా కారుచౌకగా రాసిచ్చేశారు.

‘‘జాతి సంపద పంపిణీకి వేలమే ఏకైక పారదర్శక విధానం. 2జీ లెసైన్సుల కేటాయింపుల్లోనూ దాన్ని అనుసరిస్తే దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరేది.

‘‘ప్రధానమైన రాజ్యాంగ పదవుల్లో, విస్తృత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా విధులు నిర్వహించిన కొందరు అవగాహనాపరులైన పౌరులు.. సుపరిపాలన కోసం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో జవాబుదారీతనం కోసం నిరంతరం పోరాడుతున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలే గనుక పూనుకుని.. 2జీ లెసైన్సుల కేటాయింపు ప్రహసనాన్ని జాగరూకతతో పరిశీలించని పక్షంలో.. అత్యంత పరిమితమైన ఈ జాతి సంపదను ధనబలమున్న, వ్యవస్థను ప్రభావితం చేయగల శక్తులు అడ్డంగా చేజిక్కించుకున్న వైనం జాతికి, అమాయకులైన దేశ ప్రజలకు ఎప్పటికీ తెలిసేదే కాదు!’’


న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్దదిగా భావిస్తున్న 2జీ కుంభకోణం ఉదంతంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో కన్నెర్రజేసింది. ఈ కేసులో కేంద్రంతో పాటు టెలికాం కంపెనీలపైనా గురువారం కొరడా ఝళిపించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేసేలా, మొత్తంగా దేశ టెలికం రంగాన్నే తీవ్రంగా ప్రభావితం చేసేలా సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. యూపీఏ-1 హయాంలో ఎ.రాజా టెలికం మంత్రిగా 2008లో కేటాయించిన 122 2జీ స్పెక్ట్రం లైసెన్సులను రద్దు చేసింది. తద్వారా కొన్నేళ్లుగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ 2జీ కేటాయింపులను బుట్టదాఖలు చేసి యూపీఏ సర్కారుకు భారీ షాకిచ్చింది. అంతేగాకుండా... ‘‘ఇవి పూర్తిగా ఏకపక్ష, చట్టవిరుద్ధ, రాజ్యాంగవిరుద్ధమైన, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన, ఏ మాత్రం మతిలేకుండా జరిపిన కేటాయింపులు. సమానత్వ సిద్ధాంతాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ, ఖజానాకు అపార నష్టం కలిగిస్తూ, కొన్ని కంపెనీలకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న నిర్ణయాలు’ అంటూ న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గంగూలీ, జీఎస్ సింఘ్వీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు కేంద్రం అనుసరించిన ‘మొదట వచ్చిన వారికి మొదట’ విధానాన్నేతీవ్రంగా తప్పుబట్టింది. అది పూర్తిగా లోపభూయిష్టమైన తప్పుడు విధానమంటూ ఆక్షేపించింది. దానికి బదులు వేలం ద్వారా స్పెక్ట్రాన్ని కేటాయించాల్సిందని వ్యాఖ్యానించింది. ఆర్థిక అంశాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావన్న కేంద్రం వాదనను పూర్తిగా కొట్టిపారేసింది. ‘‘ప్రభుత్వం, లేదా ప్రభుత్వ సంస్థ రూపొందించిన విధానం ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉంటే.. ప్రజాప్రయోజనార్థం వాటిని సమీక్షించడం, సరైన చర్యలు తీసకోవడం కోర్టుల విధి’’ అంటూ కుండబద్దలు కొట్టింది. రిలయన్స్ గ్యాస్ వివాదం వంటివాటిని ఉదాహరించింది. లైసెన్సుల జారీ ప్రక్రియలో చేతివాటం చూపారంటూ రాజాపై దుమ్మెత్తిపోసింది. ‘ప్రధాని, కేంద్ర న్యాయ మంత్రి సలహాలను కూడా రాజా పెడచెవిన పెట్టారు. అత్యంత ప్రధానమైన జాతీయ సంపదను దాదాపుగా కారుచౌకగా రాసిచ్చేశారు. టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అనుసరించిన తలకిందుల విధానాన్ని అందుకు చక్కగా వాడుకున్నారు’ అంటూ ఆయనను తీవ్రంగా అభిశంసించింది. 2జీ కుంభకోణంలో ట్రాయ్ పాత్రను కూడా తీవ్రంగా తప్పుబట్టింది. 2001 నాటి ధరలకు స్పెక్ట్రంను కేటాయించాలని సిఫార్సు చేయడం ద్వారా మంత్రిమండలి నిర్ణయానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందంటూ విమర్శించింది. ప్రస్తుత 2జీ లైసెన్సులు మరో 4 నెలల పాటు కొనసాగేందుకు బెంచ్ అనుమతించింది. అనంతరం రద్దు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘‘ఆలోపు 22 సర్కిళ్లలోని 2జీ లెసైన్సులను వేలం ద్వారా విక్రయించాలి. లెసైన్సుల జారీ, 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు రెండు నెలల్లోగా ట్రాయ్ తాజాగా సిఫార్సులు చేయాలి. ఆ తర్వాత నెల లోపు వాటికి అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేసింది. కేటాయింపులతో లబ్ధి పొంది, తర్వాత 2జీ లెసైన్సులను భారీ లాభాలకు అమ్ముకున్న టెలికాం కంపెనీలకు జరిమానాలు విధించింది! 2జీ కుంభకోణంలో నాటి కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేందుకు నిరాకరించింది. దీనిపై 2 వారాల్లోగా నిర్ణయం వెలువరించాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు సూచించింది. 2జీ కేసు దర్యాప్తుకు సంబంధించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికను సమర్పించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే.. ఈ కేసులో సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థల విచారణను గానీ.. దాన్ని ఎదుర్కొంటున్న వారిని గానీ తమ వ్యాఖ్యలు, నిర్ధారణలు, ఆదేశాలు ఏ విధంగానూ ప్రభావితం చేయబోవని స్పష్టం చేసింది. అలాగే సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ కూడా తమ ఆదేశాలతో ప్రభావితం కాకుండా చిదంబరంపై తీర్పు వెలువరించాలని సూచించింది. ఇకపై సహజ వనరుల విక్రయానికి వేలం విధానాన్ని అనుసరించడం ద్వారా ఎలాంటి అక్రమ, చట్ట విరుద్ధ, ఏకపక్ష ధోరణులకూ తావు లేకుండా చూడాలని కేంద్రానికి సూచించింది. తద్వారా అర్హులందరికీ అందులో పాల్గొనే అవకాశం కల్పించాలంది. అలాగాక మరే విధానాన్ని అనుసరించినా.. రాజ్యాంగ సూత్రాలు, విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేని, గరిష్ట స్థాయిలో ఆర్థిక లబ్ధి పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న నీతిబాహ్యులైన వ్యక్తులు దేశ సహజ వనరులను, సంపదను దుర్వినియోగపరుస్తారంటూ హెచ్చరించింది.

నాటకం నడిపించిన రాజా...: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. 2జీ కుంభకోణంలో టెలికం మంత్రిగా రాజా కీలక పాత్ర పోషించారంటూ సోదాహరణంగా వివరించింది. ‘‘జాతీయ సంపద పంపిణీకి ఏకైక పారదర్శక విధానమైన వేలాన్ని అనుసరిస్తే 2జీ లైసెన్సుల కేటాయింపు ద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరేది. కానీ 2007 సెప్టెంబర్-2008 మార్చి మధ్య రాజా నేతృత్వంలో టెలికం అధికారులు చేపట్టిన ప్రక్రియ ఇందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. అంతేకాకుండా స్పెక్ట్రం వంటి పరిమిత వనరు కేటాయింపులో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా చూడాలన్న ప్రధాని సలహాను రాజా పట్టించుకోలేదు. కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలంటూ 2007 నవంబర్ 2న ప్రధాని లేఖ రాస్తే, అందులోని సూచనలన్నింటినీ కొద్ది గంటల్లోనే తిరస్కరించారాయన! వేలం వేస్తే కొత్త దరఖాస్తుదారులకు సమానావకాశం దక్కదు గనుక అది అన్యాయం, వివక్షాపూరితం, ఏకపక్షం, మతిలేని నిర్ణయం కాగలదని వాదించారు. 

పైగా కేవలం టెలికాం సేవల్లో ఏ అనుభవమూ లేని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా, లెసైన్సుల కోసం దరఖాస్తుల కటాఫ్ తేదీని టెలికాం శాఖ ప్రకటించిన 2007 అక్టోబర్ 1 నుంచి ఏకపక్షంగా, తనంతతానుగా సెప్టెంబర్ 25కు తగ్గించారు! సదరు రియల్టీ కంపెనీలన్నీ అందుకు సరిగ్గా ఒక్క రోజు ముందు దరఖాస్తు చేసుకున్నాయి! ఇక 2008 జనవరి 10న నిర్వహించిన టెలికం కంపెనీలకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ ప్రక్రియంతా ముందస్తు వ్యూహం ప్రకారం పక్కాగా ఆడిన నాటకమే. ముందుగానే, అంటే 2004, 2006ల్లో దరఖాస్తు చేసుకున్న పలు కంపెనీలను దీని ద్వారా కిందకు నెట్టారు. ‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ సూత్రం అమల్లో చోటుచేసుకున్న మార్పును తెలుసుకుని, 2007 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య వచ్చిన వాటికేమో ఎక్కువ సీనియారిటీ, తద్వారా ప్రాధాన్య క్రమంలో స్పెక్ట్రం కేటాయింపులకు అర్హత దక్కేలా చేశారు. ట్రాయ్ సిఫార్సులను అమలు చేసేముందు రాజీ విధిగా కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించాల్సింది. స్పెక్ట్రం ధరల నిర్ధారణపై వారితో మాట్లాడాల్సింది. కానీ.. 2001 ధరలకు స్పెక్ట్రం కేటాయింపుల పట్ల ఆర్థిక శాఖ కార్యదర్శి అప్పటికే అభ్యంతరం తెలిపారన్న వాస్తవం రాజాకు బాగా తెలుసు. అందుకు ఆర్థిక శాఖను గానీ, అధికారులను గానీ ఆయన సంప్రదించనే లేదు. దాంతో 2007 జనవరి 10న టెలికాం కమిషన్ భేటీలో పాల్గొన్న ఆ శాఖ అధికారులకు.. లైసెన్సల కేటాయింపులో రాజా చెప్పినట్టు చేయడం తప్ప మరో మార్గమే లేకపోయింది. లేదంటే ఆయన ఆగ్రహాగ్నిని వారు చవిచూడాల్సి వచ్చేది’’ అని వ్యాఖ్యానించింది.

ట్రాయ్‌పై న్యాయ సమీక్ష

‘‘ట్రాయ్ మంచి నైపుణ్యమున్న సంస్థే. కానీ 2జీ లైసెన్సుల కేటాయింపులో దాని సిఫార్సులు చాలా కోణాల్లో లోపభూయిష్టమేనని చెప్పేందుకు ఎన్నో రుజువులున్నాయి. వాటిని టెలికం శాఖ యథాతథంగా అమలు చేయడంతో జాతీయ టెలికం విధానం లక్ష్యాలే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలాంటి వ్యవహారాలపై న్యాయ సమీక్షకు ఉన్న అవకాశాలు అత్యంత స్వల్పమే అయినా.. కోర్టు దృష్టికి వచ్చిన పలు అంశాల ఆధారంగా పై వ్యాఖ్యలు చేసేందుకు మేమెంత మాత్రమూ సంశయించడం లేదు’’ అని స్పష్టం చేసింది! ట్రాయ్ సిఫార్సులపై న్యాయ సమీక్ష జరగాల్సిందేనని పేర్కొంది.

జోక్యం చేసుకోకుండా ఉండలేం...

ప్రభుత్వ విధాన నిర్ణయాలకు కోర్టులు దూరంగా ఉండాలన్న అటార్నీ జనరల్ జీఈ వాహన్‌వతి వాదనను బెంచ్ కొట్టిపారేసింది. ‘‘విధానాలను రూపొందించే ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలపై కోర్టు తన అభిప్రాయాలను రుద్దజాలదనడం నిజమే. కానీ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వ పవిత్ర విధి. జాతీయ వనరులను ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే తప్ప ప్రైవేటు ప్రయోజనాల కోసం వాడరాదు. అలాంటి విధానాలు ప్రజాప్రయోజనాలకు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని బాధ్యతాయుత పౌరులు కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు, అది నిజమని స్పష్టంగా నిరూపితమైనప్పుడు తన న్యాయ పరిధిని ఉపయోగించి వాటిని సమీక్షించడం కోర్టు విధి. ప్రజలు తమ విశ్వాసాన్ని ఉంచిన.. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి, భయం, పక్షపాతం, దురుద్దేశాలు లేకుండా విధులు నిర్వహిస్తామంటూ ప్రమాణం చేసిన వారి నుంచే వ్యవస్థాపరమైన సమగ్రతకు విఘాతం కలగకుండా చూడాల్సింది కూడా కోర్టులే. ఎందుకంటే వారు కూడా తమ విధులకు బద్ధులే’’ అని స్పష్టం చేసింది. ‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ అన్నది తప్పుడు విధానమైతే, 2001 నుంచీ జరిపిన కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలన్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనను బెంచ్ కొట్టిపారేసింది.

ఇవీ జరిమానాలు: ఏకపక్ష విధానంలో 2జీ లైసెన్సులను సొంతం చేసుకుని, అనంతరం ఈక్విటీ రాబట్టుకునే సాకుతో వేల కోట్లకు వాటికి విక్రయించిన ఎటిసలాట్ డీబీ టెలికం (స్వాన్ టెలికం లిమిటెడ్), యూనిటెక్ వైర్‌లెస్ గ్రూప్, టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌లకు రూ.5 కోట్ల చొప్పున జరిమానా విధించింది. లూప్ టెలికాం, ఎస్-టెల్, అలియాంజ్ ఇన్‌ఫ్రాటెక్, సిస్టెమా శ్యాం టెలీ సర్వీసెస్ కూడా రూ.50 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 50% మొత్తాన్ని నిరుపేద కక్షిదారులకు సాయం చేసేందుకు వీలుగా సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ వద్ద , మిగతా మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి జమ చేయాలని పేర్కొంది.

లైసెన్సులు రద్దయిన కంపెనీలివే...
యూనినార్(22 లెసైన్సులు), సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ లిమిటెడ్. ప్రస్తుతం ఎంటీఎస్ ఇండియా.(21), లూప్ మొబైల్. గతంలో బీపీఎల్ మొబైల్.(21), వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్. (21), ఎటిసలాట్-డీబీ(15), ఐడియా సెల్యులార్(9), టాటా టెలీ సర్వీసెస్(3),ఎస్ టెల్(6), స్పైస్(ఐడియా)(4)

సీనియర్లతో ప్రధాని మంతనాలు
2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ అంశంపై సీనియర్ మంత్రులతో గురువారం సంప్రదింపులు జరిపారు. సుప్రీం తీర్పు వల్ల ఎదురయ్యే పరిణామాలపై చర్చిం చారు. కేబినెట్ భేటీతోపాటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానంతరం ఆయన ఈ మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇదేం ‘పాలసీ’?
‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ విధానాన్ని బెంచ్ తీవ్రంగా తప్పుబట్టింది. అధికార వర్గాల్లో అత్యున్నత, లేదా అట్టడుగు స్థాయిలో ప్రవేశమున్న వారెవరికైనా సదరు నిర్ణయాలు, కాంట్రాక్టులు, లైసెన్సుల కేటాయింపుల గురించి ముందుగానే తెలుసుకుని, అయాచిత లబ్ధి పొందేందుకు ఇది పూర్తిగా వీలు కల్పించేలా ఉండటం దీనిలోని మౌలిక లోపమని వ్యాఖ్యానించింది. తద్వారా, వాటిని పొందేందుకు అదనపు అర్హతలున్న ఇతరులు నష్టపోతారని గుర్తు చేసింది. పారదర్శకమైన బహిరంగ వేలమే అత్యుత్తమ విధానమని స్పష్టం చేసింది.

‘పౌరులకు’ జేజేలు
అవగాహనాపరులైన కొందరు పౌరుల జాగరూకతే 2జీ వంటి అతి పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టిందంటూ కోర్టు కొనియాడింది. స్వచ్ఛంద సంస్థ ఎస్‌పీఐఎల్ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎం తార్కుండేతో పాటు లోక్‌సత్తా, టెలికం వాచ్‌డాగ్, కామన్‌కాజ్ వంటి స్వచ్ఛంద సంస్థలను తన తీర్పులో ప్రస్తుతించింది. ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు జేఎం లింగ్డో, టీఎస్ కృష్ణమూర్తి, ఎన్.గోపాలస్వామి, మాజీ సీవీసీ పి.శంకర్, ఐపీఎస్ అధికారి జూలియో ఎఫ్.రిబెరో, సీనియర్ జర్నలిస్టు పీఆర్ గుహ, మాజీ నావికా దళాధిపతి ఆర్‌హెచ్ తహిల్యానీ, జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామిలను ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించింది.

రివ్యూ పిటిషన్ వేయనున్న కంపెనీలు
లైసెన్సుల రద్దుపై టెలికాం కంపెనీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సిస్టెమా-శ్యామ్, ఎటిసెలాట్ డీబీ తెలిపాయి. ప్రభుత్వ ప్రక్రియలో జరిగిన తప్పిదాలకు కోర్టు తమపై జరిమానా విధించిందని యూనినార్ వ్యాఖ్యానించింది. తాము దరఖాస్తు చేసుకున్న 18 నెలల తర్వాత జనవరి 2008లో లెసైన్సులు జారీ కావడమే సమస్యగా మారిందని ఐడియా సెల్యులార్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ లైసెన్సులన్నీ 2001కన్నా ముందే జారీ అయ్యాయి కాబట్టి లైసెన్సుల రద్దు అంశం తమపై ప్రభావం చూపబోదని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) తెలిపింది.
Share this article :

0 comments: