41 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 41 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం!

41 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం!

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

జీవో నంబర్ 1 నేపథ్యంలో గందరగోళం
పోలవరం, ప్రాణహిత, ‘దుమ్ముగూడెం’ ప్రాజెక్టులు కలగానే మిగిలిపోయే ప్రమాదం
వీటికి పరిపాలన అనుమతులిచ్చి రెండేళ్లు దాటింది 
అన్ని అనుమతులున్నా.. పోలవరానికి 
నేటికీ టెండర్లే ఖరారు కాని దుస్థితి
2013లోపు పూర్తికాని ప్రాజెక్టులను సమీక్షించాలన్న సర్కారు
రెండేళ్లు నిధులివ్వకపోగా.. 
సమీక్ష ఉత్తర్వులపై అనుమానాలు
మొత్తం 41 జలయజ్ఞం ప్రాజెక్టులపై ప్రభావం హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు ఇక కలేనా? నిర్మాణంలో ఉన్న అనేక జలయజ్ఞం ప్రాజెక్టులు అలా నిలిచిపోవలసిందేనా? సకాలంలో నిధులివ్వకుండా ప్రాజెక్టుల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా విడుదల చేసిన జీవోను పరిశీలిస్తే.. ఈ అనుమానాలు కలుగుతున్నాయి. శనివారం విడుదలైన జీవో నంబర్ 1ని యథాతథంగా అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే సమీక్షల పేరిట ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

జీవో నెంబర్ 1లో ప్రాజెక్టులకు సంబంధించి అనేక నిబంధనలను పొందుపరిచారు. వాటిలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఈ నిబంధనలను నిశితంగా పరిశీలిస్తే.. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టుల పనులు ప్రారంభించడం సాధ్యం కాదనే విషయం స్పష్టమవుతుంది. పరిపాలన అనుమతులు వచ్చిన తర్వాత రెండేళ్ల లోపు ప్రాజెక్టు పనుల్ని మొదలుపెట్టకపోతే తాజా ఉత్తర్వులను అనుసరించి అవి మళ్లీ మొదటికి వచ్చినట్టే. పై మూడు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు ఇచ్చి రెండేళ్లు గడచిపోయింది. అయితే ఇప్పటికీ వీటి నిర్మాణాలు మొదలు కాలేదు. 

అన్ని అనుమతులు ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గత రెండేళ్లుగా టెండర్లను ఖరారు చేయలేకపోతున్నారు. ఈ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ప్రాజెక్టును మొదలుపెట్టలేదు. అలాగే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కొంతమంది ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించడంతో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య దీనినీ పక్కన పెట్టారు. ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించడంలో రెండేళ్ల నుంచి కాలయాపన జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త జీవోను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పరిపాలన అనుమతుల గడువు ముగిసిపోయినట్టే. ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే మళ్లీ కొత్తగా అనుమతులను తీసుకుని, తిరిగి టెండర్లకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఖర్చు తడిసి మోపెడవుతుంది. 

ఈ ప్రాజెక్టులు నిలిచిపోతాయా?

తాజా జీవో నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టుల భవిష్యత్తూ గందరగోళంలో పడింది. 2013 మార్చి 31వ తేదీ లోపు పూర్తికాకుండా మిగిలిపోయే ప్రాజెక్టులను సమీక్షించాలని కొత్త ఉత్తర్వులో సర్కార్ మెలిక పెట్టింది. ఈ జాబితాలోకి పై మూడు ప్రాజెక్టులతో పాటు మరో 38 ప్రాజెక్టులు వస్తున్నాయి. అది కూడా గత ఏడాది రూపొందించిన అంచనా ప్రకారం. తాజాగా అంచనా రూపొందిస్తే...2013లోపు పూర్తయ్యే ప్రాజెక్టుల సంఖ్య ఇంకా తగ్గనుంది. అంటే 2013 తర్వాత కూడా నిర్మాణం కొనసాగే ప్రాజెక్టుల సంఖ్య పెరగనుంది. ఈ జాబితాలో కల్వకుర్తి, దేవాదుల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. నిర్మాణం జాప్యమయ్యే ప్రాజెక్టులను సమీక్షించిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తాజా ఉత్తర్వుల్లో స్పష్టత లేదు. తాజా నిబంధనలను అనుసరించి సదరు ప్రాజెక్టులను రద్దు చేస్తారా? లేక నిర్మాణ గడువును మరింత పెంచుతారా? వంటి విషయాలపై అధికారులకే సరైన అవగాహన లేకపోవడంతో ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆగిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టులకు నిధుల విడుదలపై అనేక అనుమానాలున్నాయి. రెండేళ్లుగా నిధులను ఇవ్వకుండా, లేనిపోని నిబంధనలను తెరపైకి తీసుకువచ్చి జలయజ్ఞం పనులను నిలిపేసిన సర్కార్...తాజా ఉత్తర్వులతో పరిస్థితిని మరింత గందరగోళానికి తీసుకె ళ్లిందని నీటిపారుదల శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.


వైఎస్ యోచన ఇదీ..

అన్నిరకాల అనుమతులతో పాటు భూ సేకరణ పూర్తయిన తరువాతే నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే సాధ్యమయ్యే పనికాదని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. ఇలాంటి నిబంధనల కారణంగానే రాష్ట్రం ఏర్పడిన తరువాత 50 సంవత్సరాల్లో ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయామని ఆయన తరచూ చెపుతుండేవారు. ప్రాజెక్టుల డిజైనింగ్ పూర్తి కావడంతోనే అనుమతి కోసం కేంద్రానికి దరఖాస్తు చేయడం, టెండర్ల ప్రక్రియ, భూ సేకరణ లాంటివన్నీ ఒకేసారి చేపడితేనే త్వరితగతిన పూర్తవుతాయని ఆయన విశ్వసించారు. తనకున్న రాజకీయ దృఢ సంకల్పంతో వీటిని అధిగమించవచ్చని ఆయన భావించారు. ఉదాహరణకు ఏడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఆయన తన హయాంలోనే అన్ని రకాల అనుమతులు సాధించడంతో పాటు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. అంతేకాదు 12 ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు మరో 21 ప్రాజెక్టులను కూడా పాక్షికంగా పూర్తి చేసి 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. తాజా నిబంధనల ప్రకారమే అప్పట్లోనూ వ్యవహరించినట్లయితే నాగార్జునసాగర్ నిర్మాణం కూడా పూర్తయ్యేది కాదని నీటిపారుదల రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Share this article :

0 comments: