జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై వైఎస్ జగన్

జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై వైఎస్ జగన్

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

జూనియర్ డాక్టర్లకు పరామర్శ... ప్రభుత్వ వ్యవహార శైలిపై ఆవేదన
తమ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి రోజునే డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ డిమాండ్లను ఒక్క కలంపోటుతో తీర్చవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఇలాగే మొండివైఖరి అవలంబిస్తే.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే వాటిని పరిష్కరిస్తుందని జూడాల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. మంగళవారం ఆయన గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లను పరామర్శించారు. గత వారం రోజులుగా దీక్షలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం విషమించి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. వీరిలో రవికుమార్ అనే జూనియర్ డాక్టర్ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వెంటనే ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మిగతా జూనియర్ డాక్టర్లు మాత్రం దీక్ష కొనసాగిస్తున్నారు. ‘డిమాండ్ల సాధనకు ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీ డిమాండ్ల సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. విడతల వారీగా జూడాలు దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. డిమాండ్లు పరిష్కరించుకోవచ్చు’ అని జగన్ వారికి భరోసా ఇచ్చారు.


అనంతరం ఆందోళనలో ఉన్న జూనియర్ డాక్టర్లను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ‘జూడాల డిమాండ్లు చాలా చిన్నవి. ఒక్క కలం పోటుతో ఐదు నిమిషాల్లో పరిష్కరించవచ్చు. కానీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే బాధ కలుగుతోంది’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ‘జూనియర్ డాక్టర్లు పెట్టిన ఒక్క డిమాండ్ మినహా మిగతావన్నీ వెంటనే పరిష్కరించవచ్చు. ఆ ఒక్క డిమాండ్‌పై కూడా జూడాలతో చర్చించి.. వారు చిరునవ్వుతో ఒప్పుకునేలా చేయవచ్చు. ఇలాంటి దానికి కేబినెట్ సబ్‌కమిటీలు అంటూ కాలయాపన చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. ఆమరణ దీక్షల వల్ల విద్యార్థుల్లో బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గిపోయి.. అది కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై అందరం కలిసి తీవ్రంగా ఒత్తిడి తేవాలే తప్ప ప్రాణాలను పణంగా పెట్టవద్దు’ అని జూడాలను కోరారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, రాజ్‌ఠాకూర్, పుత్తా ప్రతాపరెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులున్నారు.

పోలీసుల రాజ్యంలో లేము కదా?

‘మనందరం పౌరసమాజంలో ఉన్నాం. పోలీసుల రాజ్యంలో లేము కదా? ఈరోజు నాకు ఎదురైన పరిస్థితి రేపు మీకు కూడా ఎదురు కావచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలపై ఆవేదనను తెలియజెప్పడానికే వై.ఎస్.విజయమ్మ ప్రధానికి లేఖ రాయాల్సి వచ్చింది’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ తీరుపై వై.ఎస్.విజయమ్మ ప్రధానికి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందంటూ జూడాల దీక్షా శిబిరం వద్ద జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు ఆయనీ విధంగా స్పందించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు ప్రధానికి తెలియవనే అనుకుంటున్నాం. మా నిరసన గళం వినిపించేందుకే ఇక్కడి విషయాలను లేఖ ద్వారా ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చాం’ అని చెప్పారు. ప్రధాని తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
Share this article :

0 comments: