సీబీఐపై సీనియర్ ఐఏఎస్ మహాపాత్ర ధ్వజం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐపై సీనియర్ ఐఏఎస్ మహాపాత్ర ధ్వజం

సీబీఐపై సీనియర్ ఐఏఎస్ మహాపాత్ర ధ్వజం

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012


జరుగుతున్న పరిణామాలను చూస్తే అనుమానం కలుగుతోంది...
దర్యాప్తు మెరిట్స్ ఆధారంగా కొనసాగడం లేదు.. పక్కదారి పడుతున్నట్టుగా ఉంది
ఐఏఎస్‌లను అరెస్టు చేసినందుకు కాదు.. ప్రజా ప్రతినిధులను వదిలేయడంపైనే మా అభ్యంతరం
మంత్రులకు తెలియకుండా ఏ నిర్ణయాలూ జరగవు
ఐఏఎస్‌లపై కక్షసాధింపు ధోరణినే 
సీఎం దృష్టికి తీసుకెళ్లాం
మహిళా మంత్రి ఇంటికెళ్లి విచారిస్తారు.. మహిళా అధికారి విషయంలో అలా ఎందుకు చేయలేదు?
దెబ్బతగిలిన వారికే బాధ తెలుస్తుంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ దర్యాప్తు రిమోట్ కంట్రోల్‌తో సాగుతున్నట్టుందని సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశాంత మహాపాత్ర వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోందని అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను అరెస్టు చేసి సాక్ష్యాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్న సీబీఐ అధికారులు.. రాజకీయ నేతలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రులకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు జరగవని స్పష్టం చేశారు. ఒకవేళ జరిగినట్లు వారు భావిస్తే తప్పుచేసిన అధికారులపై చర్య తీసుకోకుండా ఇంతకాలం ఎందుకు ఆగారని నిలదీశారు. చార్జిషీటు దాఖలు చేసేటప్పుడైనా నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. దర్యాప్తు మెరిట్స్ ఆధారంగా కొనసాగడం లేదని, పక్కదారి పడుతున్నట్టుగా ఉందని చెప్పారు. ఐఏఎస్‌లను విచారించడాన్ని తాము తప్పుబట్టడం లేదని, అరెస్టు చేసినప్పటికీ మౌనంగానే ఉన్నామని.. ప్రజా ప్రతినిధులను ఎందుకు ప్రశ్నించడం లేదనేదే తమ అభ్యంతరం అని అన్నారు.

ఐఏఎస్‌లపై కక్షసాధింపు ధోరణితో సీబీఐ విచారణ సాగుతోందన్న ఉద్దేశంతోనే తాము విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని మహాపాత్ర మంగళవారం న్యూస్‌లైన్‌కు తెలిపారు. తాము సీఎంకు ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులపై సీబీఐ విచారణ జరపొద్దని, చర్యలు తీసుకోవద్దని తామెక్కడా అనలేదని తెలిపారు. విచారణలో వివక్ష ప్రదర్శించడాన్ని మాత్రమే తప్పుపడుతున్నామని చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో స్వయంగా మహిళా మంత్రి ఇంటికి వెళ్లి విచారించి సాక్ష్యం నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు.. మహిళా అధికారిని ఆమె ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ విచారించకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు పంపించిన నోట్‌ఫైల్‌లో ఉన్న పదం జీవోలో లేదని మంత్రి వ్యాఖ్యానించారని, అలాంటప్పుడు ఆ అధికారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.

అవి తప్పుడు నిర్ణయాలైతే.. ఎందుకు రద్దు చేయరు?

గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పని భావిస్తే... వాటిని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని మహాపాత్ర నిలదీశారు. అన్నీ ఒక్కసారిగా రద్దు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఓ మంత్రి అంటున్నారని, కానీ అసెంబ్లీలో చట్టం తీసుకువస్తే కోర్టులు కూడా ఏమీ చేయలేవు కదా.. అని వ్యాఖ్యానించారు. అధికారులు ఒకవేళ తప్పుచేస్తే దాన్ని వెంటనే తెలుసుకోవడంలో ఆలస్యం కావచ్చునని, అదే రాజకీయ నాయకులకైతే చాలామంది నుంచి సమాచారం అందుతుందని, అప్పుడైనా దానిని సరిచేయవచ్చు కదా అని ప్రశ్నించారు. అధికారులు తమ విధి నిర్వహణలో డబ్బు తీసుకున్నా, నిజాయతీగా వ్యవహరించకున్నా.. వారిని రక్షించాలని తాము కోరడంలేదన్నారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అధికారులందరూ అవినీతికి పాల్పడ్డారా..? లేదా..? అన్న విషయాలూ తమకు తెలియదన్నారు.

సీబీఐ వ్యవహారశైలిపై బాధిత అధికారులు తమ దృష్టికి తీసుకుని వచ్చిన విషయాలపై మాత్రమే తాము స్పందించినట్లు వివరించారు. ‘చార్జిషీటులో పేరుంటే ఏమవుతుంది...? నేరం చేసినట్లు కాదు కదా..’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘దెబ్బ తగిలిన వారికే బాధ తెలుస్తుంది..’ అని అన్నారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా సాక్ష్యాల సేకరణకు సీబీఐ అధికారులు ఎందుకు ప్రయత్నించడం లేదని మళ్లీ నిలదీశారు. ‘ఐఏఎస్‌లపై చార్జిషీటు వేశారు. అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులను కూడా ప్రశ్నిస్తామని సీబీఐని ప్రకటించమనండి’ అని మహాపాత్ర అన్నారు.
Share this article :

0 comments: