పాఠ్య పుస్తకాల్లో గోల్‌మాల్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాఠ్య పుస్తకాల్లో గోల్‌మాల్!

పాఠ్య పుస్తకాల్లో గోల్‌మాల్!

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

సగానికిపైగా పెరగనున్న సేల్ పుస్తకాల ధరలు
వచ్చే జూన్‌లో దాదాపు 50 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై భారం
పుస్తకాల నాణ్యతా ప్రమాణాలు మారినా.. టెండర్లు పిలువకుండానే 
ముద్రణ పనులు అప్పగించాలని నిర్ణయం
కొత్తగా టెండర్ల కోసం వచ్చిన విజ్ఞాపనలు బుట్టదాఖలు
విద్యాశాఖలో నిబంధనలకు నీళ్లు
ముద్రణ పనుల్లో ఓ మంత్రి ప్రమేయంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

హైదరాబాద్, న్యూస్‌లైన్:వారికి నిబంధనలు ఎలాగూ పట్టవు.. సుమారు 50 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అసలే పట్టదు! కావాల్సిందల్లా కమీషన్లు.. ఆమ్యామ్యాలు!! ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు విక్రయించాల్సిన సేల్ పుస్తకాల ముద్రణ వ్యవహారంలో సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. పబ్లిషర్ల ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు నీళ్లొదిలింది. పేపర్ క్వాలిటీ, పర్‌ఫెక్ట్ బైండింగ్ విధానం, కవర్‌కార్డు (స్పెసిఫికేషన్స్-నాణ్యతా ప్రమాణాలు) మారినపుడు మళ్లీ టెండర్లు పిలిచి పనులను అప్పగించాల్సి ఉన్నా.. లెక్కచేయలేదు. కొత్త టెండర్లు పిలవకుండా సేల్ పుస్తకాల ముద్రణ పనులను పబ్లిషర్లకు అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాదు ముద్రణ సంస్థల నుంచి వస్తున్న ఒత్తిడితో భారీ మొత్తంలో పుస్తక ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తోంది. అదే జరిగితే వచ్చే జూన్‌లో ప్రైవేటు పుస్తకాల రేట్లు చుక్కలనంటడం.. ప్రైవేటు పాఠశాలల్లో చదివే దాదాపు 50 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.15 కోట్ల అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది! భారీ మొత్తంలో కమీషన్ల దందాకు తెర లేపిన ఈ వ్యవహారంలో విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి, ఓ మంత్రి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టెండరు నిబంధనలకు మంగళం: ఇటీవల రూ.3 కోట్ల విలువైన పుస్తక ముద్రణ ఫిల్మ్‌ల (పాజిటివ్/నెగటివ్) వ్యవహారంలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆ ఒప్పందాన్ని గడువుకన్నా నాలుగు నెలల ముందే రద్దు చేసిన విద్యాశాఖ.. ఇప్పుడు దాదాపు రూ.40 కోట్ల విలువైన సేల్ పుస్తకాల వ్యవహారంలో మాత్రం అడ్డగోలు విధానాలను అనుసరిస్తోంది. ముద్రణ సంస్థల ఒత్తిడికి తలొగ్గి ఏకపక్షంగా పనులను అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. నాణ్యతా ప్రమాణాలు మారినపుడు కొత్త టెండర్లు పిలవాల్సి ఉన్నా.. అలా చేయలేదు. పాత టెండర్లను రద్దు చేసి, తాజాగా టెండర్లు పిలవాలని అధికారులకు విజ్ఞాపనలు అందినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. కొత్తగా టెండర్లను పిలవకపోవడం వెనుక అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు కొందరికి మేలు చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా అక్రమాల జాతర..!

సర్కారీ స్కూళ్లలో చదివే 79 లక్షల మంది విద్యార్థులకు వచ్చే జూన్‌లో ఇవ్వాల్సిన ఉచిత పాఠ్య పుస్తకాల నాణ్యతను సూపర్ క్వాలిటీకి పెంచి ముద్రించే ందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో కూడా ఎల్-1ను (టీఎన్‌పీఎల్) కాదని, తమ అనుకూల సంస్థలకు పేపరు సరఫరా ఆర్డర్‌ను ఇచ్చే ప్రయత్నం చే సింది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు విక్రయించాల్సిన సేల్ పుస్తకాలనూ సూపర్ క్వాలిటీ పేపరుతో ముద్రించాలని నిర్ణయించింది. 70 జీఎస్‌ఎం విత్ మిల్క్ షెడ్ వాటర్ మార్కు కలిగిన పేపరు, బైండింగ్, కవర్ కార్డును మారుస్తోంది. దీంతో రూ.25 కోట్లు కావాల్సిన వ్యయం రూ.40 కోట్లకు పైగా చేరుకుంటుందని అంచనా. ఈ భారమంతా చివరికి విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడనుంది. ఇదిలా ఉంటే మరో వివాదాస్పద చర్యకు విద్యాశాఖ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉచిత పాఠ్య పుస్తకాలకు అవసరమైన పేపరును సరఫరా చేసే టీఎన్‌పీఎల్ కోట్ చేసిన రేటు కంటే.. అధిక ధరను పరిగణనలోకి తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 

‘రాయల్’గా దగా..: సాధారణంగా ఏదైనా ఓ పుస్తకం రాసిన రచయితకు... వాటిని ముద్రించే పబ్లిషర్ ఒక్కో పుస్తకం కవర్ ప్రైజ్‌పై 10 శాతం నుంచి 25 శాతానికి పైగా రాయల్టీ ఇస్తుంటారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు మాత్రం సేల్ పుస్తకాల విషయంలో ఒక్కో పుస్తకానికి 10 పైసలు ఇస్తే చాలని చెబుతున్నాయి. తద్వారా సర్కారుకు రావాల్సిన సొమ్ముకు గండికొడుతున్నారు. పుస్తకం రేట్లను పరిగణనలోకి తీసుకోకుండానే రాయల్టీని నిర్ణయించేశారు. రూ.10 పుస్తకానికి 10 పైసలే.. రూ.30ల పుస్తకానికి 10 పైసల రాయల్టీ ఇస్తే చాలని స్వయంగా విద్యాశాఖే చెబుతుండటం గమనార్హం. ఒక్కో పుస్తకంలోని ఒక్కో పేజీకి అవసరమైన పాజిటివ్/నెగటివ్ ఫిల్మ్‌లను కూడా ప్రభుత్వ ముద్రణాలయమే ఇస్తోంది. మార్కెట్ పాయింట్లను కూడా చూపిస్తోంది. పబ్లిషర్లు చేయాల్సిందల్లా పేపరు కొనుక్కొని, ముద్రించి మార్కెట్ పాయింట్లలో అమ్ముకోవడమే. అయినా వారి నుంచి రాయల్టీ కింద ఒక్కో పుస్తకంపై కేవలం 10 పైసలను మాత్రమే కోరడంపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి.

భారీగా పెరగనున్న పుస్తక ధరలు..

ప్రైవేటు స్కూల్ విద్యార్థుల పదో తరగతి పాఠ్య పుస్తకాల సెట్టు 2010లో రూ.311 ఉండగా.. సర్కారు గత ఏడాది నాణ్యత పేరుతో 25 శాతం ధరలు పెంచింది. ఒక్కో సెట్టు ధర రూ.361 చేసింది. ఇక ఈసారి (వచ్చే జూన్‌లో) సూపర్ క్వాలిటీ పేరుతో 50 శాతం ధరల పెంపునకు ఓకే చెప్పింది. అంటే వీటి ధర ఏకంగా రూ.490లకు చేరుకోనుంది. జూన్‌లో పదో తరగతిలో చేరే దాదాపు 5 లక్షల మంది ప్రైవేటు స్కూల్ విద్యార్థులపై ఈ భారం తప్పదు. వీరే కాదు ఒకటి నుంచి 10 వరకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల ధరలు పెరగనున్నాయి. సూపర్ క్వాలిటీ కోసం అదనంగా వెచ్చించాల్సి వస్తున్న దాదాపు రూ.15 కోట్ల భారం విద్యార్థుల తల్లిదండ్రులపైనే వేసేం దుకు సర్కారు సిద్ధమైంది. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే పాఠ్య పుస్తకాలకు అవసరమైన పేపరు ఖర్చుతో పోల్చితేనే ఈ భారం! అలాగాకుండా ఈ పేపరు ఖర్చును ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ భారమింకా పెరుగుతుంది. ఎందుకంటే.. ఉచిత పుస్తకాలకు అవసరమైన పేపరును సరఫరా చేసే సంస్థ చాలా తక్కువ రేటు (ఒక్క టన్నుకు రూ. 42,930) కోట్ చేసిందని, సేల్ పుస్తకాల విషయంలో ఆ రేటును పెంచాలంటూ ముద్రణ సంస్థల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఉచిత పుస్తకాల పేపరు ధరలకంటే ఎక్కువ ధరలను పరిగణనలోకి తీసుకునే దిశగా పావులు కదుపుతోంది. అదే జరిగితే పుస్తకాల భారం మరింత పెరుగుతుంది. విద్యా సంవత్సరం మొదలై నెలలు గడస్తున్నా ఉచిత పుస్తకాలు సరఫరా చేయడానికి సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూడకుండా అధిక ధరలైనా సేల్ పుస్తకాలే కొనాల్సిన పరిస్థితి.

సేల్ పుస్తకాలు అంటే..

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విక్రయించే పుస్తకాలను సేల్ పుస్తకాలు అంటారు. విద్యాశాఖ అనుమతి, నిర్ణయించిన రేట్ల ప్రకారం వీటిని ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తారు. ఏటా దాదాపు 50 లక్షల మంది విద్యార్థుల కోసం దాదాపు 2 కోట్ల పుస్తకాలు ఇలా ముద్రిస్తారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయమే ముద్రించి ఉచితంగా సరఫరా చేస్తుంది.
Share this article :

0 comments: