శరవేగంగా తగ్గుతున్న చేనేత కార్మికుల సంఖ్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శరవేగంగా తగ్గుతున్న చేనేత కార్మికుల సంఖ్య

శరవేగంగా తగ్గుతున్న చేనేత కార్మికుల సంఖ్య

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012

*నిర్లక్ష్యంతో నేతన్నల ఉసురు పోసుకుంటున్న సర్కారు
*గతేడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 50 చేనేత ఆత్మహత్యలు
*శరవేగంగా తగ్గుతున్న చేనేత కార్మికుల సంఖ్య
*చేనేత సహకార సంఘాల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వైనం
*పనీ లేదు, చేసిన దానికి ఫలం లేదు.. కూలీ, వలస బాటలో నేతన్న
*ఇటు అప్పులు, అటు అందని రుణ హామీ.. చోద్యం చూస్తున్న సర్కారు
*పరిహారమిస్తే ఆత్మహత్యలు పెరుగుతాయన్న ఘనుడు చంద్రబాబు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరను నేసిన ఘనతంతా గతం. నేతన్న జీవితం నేడు అగ్గిపెట్టె కన్నా ఇరుకుగా మారింది. చేసేందుకు పని లేదు.. చేసిన పనికి కడుపు నిండదు. తరతరాలుగా ఆధారపడ్డ వృత్తినే నమ్ముకుంటే బతుకు గడవని దుస్థితి. తప్పనిసరై తీసుకున్న బ్యాంకు అప్పు ఎప్పటికి మాఫీ అవుతుందో తెలియదు. పూట గడవాలన్నా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి! చేసిన పనికి ఆరు నెలలైనా వేతనాలు రాక, అప్పులు తీర్చలేక, తరతరాల చేతి వృత్తిని వదల్లేక వదల్లేక వదిలి, కూలీ పనికి దిగాల్సిన దుర్భర స్థితిలో నేతన్నది దిక్కులేని బతుకైపోయింది! ఫలితంగా రాష్ట్రంలో చేనేత మగ్గాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. మరికొన్నేళ్లలో రాష్ట్రంలో చేనేత మగ్గం ఓ చారిత్రక వస్తువులా మిగిలిపోయే ప్రమాదమూ పొంచి ఉంది. చేనేత కార్మికుల సంఖ్య 3 లక్షల నుంచి 1.8 లక్షలకు తగ్గిందన్న కేంద్ర చేనేత శాఖ తాజా గణాంకాలు కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

ఇంతటి దుర్భర దైన్యం నుంచి నేతన్నను గట్టెక్కించేందుకు సర్కారు చేస్తున్నది.. శూన్యం! అవును.. అక్షరాలా శూన్యమే!! పరిహారమిస్తే ఆత్మహత్యలు పెరుగుతాయంటూ సీఎం హోదాలో క్రూరంగా పరిహాసమాడిన చరిత్ర చంద్రబాబుదైతే.. అందుకు ఏ మాత్రమూ తీసిపోని రీతిలో, అంతులేని నిర్లక్ష్యంతో నేతన్నల ఉసురు పోసుకుంటున్న నిష్క్రియాపరత్వం కిరణ్ ప్రభుత్వానిది! చేనేత రుణ మాఫీని అమలు చేస్తామన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దాంతో ఇటు వృత్తి గిట్టుబాటు కాక, అటు బ్యాంకర్ల వేధింపులకు తాళలేక చావు బాట పట్టడం కార్మికుల వంతవుతోంది! అలా 2011లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 50 మందికి పైగా నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు!!

అమలు కాని రుణ మాఫీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన చేనేత కార్మికులను ఆదుకునేందుకు 2009-10 బడ్జెట్‌లో రూ.312 కోట్లను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు. దాన్ని కాస్తా కిరణ్ సర్కారు 2011-12లో రూ.200 కోట్లకు తగ్గించింది! అందులో కూడా ఇప్పటికి విడుదల చేసింది.. కేవలం రూ.134 కోట్లు! ఆ మేరకు రుణాలను మాఫీ చేసినట్టు ఘనంగా ప్రభుత్వం ప్రకటించినా.. ఒక్క కార్మికుడికి కూడా అందుకు సంబంధించి రసీదులే అందలేదు. ఇక వ్యక్తిగత రుణ మాఫీకైతే ఇప్పటికీ అతీగతీ లేదు! దాంతో చేనేత కార్మికులపై బ్యాంకర్ల వేధింపులు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. పైగా పాత రుణాలు చెల్లించేదాకా కొత్త రుణాలిచ్చేది లేదంటూ బ్యాంకర్లు మెలిక పెడుతున్నారు. వాటికి తాళలేక కార్మికులు నిస్సహాయంగా బతుకు యాత్రను ముగిస్తున్నారు. గత నెల రోజుల్లో ఒక్క అనంతపురం జిల్లా ధర్మవరంలోనే ఏకంగా ముగ్గురు చేనేత కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారంటేనే.. బ్యాంకర్ల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు!

వేతన వెతలు....!
రాష్ట్రంలో 1,250 సహకార సంఘాలున్నాయి. ప్రభుత్వం శీతకన్నేయడంతో అవి ఎందుకూ పనికిరాకుండాపోతున్నాయి. నగదు చెల్లించాల్సిందేనంటూ ఆప్కోకు నూలు సరఫరాను జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఆపేసింది. దాంతో సంఘాలకు కూడా ఆప్కో నూలు అందించక, వాటిలోని కార్మికులకు చేతినిండా పని దొరకడం లేదు. మార్కెట్లో అధిక ధరకు నూలు కొనుగోలు చేసి ఆప్కోకు సరఫరా చేసిన వస్త్రాలకు కూడా చెల్లింపులకు దిక్కు లేదు! దాంతో నూలు కోసం చేసిన అప్పుల కుప్ప ఇప్పుడు సంఘాలను బాధిస్తోంది. వడ్డీలు పెరిగి.. చివరకు సంఘాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. పలు ప్రభుత్వ శాఖల నుంచి ఆప్కోకు రావాల్సిన రూ.45 కోట్ల బకాయిలు రాకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఆప్కో నుంచి చెల్లింపుల్లేక చేనేత కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలే లేవు! దాంతో వారు పస్తులతో కాలం గడుపుతున్నారు! ఇక సరఫరా చేసేందుకు నూలే లేక, సబ్సిడీ నూలు పథకం ప్రహసంగా మారింది.

యూనిఫారాలూ ప్రైవేటుకే!
సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని కాపాడేందుకు దివంగత సీఎం వైఎస్ బడి పిల్లల యూనిఫారాల సరఫరా బాధ్యతను ఆప్కోకు కట్టెబట్టారు. ఒక్కో విద్యార్థికి 2 నుంచి 4 జతల యూనిఫారాలు ఇవ్వడం ద్వారా చేనేత వస్త్రాలకు ఆదరణ పెంచడంతో పాటు చేనేత కార్మికులకు ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగు పడేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ మృతి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం యూనిఫారాల సరఫరా బాధ్యతను ఆప్కో నుంచి తప్పించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం మొదలు పెట్టింది! 50 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారాలు సరఫరా చేసే రూ.210 కోట్ల ప్రాజెక్టును ఆప్కోకే కేటాయించానలి చేనేత మంత్రి హోదాలో శంకర్రావు సీఎం కిరణ్‌కు లేఖ రాసినా ప్రయోజనం శూన్యం!

బాబు హయాం పాపాలకూ పరిహారం!
బాబు హయాంలో చేనేత వృత్తి అభివృద్ధి సంగతి దేవుడెరుగు, దాన్ని ఆదుకునేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమమేదీ చేపట్టలేదు! సరికదా, నిండా అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్యలు చేసుకున్న కార్మికులను క్రూరంగా పరిహసించారు. వారికుటుంబాలను ఆదుకునే మానవత్వం కూడా చంద్రబాబుకు కరువైంది. పైగా ఆర్థికంగా ఆదుకుంటే, ప్రభుత్వమిచ్చే పైసల కోసం మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటారని వ్యాఖ్యానించిన చరిత్ర బాబుది! వైఎస్ 2004లో అధికారంలోకి రాగానే బాబు హయాం నాటి చేనేత పాపాలను కడిగేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా 1997 నుంచి 2004 దాకా బాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న 200 మంది చేనేత కార్మికులకు కూడా పరిహారం చెల్లించారు! అందుకోసం ప్రత్యేకంగా 2006లో ఉత్తర్వులు (జీవో నంబర్ 119) కూడా జారీ చేశారు. కానీ వైఎస్ మరణానంతరం ఆ జీవోలను, వైఎస్ స్ఫూర్తినీ కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆ తర్వాత కేవలం మూడు కుటుంబాలకే పరిహారమిచ్చారు. 

అనంతపురం జిల్లాలో ఒక్క ధర్మవరంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో ఒక్క కుటుంబానికి కూడా పరిహారం అందలేదు. శవపరీక్ష నివేదిక లేదనో, ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేత పని చేయడం లేదనో కుంటిసాకులతో మొండిచేయి చూపుతున్నారు. నేతన్న దుస్థితిని అస్సలు పట్టించుకోని కిరణ్ సర్కారు తీరు అచ్చం బాబు మార్కు ఆటవిక పాలననే గుర్తుకు తెస్తోంది. గతేడాది మరణించిన 50 మంది చేనేత కార్మికుల్లో ఇప్పటిదాకా కనాకష్టంగా కేవలం ఏడుగురి కుటుంబాలకు పరిహారంతో సరిపెట్టింది!

నల్లారి.. నామమాత్రపు హామీ..!
చేనేత పరిశ్రమను ఆదుకోవాలంటూ 2010 డిసెంబర్‌లో ధర్మవరంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేయడం, వారికి మద్దతుగా 2010 డిసెంబర్ 25న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరంలో పర్యటించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో.. ఒక్కో నేతన్నకు రాయితీపై నెలకు నాలుగు కిలోల రేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. పావలా వడ్డీకే రుణాలూ ఇప్పిస్తామన్నారు. అందుకోసం అర్హులందరికీ రుణ పరపతి కార్డులిస్తామని కూడా ప్రకటించారు. రుణ మాఫీకి తక్షణం నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీలేవీ నేటికీ అమలుకు నోచుకోలేదు!

ప్రభుత్వం చేయాల్సింది ఇదీ...
*రుణ మాఫీని వెంటనే అమలు చేయాలి. కొత్త రుణాలను ఇప్పించాలి.
*రుణ మాఫీ గడువును 2011 మార్చి 31కి పెంచాలి
*రుణ మాఫీ కోసం బడ్జెట్లో వైఎస్ కేటాయించిన మొత్తం రూ.312 కోట్లనూ చేనేత కార్మికుల అభివృద్ధికే వెచ్చించాలి
*ఆప్కో బకాయిలను తక్షణం విడుదల చేయాలి
*సహకార సంఘాలకు కావాల్సిన మొత్తం నూలునూ ఆప్కో ద్వారా సరఫరా చేయాలి
సిల్క్ యార్న్ సబ్సడీని కుటుంబాన్ని యూనిట్‌గా కాకుండా మగ్గాన్ని యూనిట్‌గా పరిగణించి అందజేయాలి.
Share this article :

0 comments: