బొత్స చౌకబారు ఎత్తుగడలకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స చౌకబారు ఎత్తుగడలకు

బొత్స చౌకబారు ఎత్తుగడలకు

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఇరకాటంలో పెట్టాలని చూస్తూంటే... ఆయన మాత్రం వారిద్దరి లాలూచీని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో తన పేరు ఉన్నట్లు ముఖ్యమంత్రి కనుక వెల్లడిస్తే కిరణ్, బాబు కుమ్మక్కైన విషయాన్ని తాను కూడా బయటపెడతానని చెబుతూ బొత్స చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 

అసెంబ్లీ లాబీల్లో కెమెరాలు లేనపుడు బొత్స మీడియాతో నెరపిన ఇష్టాగోష్టిలో కిరణ్ సర్కారుతో బాబు లాలూచీ పడ్డారని అంగీకరించి, అంతలోనే విలేకరుల సమావేశం పెట్టి తానలా అనలేదని బుకాయించడం వెనుక మర్మం ఇదేనని చెప్పారు. మద్యం ముడుపుల కుంభకోణం వివరాలను వెల్లడించాలని పట్టుబడుతున్న బాబు ఒత్తిడికి లొంగి ముఖ్యమంత్రి తన పేరెక్కడ బయట పెడతారోనని భీతిల్లిన బొత్స ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

కొద్దిసేపట్లోనే బొత్స మాట మార్చడం ఎవరిని మోసం చేయడానికి, రాష్ట్ర ప్రజలనా లేక కాంగ్రెస్ శ్రేణులనా? అని ఆయన ప్రశ్నించారు. కిరణ్, బాబు కుమ్మక్కయ్యారని నిన్న మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి, నేడు బొత్స చెప్పారనీ... అయితే వీరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని తమ పార్టీ ఎప్పట్నుంచో చెబుతోందని అంబటి గుర్తుచేశారు. మానవహక్కుల కమిషన్ అధ్యక్షుడుగా తెలుగు భాష రాని కక్రూను నియమించినపుడే మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని తాము చెప్పామనీ, తెలుగు భాషపై అభిమానం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ నాయకుడు మాట మాత్రంగానైనా పరభాషా వ్యక్తి నియామకాన్ని వ్యతిరేకించలేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో కూడా అదే జరిగిందని బొత్స మాటలను బట్టి తెలుస్తోందని చెప్పారు. 

విజయమ్మ లేఖతో ఉలిక్కిపడిన బాబు...
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై భూ కేటాయింపుల విచారణకు శాసనసభా సంఘం ఏర్పాటు చేశారని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శాసనసభ స్పీకర్‌కు లేఖ రాయగానే బాబు ఉలిక్కిపడ్డారని అంబటి ఎద్దేవా చేశారు. సభా సంఘాన్ని వ్యతిరేకించకుండా మౌనంగా ఉంటే తాను, కిరణ్‌తో కుమ్మక్కయ్యాయనే నిజం వెల్లడవుతుందనే భయంతో వారం తరువాత వ్యతిరేకించారని విమర్శించారు. నిర్ణయం తీసుకున్న 11 నెలలకు హడావుడిగా నియమించిన ఈ కమిటీ వైఎస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపైనే విచారణ జరపాలనుకోవడం అధికార, ప్రతిపక్షాలు కలిసి పన్నిన కుట్రగా అభివర్ణించారు. 

ప్రపంచీకరణ, సరళీకృత విధానాల అమలు ప్రారంభమైనప్పటినుంచీ జరిగిన భూకేటాయింపులపై విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు. చంద్రబాబు, రోశయ్య, కిరణ్ హయాంలో కేటాయించిన భూకేటాయింపులపై విచారణ జరగకూడదనుకోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేయాలనీ, అపుడు మాత్రమే తాను నీతివంతుడనని చెప్పుకుంటే బాగుంటుందని రాంబాబు సూచించారు.
Share this article :

0 comments: