అత్యవసర సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అత్యవసర సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

అత్యవసర సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

డిమాండ్ల పరిష్కారంలో సర్కారు మొండి వైఖరికి నిరసనగా నిర్ణయం
కోర్కెల సాధనకు కొన్ని రోజులుగా సమ్మె, ఆమరణ దీక్షలు చేస్తున్న జూడాలు
సమ్మె విరమిస్తేనే చర్చలన్న ప్రభుత్వం
కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 
అత్యవసర సేవల బంద్‌తో అల్లాడుతున్న రోగులు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా జూనియర్ డాక్టర్లు(జూడాలు) రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలను బహిష్కరించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా వైద్య సేవలను బహిష్కరించి.. కొన్ని రోజులుగా సమ్మె బాట పట్టిన జూడాలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అత్యవసర వైద్య సేవలనూ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఫలితంగా పేదోళ్ల పెద్దాసుపత్రులుగా పేరొందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ; విశాఖపట్నంలోని కింగ్‌జార్జి(కేజీహెచ్), వరంగల్ ఎంజీఎం, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా పది ప్రభుత్వ బోధనాస్పత్రులతోపాటు వాటి అనుబంధ సర్కారీ దవాఖానాల్లోని వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. జూడాలు సమ్మెకు వెళ్లడంతో కొన్ని రోజులుగా సరైన వైద్య సేవలు అందక రోగులు అల్లాడుతుండగా.. ఇప్పుడు అత్యవసర సేవలూ బంద్ కావడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఇన్‌పేషెంట్లనైతే.. పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు సమ్మె విరమించి రోగులకు సేవలు అందిస్తేనే.. జూడాలతో చర్చిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించినా.. ఎక్కడా వాటి జాడే కానరాలేదు. 

ప్రభుత్వంతో తాడోపేడో...

న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మొండివైఖరి వీడనందున విధిలేని పరిస్థితుల్లోనే అత్యవసర సేవలను బహిష్కరించాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తమకు మరో మార్గం లేనందునే.. రోగులకు ఇబ్బందని తెలిసినా అత్యవసర సేవలను బహిష్కరించక తప్పలేదని చెప్పారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. తమ డిమాండ్లను గొంతెమ్మ కోర్కెలుగా అభివర్ణిస్తూ ప్రజల్లో తమను చులకన చేయాలని ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. అవసరమైతే డిగ్రీలనైనా వదులుకుంటాం తప్ప.. ఎస్మావంటి నల్లచట్టాలకు బెదిరేది లేదని జూడాల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఫణిమహేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంతో జరిగే పోరాటంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. 

రోగుల విలవిల

జూడాలు అత్యవసర సేవలను బహిష్కరించడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులతోపాటు వాటి పరిధిలోకి వచ్చే పలు సర్కారు ఆస్పత్రుల్లో రోగులు విలవిలలాడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన పలు ఆపరేషన్లు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పినా.. ఆస్పత్రులకు వచ్చిన రోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. హైదరాబాద్‌లో చావు బతుకుల మధ్య ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడంతో రోగుల బంధువులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి డ్రెస్సింగ్ చేసేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో రోగులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 

అటు వరంగల్‌లోని ఎంజీఎం, విజయవాడ ప్రభుత్వాసుపత్రితోపాటు విశాఖ కేజీహెచ్, తిరుపతి రుయా, గుంటూరు, కాకినాడ, కర్నూలు మెడికల్ కాలేజీల్లోనూ అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 350 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. వారి పర్యవేక్షణకు నలుగురు వైద్యులు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక అత్యవసర వైద్యం నిమిత్తం రోగులు వచ్చినా చేర్చుకునే పరిస్థితి ఉండదని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చెందిన ఓ ప్రొఫెసర్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. ‘ధనికులకేమీ ఇబ్బంది లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళతారు. అత్యవసర వైద్యం నిమిత్తం సర్కారు ఆస్పత్రులకు వచ్చే రోగులకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు’ అని హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. 

ఆస్పత్రుల్లో వీరే ‘అత్యవసరం’..

బోధనాస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక జూనియర్ డాక్టర్లదే. రేయింబవళ్లు షిప్టులవారీగా విధులు నిర్వహిస్తూ ఇన్‌పేషెంట్లకు వైద్యం అందిస్తారు. అత్యవసర వైద్యం నిమిత్తం వచ్చే రోగులకు క్యాజువాలిటీలో వైద్య సేవలు అందించేది కూడా వీరే. రోగి పరిస్థితి మరీ విషమంగా ఉంటేనే.. సీనియర్ వైద్యులకు (ప్రొఫెసర్లకు) చూపిస్తారు. సాధారణ రోగులకు జూడాలే వైద్యం చేస్తారు. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు కూడా వైద్య పరీక్షల నిర్వహణ, వైద్య సేవల విషయంలో వైద్యులకు జూనియర్ డాక్టర్లు సహాయ సహకారాలు అందిస్తారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోకంటే బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగ్గా ఉండటానికి జూని యర్ డాక్టర్లు ఉండటమే ప్రధాన కారణమన్నది కాదనలేని సత్యం.
Share this article :

0 comments: