ఒకరికి రాష్ట్రం, మరొకరికి జిల్లా రాసిచ్చిన ముఖ్యుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకరికి రాష్ట్రం, మరొకరికి జిల్లా రాసిచ్చిన ముఖ్యుడు

ఒకరికి రాష్ట్రం, మరొకరికి జిల్లా రాసిచ్చిన ముఖ్యుడు

Written By ysrcongress on Tuesday, February 14, 2012 | 2/14/2012

అధికారిక నిర్ణయాలన్నీ వారి కనుసన్నల్లోనే
టెండర్ల నుంచి బదిలీల దాకా అన్నింట్లోనూ వారే
ఒకరికి రాష్ట్రం, మరొకరికి జిల్లా రాసిచ్చిన ముఖ్యుడు
వారు చెప్పిందే చట్టం, చేసిందే నిర్ణయంగా చెల్లుబాటు
ఎలాంటి నిర్ణయాలైనా వారు చెప్పేదాకా పెండింగులోనే
మాట వినని అధికారులకు శంకరగిరి మాన్యాలే గతి
ఇటు మంత్రుల్లో, అటు అధికారుల్లో తీవ్ర నిరసనలు

ఓ సినిమాలో విలన్ రాజకీయ నాయకుని అవతారమెత్తుతాడు. రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. తన బర్త్‌డే కేకును రాష్ట్రం ఆకారంలో తయారు చేయించి.. దాన్ని జిల్లాలవారీగా ముక్కలు చేస్తూ, ఒక్కో ముక్కను ఒక్కో అనుచరునికి పంచిస్తాడు. పండుగ చేసుకొమ్మంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోంది. అక్షరాలా బినామీ పాలన కొనసాగుతోంది. తేడా ఒక్కటే. సినిమాలో అనుచరుల స్థానాన్ని ముఖ్యనేత తన సోదరులతో భర్తీ చేశారు. ఒకరికి రాష్ట్రాన్ని, మరొకరికి తన సొంత జిల్లాను సదరు నేత ప్రేమతో పంపకం పెట్టారు. నాటి నుంచీ అన్నింటా అక్షరాలా వారే రాజ్యమేలుతున్నారు. అటు రాష్ట్రంలోనూ, ఇటు ‘ముఖ్యుని’ జిల్లాలోనూ టెండర్లు, సెటిల్మెంట్లు మొదలుకుని అధికారుల బదిలీల దాకా ప్రతీదీ వారి కనుసన్నల్లో జరగాల్సిందే. వారు అందుబాటులో లేకపోతే ఎంత పెద్ద నిర్ణయమైనా సరే, ఎన్ని రోజులైనా అలా పెండింగులో పడుండాల్సిందే! ఎంత పెద్ద అధికారులైనా వారి ఆదేశాలను బేఖాతరు చేసిన మరుక్షణం శంకరగిరి మాన్యాలు పట్టిపోవాల్సిందే. వారితో కుదుర్చుకున్న ‘ఒప్పందాన్ని’ ఉల్లంఘిస్తే మహా మహా మద్యం సిండికేట్లయినా సరే, దాని పర్యవసానాలను చవిచూడాల్సిందే. సోదరుల పాలనపై అటు పాలక పక్షంలోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది!

అది రాజధాని నగరంలో ఎమ్మెల్యేల వసతి కోసం తలపెట్టిన బహుళ అంతస్తుల భవనం. దాని నిర్మాణ పనులు దక్కేలా చూస్తానని రాష్ట్ర మంత్రి ఒకరు తనకు సన్నిహితంగా ఉండే ఓ నిర్మాణ సంస్థకు మాటిచ్చారు. తద్వారా, తన సొంత జిల్లాలో థర్మల్ విద్యుత్కేంద్రం ఏర్పాటులో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్న సదరు సంస్థను సంతృప్తి పరచాలని భావించారు. సాంకేతికంగా ఆ సంస్థకే టెండర్ దక్కేలా నిబంధనలు కూడా ఖరారు చేశారు. ఇంకేముంది.. రూ.130 కోట్ల ఆ టెండర్ ఇక తమదేనని ఆ సంస్థకు భరోసా కలిగింది. కానీ, చివరి క్షణంలో ముఖ్య నేత సోదరుడు రంగప్రవేశం చేశాడు. తాను సిఫారసు చేసిన కంపెనీకే ఆ టెండర్ దక్కాలని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశాడు. అంతే... అతను సిఫార్సు చేసిన సంస్థకే ఆ టెండర్ దక్కింది. 

ముఖ్య నేత సొంత జిల్లాలో ఇటీవల దాదాపు 45 మంది తహసీల్దార్ల బదిలీకి సంబంధించి జిల్లా మంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి, అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు జాబితాను కలెక్టర్ సిద్ధం చేశారు. ఇక ఉత్తర్వులే తరువాయి. ఆ దశలో ఏకంగా ముఖ్య నేతే కల్పిం చుకున్నారు! అమెరికా పర్యటనలో ఉన్న తన మరో సోదరుడు తిరిగొచ్చేదాకా వాటిని ఆపాలంటూ ఆదేశించారు. దాంతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20 రోజుల పాటు తహసీల్దార్ల బదిలీ ప్రక్రియే ఆగిపోయింది. సదరు సోదరుడు వచ్చి, జాబితాలో ఒకట్రెండు మార్పులు చేశాక గానీ ఉత్తర్వులు వెలువడలేదు!

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సర్కారీ వ్యవహారాల్లో సదరు ముఖ్య నేత సోదరుల హవా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు మచ్చుతునక మాత్రమే! ఒకరు రాష్ట్ర స్థాయిలో, మరొకరు ముఖ్య నేత సొంత జిల్లాలో అధికార యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అంతా తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. వారి అనుమతి లేకుండా భారీ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలేవీ అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఇటీవలి జలయజ్ఞం కాంట్రాక్టర్ల ఉదంతమే అందుకు నిదర్శనం. సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరగడంతో పాటు కూలీలకిచ్చే ఎస్‌ఎస్‌ఆర్ రేట్లూ రెట్టింపైనందున ధరలు పెంచితే తప్ప ప్రాజెక్టు పనులు చేయబోమని కాంట్రాక్టర్ల కొంతకాలంగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. దాంతో పనులు నిలుపుదల చేస్తామంటూ ఆ శాఖ మంత్రికి వారు తాఖీదులిచ్చినా ఫలితం లేకపోయింది. కానీ, ముఖ్య నేత సోదరున్ని కలిసి కదుర్చుకున్న అనధికార ఒప్పందం దెబ్బకు కాంట్రాక్టర్ల డిమాండ్‌లో ఒక్కసారిగా కదలిక వచ్చినట్టు సమాచారం. వారి సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది! ప్రిజమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉదంతమూ అంతే. కర్నూలు జిల్లాలో తలపెట్టిన ఆ ఫ్యాక్టరీకి 1,000 ఎకరాలు కేటాయించాలంటూ 2011 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి దరఖాస్తు అందింది. కానీ దాదాపు 8 నెలల పాటు ఆ ప్రతిపాదన ఇసుమంతైనా ముందుకు కదల్లేదు. దాంతో, ఇటు ముఖ్య నేతకు, అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకూ నమ్మకంగా పని చేసే ఓ న్యూస్ చానల్ సీఈఓ కల్పించుకున్నారు. ప్రిజమ్ సిమెంట్‌కు భూ కేటాయింపు విషయం కాస్త చూడాలంటూ ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తన సోదరుడితో మాట్లాడాల్సిందిగా ఆయనకు ముఖ్య నేత సూచించారని చెబుతున్నారు. ఆ తరవాత సరిగ్గా నెల రోజులకే బేరం కుదిరింది. ఆ వెంటనే నవంబర్‌లో ఫైల్ క్లియరైంది. భూ కేటాయింపుకు మంత్రివర్గం క్లియరెన్స్‌తో పాటు భూమిని బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ వంటివన్నీ చకాచకా జరిగిపోయాయి! ఇక ముఖ్య నేత సొంత జిల్లాలో ఆయన మరో సోదరుని అనుమతి లేనిదే ఏ పనీ జరగదు. జిల్లా మంత్రి చెప్పినా, ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, చివరకు సోదరుని అనుమతి మాత్రం తప్పనిసరి! ముఖ్య నేత నియోజకవర్గంలో మంచినీటి పథకం అంచనా వ్యయాన్ని రూ.45 కోట్ల నుంచి ఏకంగా రూ.80 కోట్లకు పెంచాల్సిందిగా గ్రామీణ నీటి సరఫరా పథకం సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఇటీవల ఆదేశించినట్టు తెలిసింది. కానీ అప్పటికే అంచనా వ్యయాన్ని పెంచామని, ఇంకా పెంచడం సాధ్యం కాదని ఎస్‌ఈ తేల్చిచెప్పారు. దాంతో ఆయనను ఆగమేఘాల మీద విశాఖపట్నానికి బదిలీ చేయించారని అధికార వర్గాలు మండిపడుతున్నాయి!

‘ఒప్పందం’ ఉల్లంఘించారని..
రాష్ట్రంలో బాగా డిమాండున్న చీప్ లిక్కర్ బ్రాండ్ల అదనపు ఉత్పత్తికి ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులిస్తోంది. అయితే, అదనంగా ఉత్పత్తి చేసే ప్రతి ప్రూఫ్ లీటర్‌కూ రూ.3.50 డిస్టిలరీ ఫీజును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి కనీసం రూ.80 కోట్ల మేర ఆదాయం వస్తుంది. కానీ, ఆర్థిక భారం దృష్ట్యా ఈ మొత్తాన్ని తగ్గించాలని మద్యం ఉత్పత్తిదారులు ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఫీజును 50 పైసలకు తగ్గిస్తూ 2011 నవంబర్ 26న జీవో జారీ చేసింది. ఏమైందో ఏమో.. తర్వాత రెండు నెలలకేఫీజును రూ 1.50కు పెంచుతూ ఇంకో జీవో జారీ చేసింది. ముందు తగ్గించడానికి, తర్వాత పెంచడానికి ఎలాంటి కారణాలూ చూపలేదు! మతలబేమిటా అని ఆరా తీస్తే, దీని వెనకా ముఖ్య నేత సోదరుని హస్తమే ఉన్నట్టు తేలింది. మద్యం ఉత్పత్తిదారులతో ఆర్థిక లావాదేవీల్లో ఆయనకు తేడా రావడం వల్లే పెంచారని వెల్లడైంది. ‘మేమిస్తామన్న మొత్తం ఇవ్వలేదనే, ఫీజును మళ్లీ పెంచారు’ అంటూ అసోసియేషన్ ముఖ్యుడొకరు వాపోయారు!

రూ.30 కోట్ల పనికి రూ.100 కోట్ల నజరానా

హైదరాబాద్‌లో రూ.130 కోట్లతో నిర్మించనున్న ఎమ్మెల్యేల గృహ వసతి భవన సముదాయం టెండర్‌ను ఓ నిర్మాణ సంస్థకు కట్టబెట్టిన ఉదంతంలోనూ ముఖ్య నేత సోదరుడు చక్రం తిప్పారని అధికార పార్టీలో అంతా చెప్పుకుంటున్నారు. రూ.30 కోట్లతో 110 ఫ్లాట్ల నిర్మాణానికి మొదట్లో అంచనా వ్యయం రూపొందించిన ఆర్ అండ్ బీ, నిర్ధారిత ప్రణాళికకు అదనంగా కేవలం 10 ఫ్లాట్లు, ఓ క్లబ్ హౌస్ చేర్చి, వ్యయాన్ని ఏకంగా రూ.130 కోట్లకు పెంచింది. అంటే కాంట్రాక్టర్‌కు రూ.100 కోట్లు నజరానాగా ఇచ్చారన్నమాట! ఎమ్మెల్యేల నివాసాల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని రెండేళ్లుగా ప్రతిపాదనలున్నాయి. ఈ పని చేజిక్కించుకోవాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భావించింది. అందుకు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి కూడా సహకరించడంతో అంచనా వ్యయం పెంపునకు ఫైలు శరవేగంగా కదిలింది. సదరు నిర్మాణ సంస్థకు అనుకూలంగా ఉండేలా టెండర్ నిబంధనలను కూడా ఖరారు చేశారు. మామూలుగా ప్రతి ఫైలు మీదాఏదో ఒక అభ్యంతరం వ్యక్తం చేసే ముఖ్య నేత, ఈ అంచనా పెంపు వ్యయం ఫైలును మాత్రం ఏ అభ్యంతరమూ లేకుండా ఆమోదించేయడంతో సదరు మంత్రితో పాటు అధికారులు కూడా బిత్తరపోయినట్టు సమాచారం. తీరా టెండర్ల ప్రక్రియ తుది దశకు వచ్చేనాటికి అసలు సంగతి బయటకు వచ్చింది. మరో నిర్మాణ సంస్థ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అప్పటిదాకా తెర వెనక కథ నడిపిన ముఖ్య నేత సోదరుడు, ఈ కొత్త సంస్థకు టెండర్ కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిసింది. దాంతో దానికే టెండర్ దక్కింది. దీనిక వెనక భారీ కుంభకోణం దాగుందని ఆర్ అండ్ బీ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

వికారాబాద్ టెండర్ వెనక...

వికారాబాద్‌ను హైదరాబాద్‌కు శాటిలైట్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు రూ.171 కోట్ల ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తంలో కేంద్రం వాటాయే అధికం. నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించి పని అప్పగించాలి. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు రూపొందించాలి. కానీ, ఓ నిర్మాణ సంస్థకు ఈ టెండర్ ఇప్పిస్తానంటూ ముఖ్య నేత సోదరుడు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆయన ‘ఇన్వాల్వ్’ అయిన సంగతి తెలియక, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహకారంతో కాంట్రాక్టును మరో నిర్మాణ సంస్థకు అప్పగించేలా ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. విషయం తెలిసిన సదరు సోదరుడు, ఆ ఎంపీలు సిఫార్సు చేసిన కంపెనీకి అర్హత లేదంటూ టెక్నికల్ బిడ్ నుంచే తొలగింపజేశారని చెబుతున్నారు! ఆ మేరకు నిబంధనల ఖరారు వెనుక ముఖ్య నేత సోదరుని ప్రమేయమే ఉందని, ఈ ప్రాజెక్టు వెనక పెద్ద మతలబే చోటు చేసుకుందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

When there is Godfather behind him; why to worry and fear?