పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు జగన్ భేటీ

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు జగన్ భేటీ

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత దీక్ష చేసిన వై.ఎస్.జగన్ బుధవారం హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో జరిగే భేటీలో శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నారు. 17న పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులతో జగన్ సమావేశమవుతారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై వారితో చర్చిస్తారు.


 ఆ వీరులపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు:
ధర్మవరం (అనంతపురం), న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే శిరచ్ఛేదమేనని అవిశ్వాస తీర్మానమప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం బెదిరించింది. అయినా జడవకుండా, వీరుల్లా 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఇప్పటికి 70 రోజులు. ఆ వీరులపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఏమైంది మీ శిరచ్ఛేదన?’’ అంటూ నిలదీశారు. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు శిరచ్ఛేదన తప్పదని మంగళవారం చేనేత దీక్ష ముగింపు సభలో ఆయన జోస్యం చెప్పారు. ‘‘ఆ ఎమ్మెల్యేలు విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. భవిష్యత్తులో వారిపై కచ్చితంగా వేటు పడుతుంది. ఉప ఎన్నికల్లో వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని కోరారు. 

‘‘రాష్ట్రంలో చేనేత కార్మికుల పిల్లలు కూడా అందరితో పాటు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో మహా నేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానివల్ల వేలాదిమంది చేనేత కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివారు. వైఎస్ మరణానంతరం ప్రస్తుత పాలకులు ఆ పథకానికీ తూట్లు పొడిచారు’’ అంటూ మండిపడ్డారు. చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండగా చేనేత వెతలను ఏ మాత్రమూ పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం మాట్లాడుతున్నారంటూ దుమ్మెత్తిపోశారు. అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహాలను కూలగొట్టిస్తాననడం బాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

బాబుపై నేతల ఆగ్రహం
రాష్ట్రంలో చేనేత, వ్యవసాయ రంగాలు కుదేలవడానికి బాబు పాలనే కారణమని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నేతలు విమర్శించారు. రాష్ట్రాన్ని ఆయన అన్నివిధాలా భ్రష్టు పట్టించారని గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. బాబు రాష్ట్రానికి పట్టిన రోగమన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ అనైతిక సంబంధం పెట్టుకుని ఆయనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయని రోజా విమర్శించారు. ఈ దీక్షను జగన్ దీక్షగా కాక చేనేత సమస్యల దృష్టితో చూడాలని ప్రభుత్వానికి వాసిరెడ్డి పద్మ సూచించారు. చేనేత సమస్యలపై బాబు మొసలికన్నీళ్లను ప్రజలు అస్సలు నమ్మబోరని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌ను సీఎంగా చూసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, అది ఎంతో దూరం లేదని చెప్పారు. 

మహానేత మాదిరిగానే జగన్‌కు కూడా అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానమని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అన్నారు. జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ సర్కారు చంద్రబాబు హయాం కన్నా అత్యంత హీనంగా పాలిస్తోందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను, రంగాలను సంక్షోభంలోకి నెట్టి మొద్దునిద్ర పోతోందంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం మెడలు వంచేందుకే జగన్ చేనేత దీక్ష చేపట్టారని అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ఇప్పటికైనా సర్కారు మొద్దు నిద్రను వీడాలన్నారు. సుస్థిర పాలన జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జనక్‌ప్రసాద్ అన్నారు.
Share this article :