ఫిబ్రవరిలోనే కరెంట్ ‘కట్’కటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిబ్రవరిలోనే కరెంట్ ‘కట్’కటలు

ఫిబ్రవరిలోనే కరెంట్ ‘కట్’కటలు

Written By ysrcongress on Monday, February 20, 2012 | 2/20/2012

సాధారణ పరిశ్రమలకు వారంలో రెండ్రోజులు
సాయంత్రం పీక్ లోడ్ పేరుతో మరో రోజు కోత
మొత్తమ్మీద వారంలో మూడు రోజులపాటు పరిశ్రమలకు కరెంట్ బంద్
స్టీలు, సిమెంటు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు నెలలో 12 రోజులు కట్
పరిశ్రమలు పనిచేయకపోవడంతో ఉపాధికి దూరంగా లక్షలాదిమంది 
రోజుకు రూ.150 కోట్ల నష్టం
గృహ వినియోగదారులకూ కోతలే
జిల్లా కేంద్రాల్లో 2, మండల కేంద్రాల్లో 4, గ్రామాల్లో 8 గంటలపాటు విద్యుత్ కట్.. 
రాజధానిలో అనధికారికంగా కోతలు ప్రారంభం

హైదరాబాద్, న్యూస్‌లైన్: భానుడి భగభగలు ఇంకా మొదలుగాకముందే విద్యుత్ సెగలు బుసలుకొడుతున్నాయి! అటు పరిశ్రమలకు.. ఇటు గృహాలకు కోతల కాలం అప్పుడే మొదలైంది. సాధారణ పరిశ్రమలకు వారంలో రెండ్రోజులపాటు విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. ఇవి ఆదివారం (19వ తేదీ) నుంచే అమల్లోకి వస్తాయంటూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆదేశాలు జారీచేశాయి. దీనితోపాటు ప్రతిరోజూ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు పరిశ్రమలకు కేవలం లైటింగ్ లోడుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రోజుకు నాలుగు గంటల చొప్పున లెక్కేసుకుంటే ఇది ఒకరోజు అవుతుంది. అంటే మొత్తమ్మీద సాధారణ పరిశ్రమలకు వారంలో మూడ్రోజులపాటు కోతలన్నమాట! అలాగే నిరంతరం నడిచే సిమెంటు, స్టీలు, ఫెర్రో అల్లాయిస్ వంటి పరిశ్రమలకు.. నెలలో ఏకంగా పన్నెండున్నర రోజులపాటు కోతలు అమలు కానున్నాయి. ఈ పరిశ్రమలు తమకు కావాల్సిన మొత్తం డిమాండ్‌లో కేవలం 70 శాతం కరెంటును మాత్రమే వినియోగించుకోవాలని డిస్కంలు స్పష్టం చేశాయి. ఒకవేళ 70 శాతానికంటే మించితే.. నెలలో తొమ్మిది రోజుల పాటు కోతలు అమలు చేస్తామని తాజాగా జారీచేసిన ఆదేశాల్లో డిస్కంలు పేర్కొన్నాయి. వీటికి సాయంత్రం ఆరున్నర నుంచి పదిన్నర వరకు కోతలు కూడా కలుపుకుంటే నెలకు మూడున్నర రోజులు అవుతుంది. అంటే మొత్తమ్మీద పన్నెండున్నర రోజుల పాటు కోతలే! పరిశ్రమలతోపాటు గృహ వినియోగదారులకూ అప్పుడే కోతలు మొదలుపెట్టారు. జిల్లా కేంద్రాల్లో 2 గంటలు, మండల కేంద్రాల్లో 4 గంటలు, గ్రామాల్లో 8 గంటల మేర కోతలు అమలవుతున్నాయి.

పరిశ్రమలకు రోజుకు భారీ నష్టం...

ఓవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పారిశ్రామికరంగం కుదేలైపోతోంది. మరోవైపు ప్రభుత్వం కోతలతో పరిశ్రమలపై మరింత భారం మోపుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికరంగం తిరోగమనంలో ఉందన్న విషయాన్ని తాజాగా ప్రభుత్వం సమర్పించిన సామాజిక, ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో పరిశ్రమల రంగం వాటా 2010-11తో పోలిస్తే (19.67 శాతం)... 2011-12లో 16.42 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలకు కోతలతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. వాస్తవానికి పరిశ్రమలకు సెప్టెంబర్ నెల చివరి నుంచే వారానికి మూడ్రోజుల మేరకు కోతలు విధించారు. డిసెంబర్ చివరినాటికి ఈ మూడ్రోజులను ఒకరోజుకు తగ్గించారు. ఇప్పుడు తాజాగా దీన్ని రెండ్రోజులకు పెంచారు. ఫలితంగా ప్రతీరోజు పరిశ్రమలకు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఫ్యాప్సీ అభిప్రాయపడుతోంది. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలకు ఆర్థికంగా నష్టం వాటిల్లడంతోపాటు లక్షలాది మంది కూలీలురోజువారీ వేతనానికి దూరమవుతున్నారు. పొట్టకూటి కోసం నానాతిప్పలు పడుతున్నారు. ఫిబ్రవరిలోనే వారానికి రెండ్రోజులపాటు కరెంటు కోతలను గతంలో ఎన్నడూ అమలు చేయలేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే... మార్చి, ఏప్రిల్‌లో ఏకంగా వారానికి నాలుగైదు రోజులు కోత విధించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కొందామన్నా కరువే...

రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యి మాదిరి తయారైంది. ఒకవైపు డిస్కంలు కోతలు ప్రారంభించాయి. మార్కెట్లో విద్యుత్‌ను కొందామనుకున్నా కుదరడం లేదు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి చేసే కరెంటును డిస్కంలు కొనుగోలు చేస్తుండటమే ఇందుకు కారణం. ల్యాంకో, జీఎంఆర్ వంటి పెద్ద విద్యుత్ ప్లాంట్లతోపాటు స్థానికంగా ఉండే చిన్నస్థాయి ప్లాంట్ల విద్యుత్‌ను కూడా డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. పోనీ ఈ ప్రైవేట్ ప్లాంట్లను కాదని బయటి రాష్ట్రం నుంచి కొనుగోలు చేద్దామంటే ధరలు భయపెడుతున్నాయి. ఓపెన్ యాక్సెస్ ద్వారా కొందామంటే యూనిట్ ధర ఏకంగా రూ.20 పలుకుతోంది! ఈ ధరలు ఏప్రిల్ నాటికి రూ.30కి చేరుకునే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తం చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తే..... ఉత్పత్తి చేసే వస్తువుల ధర పెంచాల్సి వస్తుంది. ధరలు పెంచితే డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే ముందుగా తీసుకున్న ఆర్డర్లకు ఇప్పుడు ధరను పెంచడం సాధ్యం కాదు. దీంతో అదనపు భారాన్ని భరిస్తూ పరిశ్రమలే విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. కానీ అందుకు పరిశ్రమలు వెనకాడుతున్నాయి.

గృహాలకూ ‘కట్’కటే...!

పరిశ్రమలతో పాటు గృహ వినియోగదారులకూ కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 2 గంటలు, మండల కేంద్రాల్లో 4 గంటలు, గ్రామాల్లో 8 గంటల పాటు కోతలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంకా అధికారికంగా కోతలు ప్రారంభం కాలేదు. అయితే మరమ్మత్తులు, లోడ్ రిలీఫ్ పేరిట అనధికారికంగా గంటపాటు కొన్ని ప్రాంతాల్లో కోతలు అమలవుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం రోజుకు రెండు గంటల చొప్పున కోతలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి.

అసలే కష్టాలు.. ఆపై నష్టం..
ఫిబ్రవరి 18 నాటికి రాష్ర్టంలో విద్యుత్ డిమాండ్ 272 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కాగా.. సరఫరా మాత్రం కేవలం 240 ఎంయూలే! మరోవైపు ఉన్న విద్యుత్ ప్లాంట్లలో ఉన్న కాస్తా ఉత్పత్తి నిలిచిపోతోంది. వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద ఉన్న 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కాకతీయ థర్మల్ విద్యుత్ ప్లాంటు (కేటీపీపీ) మూతపడింది. ఇంకా మరమ్మత్తులు పూర్తికాలేదు. రాష్ట్రంలోని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీపీసీకి చెందిన ఢిల్లీ సమీపంలోని జజ్జర్ విద్యుత్ ప్లాంటు నుంచి కేంద్రం కేటాయించిన 185 మెగావాట్ల విద్యుత్ కూడా ప్రస్తుతం రావడం లేదు. సాంకేతిక సమస్యలతో మూతపడ్డ ఈ ప్లాంటు మరో రెండు నెలల తర్వాతగానీ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం లేదని ఎన్‌టీపీసీ వర్గాలు చెప్పాయి. రబీ, వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థలు రాష్ట్రంలోని వివిధ వాణిజ్య ప్లాంట్ల నుంచి 550 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. వీటిలో 150 మెగావాట్లకు గండిపడింది. ఆయా ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకలి పోటుగా గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజురోజుకీ కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ నుంచి గ్యాసు సరఫరా తగ్గిపోతోంది. దీంతో ప్లాంట్ల సామర్థ్యం 75% ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్) నుంచి 55 శాతానికి పడిపోయింది. తాజాగా గ్యాసు సరఫరా మరింత తగ్గడంతో ఇది 48 శాతానికి పడిపోయింది.
Share this article :

0 comments: