ఎమ్మార్ కేసులో నా పాత్రపై ఒక్క ఆధారమూ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మార్ కేసులో నా పాత్రపై ఒక్క ఆధారమూ లేదు

ఎమ్మార్ కేసులో నా పాత్రపై ఒక్క ఆధారమూ లేదు

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012

ఎమ్మార్ కుంభకోణం కీలక సూత్రధారి కోనేరు రాజేంద్రప్రసాద్, విల్లాలను ఎక్కువ ధరకు విక్రయించిన తుమ్మల రంగారావుతో తనకు సంబంధం లేదని, విల్లాల విక్రయంలో తాను అదనంగా డబ్బులు వసూలు చేయలేదని సునీల్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఎమ్మార్ డెరైక్టర్‌గా ఉన్న కోనేరు ప్రసాద్, స్టైలిష్‌హోం డెరైక్టర్ తుమ్మల రంగారావు, ఆయన మేనేజర్‌తో నాకు సంబంధం లేదు. విల్లాలను ఎక్కువ ధరకు విక్రయించినట్లుగా సీబీఐ అభియోగాలు మోపిన తుమ్మల రంగారావుకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

నేను విల్లాలను ఎక్కువ ధరకు విక్రయించి డబ్బు వసూలు చేసినట్లు నిరూపించే ఆధారాలేవీ సీబీఐ కోర్టుకు సమర్పించలేదు. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు. చార్జిషీట్‌లో నాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అభియోగాలు నమోదు చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలను కూడా సీబీఐ సమర్పించలేదు. ఏపీఐఐసీతోగానీ, ఎమ్మార్‌తో గానీ నాకు సంబంధమే లేదు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నా. నా భార్య వ్యాపారం చేస్తోంది. ఆస్తులన్నీ కష్టార్జితమే. సాధారణ జీవితాన్ని గడుపుతున్నా. ఎమ్మార్ కేసులో నన్ను గతనెల 24న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం ఆరు గంటలకు సీబీఐ అధికారులు నా ఇంటికి వచ్చి సోదాలు చేశారు. ఈ సోదాల్లో నా ఆస్తులకు సంబంధించిన పత్రాలు మినహా... నేరానికి సంబంధించిన ఆధారాలేవీ సీబీఐ స్వాధీనం చేసుకోలేదు. ఐపీసీ 477(ఎ), 420, 409 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం కింద మోపిన సెక్షన్లు నాకు వర్తించవు. నిందితుడు పారిపోతారనే అనుమానం ఉన్నప్పుడు మాత్రమే బెయిల్‌ను ఇవ్వకూడదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆరురోజులపాటు కస్టడీలో విచారించారు. సీబీఐ విచారణకు సహకరించాను. నాకు తెలిసిన మేరకు అన్ని విషయాలు వెల్లడించా. దర్యాప్తునకు సహకరిస్తా. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండి’’ అని సునీల్‌రెడ్డి పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.


Share this article :

0 comments: