భూ కేటాయింపులపై స్పీకర్‌కు విజయమ్మ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూ కేటాయింపులపై స్పీకర్‌కు విజయమ్మ లేఖ

భూ కేటాయింపులపై స్పీకర్‌కు విజయమ్మ లేఖ

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012

వైఎస్ హయాంపై వేసిన సభా సంఘం పరిధిని విస్తరించాలి..
ప్రభుత్వం టీడీపీతో స్పష్టంగా అవ గాహనకు వచ్చాకే సభా సంఘం ఏర్పాటు
అమీర్‌పేట భూమి, ప్రిజమ్ సిమెంటుకిచ్చిన భూమినీ విచారణాంశాల్లో చేర్చండి
భూ కేటాయింపు నిర్ణయాలపై సంతకాలు చేసింది ఈ మంత్రులే కదా
ఈ మంత్రులంతా వైఎస్సార్ మంత్రివర్గంలో ఉన్న వారే కదా
ఇక ఈ విచారణకు హేతుబద్ధత ఎక్కడిది? 
వైఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన సెజ్‌లన్నీ కేంద్రం అనుమతించినవే
ఆయన హయాంలో సంప్రదింపుల ద్వారానే భూసేకరణ
పెద్ద సంఖ్యలో రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు
వైఎస్ హయాంపై సభా సంఘం వేయడం వెనుక లోగుట్టు వేరే
వైఎస్ ప్రతిష్టను దెబ్బతీసి, మద్దతుదారులను దూరం చేయడమే లక్ష్యం

గౌరవనీయులైన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి,


అయ్యా,
విషయం: భూకేటాయింపులపై సభా సంఘం ఏర్పాటు గురించి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై శాసనసభా సంఘం నియమించారన్న విషయం పత్రికల ద్వారా తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. సభా సంఘం వేయాలని నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి 11 నెలల విరామం తరువాత దీన్ని నియమించారు. ఇది ఒక రికార్డు. సభా సంఘం విచారణాంశాల పరిధిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విచారణ అర్థవంతంగా జరగాలన్నా, ఈ కసరత్తు వల్ల నిజం నిగ్గు తేలాలన్నా.. ఆరోపణలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక న్యాయ సూత్రాల ప్రకారం విచారణ కోరే వారు కూడా నిష్కళంకులై ఉండాలి. టీడీపీ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై కూడా విచారణ జరిపినట్లయితే, అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఆ తదుపరి వచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూడా పాటించిందా? లేక ఏమైనా భిన్నమైన విధానాలు అవలంబించిందా అనేది తేటతెల్లమవుతుంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ తరహా విచారణతో పెట్టుబడిదారుల్లో స్థైర్యం దెబ్బతింటుందనే సాకు చూపుతూ.. 1994 నుంచి జరిగిన భూకేటాయింపులపై విచారణను జరిపించడానికి నిరాకరిస్తున్నారు. అలా అనుకుంటే వైఎస్సార్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణ జరిగితే పెట్టుబడిదారుల స్థైర్యం దెబ్బతినదా? ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్), లేదా లోకాయుక్త లాంటి స్వతంత్ర సంస్థలేవీ వైఎస్సార్ హయాంలో భూకేటాయింపులను తప్పు పట్టలేదన్న విషయాన్ని కూడా గుర్తెరగాలి.

టీడీపీతో అవగాహనకు వచ్చాకే సభాసంఘం..

రాష్ట్ర ప్రభుత్వం టీడీపీతో స్పష్టంగా ఒక అవ గాహనకు వచ్చి సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటి ంచిన 2011 మార్చి నుంచి ఇప్పటిదాకా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో పలు అంశాలపై సీబీఐ విచారణ చేస్తోంది. ఇతర అంశాలతో పాటు 2004-2009 మధ్య జరిగిన భూకేటాయింపులపైనే ప్రధానంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ప్రతిరోజూ చాలా మంది ఐఏఎస్ అధికారులను పిలిచి విచారిస్తోంది. 

సరళీకృత, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన 1994 తర్వాత కాలంలో జరిగిన భూ కేటాయింపులపై మాత్రం అసలు విచారించనే లేదు. 1994 సంవత్సరం నుంచీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఆర్థిక రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలే శాసించాలన్న విధానాన్ని విడనాడుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది. డీజీటీడీ వద్ద పారిశ్రామిక లెసైన్సులు, రిజిస్ట్రేషన్‌లు చేసే విధానాన్ని 1991లో ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు, ఎంఆర్‌టీపీ, ఫెరా చట్టాల్లో సడలింపులు చేసింది. దాంతో పెట్టుబడులను ఆకర్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అయింది. అందువల్ల రాష్ట్రాలు మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల విస్తరణ వంటి వాటిపై దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చింది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌లు), ఐటీ వసతులు, కన్వెన్షన్ సెంటర్లు, గోల్ఫ్ క్లబ్బులు వంటి సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఇలాంటి చర్యలు తీసుకునేటపుడు సహజంగానే కొత్త భూకేటాయింపు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే పీపీపీ, జీటూజీ, ఈపీసీ ప్రాతిపదికన కాంట్రాక్టులను ఇవ్వడం వంటివి మొదలయ్యాయి. ఈ సమయంలో అధికారంలో ఉన్నటీడీపీ ప్రభుత్వం అనుసరించిన భూ కేటాయింపు విధానాలే తదుపరి ప్రభుత్వానికి ప్రాతిపదికగా, ఉదాహరణగా ఉంటాయి.

టీడీపీ ప్రభుత్వ కేటాయింపుల్లో భారీ అవినీతి.. 

ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే వైఎస్సార్ ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ముందు నుంచీ ఉన్న ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన భూ కేటాయింపుల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అనేదే. కృష్ణపట్నం ప్రాజెక్టు, గంగవరం ప్రాజెక్టు, ఎమ్మార్ ప్రాజెక్టు, రహేజా ప్రాజెక్టు, వాడరేవు ప్రాజెక్టు, కాకినాడ పోర్టు ప్రైవేటీకరణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్టణం పారిశ్రామిక నీటి సరఫరా ప్రాజెక్టు, స్వల్ప వ్యవధిలో నిర్మించే ప్రాతిపదికన ఆరు విద్యుత్ ప్రాజెక్టులు, ఐఎంజీ భారత ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భూములను కేటాయించారు. ఈ కేటాయింపు ఉదంతాల వెనుక జరిగిన అవినీతి గురించి అప్పట్లో పత్రికలన్నీ పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించాయి కూడా. వాస్తవానికి టీడీపీ పాలనలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్థకు కట్టబెట్టారు. ఇందులో పరిమిత ప్రాతిపదికన మాత్రమే టెండర్లను పిలిచి సంప్రదింపుల ప్రక్రియ ద్వారా కేటాయించారు. అంతే కాదు, ప్రతిష్టాత్మకమైన కాకినాడ పోర్టు విషయంలో టీడీపీ ప్రభుత్వం నిబంధనలన్నింటినీ పూర్తిగా ఉల్లంఘించి ఎల్ అండ్ టీకి కేటాయించిందనే తీవ్రమైన ఆరోపణలు అప్పట్లో వ చ్చాయి.


సెజ్‌ల కోసం పట్టుబట్టింది చంద్రబాబే..

ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌లు) కావాలని గట్టిగా కోరిన వారిలో దేశంలోనే తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనే విషయం ఇక్కడ ప్రస్తావనార్హమని భావిస్తున్నాను. పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సెజ్‌ల ఏర్పాటు చేసే చట్టం తీసుకురావాలని ఆయన కేంద్రంపై ఒత్తిడి కూడా తెచ్చారు. ప్రతి ఏడాదీ దావోస్‌కు ప్రతినిధి వర్గాన్ని తీసుకు వెళ్లి అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి కూడా ఈయనే. చైనా అభివృద్ధికి కారణమైన సెజ్‌లు మన దేశంలో కూడా ఉండాలనడాన్ని మేం ఎంత మాత్రం తప్పు అని భావించడం లేదు. సువిశాలమైన భూభాగం, ముఖ్యంగా మనలాంటి సముద్రతీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సెజ్‌లు పెద్ద సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సెజ్‌ల చట్టాన్ని రూపొందించింది. 

సెజ్‌ల మంజూరీకి లెసైన్సులు ఇచ్చేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సెజ్‌ల ఏర్పాటుకు సిఫార్సు మాత్రమే చేస్తుంది. ప్రజల్లో చాలా మంది నమ్ముతున్నట్లుగా సెజ్‌కు కేటాయించిన భూమిని అమ్ముకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ భూమిని ఎలా వినియోగించాలో నిర్ణయించాల్సిందీ, విధానాలు రూపొందించాల్సిందీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే. భారత ప్రభుత్వ విధానంలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సిఫార్సు చేసిన సెజ్‌లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించినవేనని గుర్తు చేస్తున్నాను.


ఇన్నిసెజ్‌లు స్థాపించకుండా ఉండుంటే.. 

ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా కాకుండా మన రాష్ట్రానికి సువిశాల భూభాగం, తక్కువ జనసాంద్రత ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఏపీ కంటే ఎక్కువ జనాభా ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలూ మన రాష్ట్రంలో ఉన్న భూభాగం కంటే చిన్నవి. 50 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల పంజాబ్ రాష్ట్రంలో ప్రతి ఏటా 25 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. అందుకు భిన్నంగా 2.75 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 17 నుంచి 18 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 

మన భూమిలో 20 శాతం మాత్రమే కాలువల కింద సాగుకు నోచుకోవడం ఇందుకు కారణం. 2.4 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఉత్తరప్రదేశ్‌లో ఏటా 40 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు, 10 మిలియన్ టన్నుల బంగాళా దుంపల ఉత్పత్తి జరుగుతోంది. అంతే కాక దేశంలోనే ఎక్కువగా చెరకు, పాలు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో వ్యవసాయేతర రంగానికి కేటాయించడానికి వీలైన భూమి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దేశంలోనే రెండో పొడవైన సముద్ర ప్రాంతం, లోతట్టు ప్రాంతం మన రాష్ట్రంలో ఉన్నాయి. 

ఇవన్నీ ఉన్న మన రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పాల్సిన అవసరం, అవకాశం రెండూ ఉన్నాయి. మనం కనుక భారీ ఎత్తున సెజ్‌లను స్థాపించకుండా ఉండి ఉంటే అన్నీ ఉండి కూడా అవకాశాలను వినియోగించుకోలేని వారిగా దోషులుగా నిలబడేవాళ్లం.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా కుప్పకూలింది 

2006 నుంచి 2009 మధ్య కాలంలో భారతదేశ జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు అనూహ్యమైన రీతిలో 9 శాతంగా నమోదైనపుడేకేంద్ర ప్రభుత్వం సెజ్‌లను ఎక్కువగా ప్రోత్సహించిందనడం ఇక్కడ ముఖ్యాంశం. వస్తు తయారీ రంగంలో కూడా గణనీయమైన పురోగతి ఈ సందర్భంలోనే జరిగింది. బ్యాంకింగ్ రంగం కూడా కొత్త ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలివ్వడానికి ముందుకు వచ్చింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పెట్టుబడి మార్కెట్లు కూడా దూసుకు వెళ్తున్న పరిస్థితి అప్పట్లో నెలకొంది. ప్రైవేటు రంగం కూడా భారీగా ఈక్విటీలను సేకరించి విజయవంతంగా పరిశ్రమలను స్థాపించగలిగింది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోతుందని ప్రపంచంలోని ఏ ఆర్థిక వేత్తలూ, బ్యాంకర్లూ కూడా ఊహించలేక పోయారు. అది ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని భావించలేదు.

బలవంతపు భూసేకరణకు స్వస్తి.. 

రైతుల నుంచి భూమిని బలవంతంగా కాకుండా వారి సమ్మతితోనే, సంప్రదింపుల ద్వారానే సెజ్ ప్రమోటర్లు సేకరించేలా ఏకరూప విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. బలవంతపు భూసేకరణ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పింది. భూమి సొంత దారులకు అప్పటి ధరకన్నా ఎక్కువ మొత్తం అందేలా చర్యలు తీసుకుంది. ఈ కారణం వల్లనే పెద్ద సంఖ్యలో రైతులు తమ భూములను ప్రాజెక్టులకు, పరిశ్రమలకు, సెజ్‌లకూ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వం అనుసరించిన ఈ విధానం వల్లనే పశ్చిమ బెంగాల్ తరహాలో ఇక్కడ ఆందోళనలు చోటు చేసుకోలేదు. ఈ విధానంలో తప్పేమిటన్నది మాకు ఆశ్చర్యంగా ఉంది. మొత్తం రాష్ట్రంలో ప్రతిపాదించిన 60 సెజ్‌లకుగాను కావాల్సిన 42,107 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి 14,000 ఎకరాలు మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం 650 లక్షల ఎకరాల్లో ఈ భూమి ఎంత? టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తాను పెద్ద మొత్తంలో ఎమ్మార్, జీఎమ్మార్, రహేజా, ఐఎంజీ భారత వంటి వాటికి భూమిని కేటాయించినపుడు వైఎస్సార్‌ప్రభుత్వం కూడా అదే విధంగా భూమిని కేటాయిస్తే వారికి వచ్చే సమస్య ఏమిటి?

సభా సంఘం వెనుక లోగుట్టు వేరే ఉంది.. 

మహానేత వైఎస్ హయాంలో భూ కేటాయింపులపై సభా సంఘం వేయడమొకటే పైకి కనిపిస్తోంది..కానీ దాని వెనుక మర్మం చాలా ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఆ పార్టీ నుంచి దూరం చేయడానికీ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంలో భాగంగానే ఈ సభా సంఘాన్ని వేశారని మేం నమ్ముతున్నాం. రాజకీయ వేదికపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొలేక.. దివంగత వైఎస్సార్ కుటుంబంపై కేసుల మీద కేసులు బనాయిస్తున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆ నాడు సభా సంఘాన్ని నియమించాలని టీడీపీ 17 రోజుల పాటు శాసనసభను స్తంభింపజేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సభా సంఘం వేయడం తమకు ఇష్టం లేదన్నట్లుగానే చివరి వరకూ నటించింది. చివరకు సభా సంఘం వేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందువల్లేసభకు హాజరయ్యామని చంద్రబాబునాయుడు అనుకోకుండా అసెంబ్లీలో చెప్పేయడంతో అసలు విషయం బయటపడింది. కాంగ్రెస్, టీడీపీల మధ్య అపవిత్ర బంధం ఉందనడానికి ఇంతకంటే రుజువు ఏంకావాలి?

సంతకాలు చేసింది ఈ మంత్రులు కాదా? 

రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని రూపొందించిన టీడీపీ వైఎస్సార్ హయాంలో జరిగిన అవకతవకలంటూ కోర్టులో పిల్ వేసిన శంకర్‌రావుతో కలవడం నిజం కాదా? అసెంబ్లీలో వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై టీడీపీ తీవ్ర స్థాయిలో పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటే ఏ మంత్రీ ఖండించక పోవడం నిజంకాదా? పైగా ఆ నిర్ణయాలపై వీరిలో చాలా మంది మంత్రులు సంతకాలు చేశారు కూడా. వైఎస్‌పై ఆరోపణలు ఖండిస్తే ఈ మంత్రులంతా తమ పదవులు ఊడిపోతాయనే భయంతో మిన్నకుండిన మాట నిజం కాదా? అసలు శంకర్‌రావు వేసిన కేసులో, 2004-09 మధ్య కాలంలో ప్రజా సంపద లూటీ అవడానికి కారణమయ్యాయని చెబుతున్న 26 జీవోలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయక పోవడానికి బాధ్యత ముఖ్యమంత్రిది కాదా? రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనందువల్లనే సీబీఐ ఐఏఎస్ అధికారులను తన వద్దకు విచారణకు పిలుస్తోంది. ఈ 26 జీవోలకు సంబంధించిన ఆరోపణలను తోసిపుచ్చడమో లేదా ధృవీకరించడమో చేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే ప్రస్తుత విచారణ నుంచి ఐఏఎస్ అధికారులు సురక్షితంగా ఉండే వారు.

విచారణలో హేతుబద్ధత ఏదీ? 

పస్తుత మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా వైఎస్సార్ మంత్రివర్గంలో ఉన్న వారే అయినపుడు, ఇక ఈ విచారణకు గల హేతుబద్ధత ఎక్కడిది? విచారణ పరిధిని కేవలం ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికే పరిమితం చేయడం ద్వారా సాధించే ప్రయోజనం ఏముంటుంది? తనప్రభుత్వం చేసిన పనుల మీద వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోవడానికి ఆయన ఎలాగూ లేరు. భూ కేటాయింపులు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులపై సంతకాలు చేసిన మంత్రులు ప్రస్తుతం ఉన్నా తమ పైవారి ఆదేశాల మేరకు నోరు మెదపరు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో మాదిరిగా కాగ్ వంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏదైనా.. ఈ కేటాయింపులను తప్పు పట్టిందా అంటే అదీ లేదు. ఆ కేసులో కూడా ప్రధానమంత్రిని మినహాయించి సంబంధిత మంత్రిపై, కార్యదర్శిపై నేరం మోపారు.

సభా సంఘం పరిధి విస్తరించండి.. 

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా, రాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే! భూకేటాయింపులపై నియమించిన సభా సంఘం పరిధిని విస్తరించండి. 1994 నుంచీ మొదలైన ప్రపంచీకరణ తర్వాత కాలం నుంచి నేటి వరకూ జరిగిన భూకేటాయింపులపై విచారణకు ఆదేశాలివ్వండి. అమీర్‌పేట భూమి కేటాయింపు, ప్రిజమ్ సిమెంటు కంపెనీకి ఇచ్చిన భూముల అంశాన్ని కూడా విచారణాంశాల్లో చేర్చండి.

గౌరవాభివందనాలతో...
- మీ భవదీయురాలు
వై.ఎస్.విజయమ్మ
గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Share this article :

0 comments: