విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు

విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012

కె.జి.రాఘవేంద్రరెడ్డి

డిస్కమ్‌ల బాధ్యతలు ఫ్రాంచైజీల పరం...
ప్రపంచ బ్యాంకు నిర్దేశం మేరకు సర్కారు పావులు 

తర్వాత మిగిలిన ప్రాంతాల్లోనూ అమలుకు కసరత్తు
సీఎం కిరణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం
కొత్త విధానం అమలైతే వినియోగదారులకు అష్టకష్టాలే
నాడు విద్యుత్ బోర్డును మూడు ముక్కలు చేసిన బాబు
సీఎం అయ్యాక ప్రపంచ బ్యాంకు ఆదేశాలు పక్కన పెట్టిన వైఎస్
ఇప్పుడు మళ్లీ బాబు బాటలో పయనిస్తున్న కిరణ్


విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగా డిస్కంలు సేవలందిస్తున్న ఒక్కో ప్రాంతాన్ని క్రమంగా ప్రైవేట్ ఫ్రాంచైజీలకు అప్పగిం చాలని నిర్ణయించింది. తద్వారా మొత్తం డిస్కంలను ప్రైవేట్ పరం చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముందుగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) పరిధిలోని హైదరాబాద్ సౌత్ సర్కిల్ (పాతబస్తీ)ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని సర్కారు నిర్ణయించినట్టు అత్యున్నత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన ఇంధనశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

నష్టాలను సాకుగా చూపి డిస్కంలను ప్రైవేట్‌కు అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారవర్గాలు ధ్రువీకరించాయి. మొదటగా చార్మినార్, అస్మాన్‌ఘడ్, బేగంబజార్ ప్రాంతాల్లో ఈ ఫ్రాంచైజీ విధానం అమల్లోకి రానుంది. దేశంలోనే మొదటిసారిగా మహారాష్ట్రలోని భివాండీ ప్రాంతంలో ఫ్రాంచైజీలకు అప్పగించిన విధంగానే రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిద్వారా వ్యవసాయంతోపాటు వివిధ కులవృత్తులకు, తక్కువస్థాయిలో విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే... ఇకనుంచి విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలన్నా.. ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించాల్సిందే! మొత్తంగా డిస్కంలను లేకుండా చేసే ఈ కుట్ర ఫలితంగా ఈ సంస్థలను నమ్ముకున్న 30 వేలకుపైగా ఉద్యోగులతో పాటు ప్రజలకూ ఇబ్బందులు తప్పవు!!

నాడు బాబు.. నేడు కిరణ్..!

ప్రపంచ బ్యాంకు ఎజెండాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)గా ఉన్న విద్యుత్‌రంగాన్ని నాడు చంద్రబాబు.. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా మూడు ముక్కలుగా చేశారు. ఇలా ముక్కలుగా చేసిన విద్యుత్ రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరించాలన్నది బ్యాంకు ఎజెండా. ఇందులో మొట్టమొదటగా ప్రజలకు నేరుగా సేవలందించే డిస్కంలను క్రమంగా ప్రైవేటీకరించాల్సి ఉంటుంది. వినియోగదారులు అనుభవించే ప్రతీ సేవకు అయ్యే వ్యయాన్ని... చార్జీలు పిండాలన్నది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం. ఇందులో భాగంగానే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు ఫ్రాంచైజీల రూపంలో అప్పగించాలని బ్యాంకు నిర్దేశించింది. ఒకేసారి అన్నింటినీ ప్రైవేట్‌పరంచేయకుండా మీటరింగ్, బిల్లింగ్ సేవలను ప్రైవేట్‌వ్యక్తులకు చంద్రబాబు అప్పగించారు. తర్వాత విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లను క్రమంగా తగ్గించారు. తర్వాత నష్టాల సాకుతో ప్రభుత్వరంగ సంస్థలన్నీ మూసేయాలని బ్యాంకు ఆదేశించింది. అయితే 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపాలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. బ్యాంకు ఎజెండాకు భిన్నంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విద్యుత్‌రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే అభివృద్ధి చేశారు. ఆయన మరణానంతరం ఇప్పుడు కిరణ్ సర్కారు.. మళ్లీ బాబు బాట పట్టింది. ఇందులోభాగంగానే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయాలని, ఉచిత విద్యుత్ భారాన్ని ప్రజలపైనే వేయాలని చూస్తోంది. ఇప్పటికే విద్యుత్ బిల్లులను ఈ-సేవాలో చెల్లించే వినియోగదారుల నుంచి సర్వీసు చార్జీలు వసూలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (22వ తేదీన) ఉత్తర్వులను కూడా జారీచేసింది. ప్రస్తుతం ఫ్రాంచైజీ విధానాన్ని తెరమీదకు తెచ్చింది. దీన్ని రాష్ట్రమంతా విస్తరింపచేయడం ద్వారా డిస్కంలను పూర్తిగా లేకుండా చేయాలనేది ప్రభుత్వ పెద్దల యోచన. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం లేకపోవడంతో డిస్కంలు పీకల్లోతు నష్టాల్లో ఉన్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని డిస్కంలను ప్రైవేటీకరించే కుట్రను కిరణ్ సర్కారు మొదలుపెట్టడం గమనార్హం.

చార్జీలతో వీపు విమానం మోతే..
విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఫ్రాంచైజీలకు అప్పగిస్తే.. వినియోగదారుల వీపు విమానం మోత మోగడం ఖాయం. వినియోగదారులకు అందించే ప్రతీ సర్వీసుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కనె క్షన్ మొదలు కొత్త లైన్ల ఏర్పాటు వరకూ ప్రతీ దానికి సర్వీసు చార్జీ చెల్లించాలి. ప్రైవేట్ సంస్థ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ చెప్పుచేతల్లోకే పోతుంది. వినియోగదారుల గోడు వినేవారే కరువవుతారు. అంటే ప్రైవేటు సంస్థలు ఆడిందే ఆట..... పాడిందే పాట అన్నమాట!

మెరుగైన సేవలూ అందవు...
డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా మెరుగైన సేవలు అందుతాయన్నది వాస్తవ దూరమే. ప్రభుత్వరంగంలో జవాబుదారీ ఉంటుంది. కానీ ప్రైవేట్ విధానంలో ఉండదు. ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలపై అధ్యయనం చేసిన విద్యుత్‌రంగ నిపుణుడొకరు పేర్కొన్నారు. ‘‘ఫ్రాంచైజీ విధానంలో పంపిణీ నష్టాలు తగ్గుతాయని చెబుతున్నారు. ప్రైవేట్‌రంగం వస్తే వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని అంటున్నారు. దీంతో పంపిణీ నష్టాల మాటేమిటో గానీ.. వినియోగదారులకు మాత్రం మెరుగైన సేవలు అందే అవకాశం లేదు. ఒడిశాలోనూ ఫ్రాంచైజీ విధానం అమలవుతోంది. కొద్దిమంది అనధికారిక కనెక్షన్లు వినియోగించుకున్నారంటూ అక్కడ.. మిగిలిన వినియోగదారులకు సరైన సేవలు అందించడం లేదు. లాభాలు అనుకున్నంత లేనందువల్ల అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు లేవనే సమాధానం ఫ్రాంచైజీల నుంచి వస్తోంది. వినియోగదారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దామంటే.. దానికి అధికారమేమీ ఉండదు’’ అని ఆయన ‘న్యూస్‌లైన్’తో అన్నారు.

ఫ్రాంచైజీ పనిచేస్తుందిలా...!
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మీటరింగ్, బిల్లింగ్ పనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఫ్రాంచైజీ విధానంలో మీటరింగ్, బిల్లింగ్‌తోపాటు బిల్లు కలెక్షన్, నెట్‌వర్క్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం), కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు బాధ్యతలూ ప్రైవేట్ సంస్థలకే అప్పగిస్తారు. ఫ్రాంచైజీ సంస్థను కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఒక సింగిల్ పాయింట్ వద్దకు ట్రాన్స్‌కో విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. ఎంత మొత్తం సరఫరా చేసిన విషయాన్ని రీడింగు ద్వారా లెక్కిస్తారు. యూనిట్‌కు ఎక్కువ ధర చెల్లించే కంపెనీకి బాధ్యతలను అప్పగిస్తారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వరంగంలోని డిస్కం పూర్తిగా వైదొలుగుతుంది. ఇన్‌పుట్ పుడ్ బేస్డ్ పద్ధతిగా వ్యవహరించే ఈ విధానంలో ముందే నిర్ణయించిన ధరలకు విద్యుత్‌ను ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా సదరు సంస్థ లాభాలను ఆర్జించుకోవాల్సి ఉంటుంది. 10 నుంచి 20 ఏళ్ల వరకు ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. అప్పగించిన ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా... అందుకు ఫ్రాంచైజీ సంస్థ విద్యుత్ సంస్థలు, ఈఆర్‌సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒప్పందకాలం ముగిసిన తర్వాత ఆ మొత్తం సర్కిల్‌ను తిరిగి డిస్కంలకు అప్పగిస్తారు. ఒప్పందకాలాన్ని పొడిగించే అవకాశమూ ఉంటుంది.

ఇదీ భివాండీ మోడల్...

దేశంలో మొదటిసారిగా భివాండీ ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థను మహారాష్ట్ర విద్యుత్ సంస్థ.. ఫ్రాంచైజీ సంస్థకు ఇచ్చింది.

2006లో టొరంటో కంపెనీకి అప్పగించింది.

బిడ్డింగ్ విధానం ద్వారా యూనిట్ విద్యుత్‌కు ఎక్కువ ధరను చెల్లించే సంస్థకు బాధ్యతలను కట్టబెట్టింది.

మహారాష్ట్రంలో ఫ్రాంచైజీ మోడల్ క్రమంగా నాగ్‌పూర్, ఔరంగబాద్ పట్టణాలకూ విస్తరించింది. ఈ ప్రాంతాల్లో కూడా టొరంటో కంపెనీయే బిడ్డింగ్‌ను దక్కించుకుంది.
Share this article :

0 comments: