ఆయన హయాంలో ఓ మంత్రి మూడేళ్లు జైల్లో ఉన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయన హయాంలో ఓ మంత్రి మూడేళ్లు జైల్లో ఉన్నారు

ఆయన హయాంలో ఓ మంత్రి మూడేళ్లు జైల్లో ఉన్నారు

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012


ఆయన హయాంలో ఓ మంత్రి మూడేళ్లు జైల్లో ఉన్నారు
బాబుకు మతిమరుపు ఉన్నట్టుంది
ఎమ్మార్ గురించీ ప్రస్తావించిన సీఎం
ఆవేశంతో ఊగిపోయిన బాబు
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఆగ్రహం

హైదరాబాద్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో మళ్లీ సేమ్ సీన్. కాకపోతే బుధవారం విపక్ష నేత చంద్రబాబుకు, మంత్రులకు మధ్య వాగ్యుద్ధం జరగగా.. గురువారం బాబు, సీఎం కిరణ్‌ల మధ్య మాటల మంటలు రేగాయి. బాబు కొద్దిలో జైలుకు వెళ్లడాన్ని తప్పించుకున్నారన్న కిరణ్ వ్యాఖ్య పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఆ వ్యాఖ్యలతో బాబు ఆవేశంతో ఊగిపోయారు. సీఎం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఆక్రోశించారు. టీడీపీ సభ్యులతో కలిసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. 

అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు, తన దగ్గరకు వచ్చేసరికి సభను నడవనీయబోమన్నట్టుగా వ్యవహరించారు! గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగం సందర్భంగా ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ హయాంలో ఐఏఎస్‌లు జైలుకు వెళ్తున్నారని అంతకుముందు బాబు చేసిన వ్యాఖ్యలను సీఎం ప్రస్తావిస్తూ, ‘‘చంద్రబాబునాయుడికి మతిమరుపు అనుకుంటా. ఆయన హయాంలో స్టాంపుల కుంభకోణంలో ఏకంగా ఓ మంత్రినే అరెస్టు చేసి మూడేళ్ల పాటు జైలులో ఉంచారు. 

ఆ సంగతి మర్చిపోయారు’’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘మాది రైతు ప్రభుత్వం. అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడ్డాం. బాబు సీఎంగా ఉండగా తాను రాష్ట్రానికి సీఈవోనని చెప్పుకున్నారే తప్ప తనది రైతు ప్రభుత్వమని ఏనాడూ చెప్పుకోలేదు’ అన్నారు. దాంతో బాబుకు చిర్రెత్తుకొచ్చింది. కిరణ్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సీఎంగా ఉంటూ అవాస్తవాలు చెప్పడానికి సిగ్గుపడాలంటూ మండిపడ్డారు. ‘‘నా హయాంలో హైటెక్స్ వంటి అనేక సంస్థలొచ్చాయి. మౌలిక సదుపాయాలు కల్పించా. నగరంలో అంతర్జాతీయ సదస్సులు జరగడానికి మా హయాంలో చేసిన కృషే కారణం’’ అన్నారు. దాంతో, ‘మీరు హైటెక్స్ గురించి చెబితే మేం ఎమ్మార్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది’ అని కిరణ్ అన్నారు. ‘‘ఘనంగా స్టేడియాలు కట్టామంటున్నారు. నిజమే. 2004లో ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు ఆ స్టేడియాలను 30 నుంచి 40 ఏళ్ల లీజుకు, అది కూడా వాటి నిర్వహణకు ఏటా రూ.2.5 కోట్లు ఆ సంస్థకే కట్టబెట్టేలా ఒప్పందం చేశారు’’ అంటూ ఎదురుదాడి చేశారు. బాబు లేచి మాట్లాడే ప్రయత్నం చేయడంతో, ‘స్ప్రింగ్ మాదిరి ఎందుకలా ఎగిరెగిరి పడుతున్నారు?’ అని ఎద్దేవా చేశారు. ఎమ్మార్ అనగానే గుమ్మడికాయ దొంగలా భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మార్‌పై కోర్టులో కేసు నడుస్తున్నందున దాని జోలికి వెళ్లడం లేదన్నారు. దాంతో బాబులో ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఎమ్మార్‌పై, తాను జైలుకెళ్లడం కొద్దిలో తప్పిపోయిందన్న కిరణ్ వ్యాఖ్యపై తన వివరణ వినాల్సిందేనని పట్టుబట్టారు. బాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందేనంటూ టీడీపీసభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో అరగంటకు పైగా సభా సమయం వృథా అయింది.

Share this article :

0 comments: