వైఎస్‌ఆర్ జిల్లాలో పోలీసుల అరాచకం: బాజిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ జిల్లాలో పోలీసుల అరాచకం: బాజిరెడ్డి

వైఎస్‌ఆర్ జిల్లాలో పోలీసుల అరాచకం: బాజిరెడ్డి

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

వైఎస్సార్ జిల్లాలో ప్రజాస్వామ్యం అడుగంటిందనీ అధికార కాంగ్రెస్ ప్రోత్సాహంతో పోలీసులు అరాచకం సష్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి తనకు తొలిసారిగా జిల్లా ఎస్.పి పోస్టింగ్ ఇప్పించారు కనుక, ఎవరేమనుకున్నా తాను మాత్రం డీఎల్ చెప్పినట్లే వింటానని జిల్లా పోలీసు అధికారి సుందరకుమార్‌దాస్ చెబుతున్నారని విమర్శించారు. 

ఎస్.పి తీరే ఇలా ఉంటే ఇక కింది స్థాయి పోలీసుల విషయం చెప్పాల్సిన పనే లేదని ఆయన అన్నారు.తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ ఎలాంటి నేర చరిత్ర లేని వారిపై సైతం రౌడీ షీట్లు తెరుస్తున్నారని బాజిరెడ్డి దుయ్యబట్టారు. అదే కాంగ్రెస్‌కు చెందిన వారు నేరం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పులివెందులలో అలేఖ్య అనే మహిళను తన భర్తే చంపాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. అలేఖ్య భర్త మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి బావమరది ప్రకాష్ రెడ్డి కారు డ్రైవర్ కావడం వల్లనే ఆయన జోలికి పోలీసులు పోవడం లేదని ఆయన విమర్శించారు. అదే వైఎస్సార్ కాంగ్రెస్ వారు తప్పులేమీ చేయక పోయినా అకారణంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.

వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో పాటు కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాటి నుంచీ పోలీసు వేధింపులు మొదలయ్యాయని ఆయన అన్నారు. తొలుత రహ్మతుల్లా అనే పార్టీ కార్యకర్తను పోలీసులు అకారణంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని ఆయన వివరించారు. ఇదేం అన్యాయమని అడుగుతూ జగన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేసినందుకు 367 మందిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనీ ఇందులో 30 మంది మహిళలు కూడా ఉన్నారని అన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి సమీప బంధువూ విద్యావంతుడూ అయిన వై.ఎస్.కొండారెడ్డిపై రౌడీషీటు తెరిచారని బాజిరెడ్డి తప్పు పట్టారు. 

2007 నుంచీ పరారీలో ఉన్న పులివెందులకు చెందిన నాగశ్వేత మల్లికార్జున అనే పేరుమోసిన నేరస్తుడిపై నాలుగైదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇతను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి విడుదలైన తరువాత కోర్టుకు హాజరు కావడం లేదని హామీ ఇచ్చిన వారి ష్యూరిటీ రద్దు చేస్తామని కోర్టు నుంచి నోటీసులు అందాయని ఆయన అన్నారు. ఆ వ్యక్తి ఉన్నట్లుండి పులివెందులలో ప్రత్యక్షమైన మల్లికార్జునను పోలీసులు ఏమీ అనకుండా తెల్లకాగితంపై సంతకం తీసుకుని ఆతని ఇంటిపై వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీస్ కేసును పెట్టారని ఆయన పేర్కొన్నారు. తీరా మల్లికార్జునతో పోలీసులు తీసుకున్న దరఖాస్తుపై ఉన్న ఇంటి నెంబరు ఎవరిదని తమ కార్యకర్తలు పరిశీలిస్తే అది గంగయ్య అనే ఆర్టీసీ డ్రై వర్‌దని తేలిందనీ దీనిని బట్టి పోలీసుల అరాచకాలు ఎంత పరాకాష్టకు చేరుకున్నాయో అర్థం అవుతుందన్నారు.

కోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి అనే ఇద్దరు నాయకులు కాంగ్రెస్ నాయకుడు తమ ఇళ్ల వద్ద అక్రమంగా పూడ్చేసిన డ్రైనేజిని తొలగించినసందర్భంగా జరిగిన గొడవలో పోలీసులు వారిపై 307 సెక్షన్ కింద కేసు పెట్టారనీ బాజిరెడ్డి వివరించారు. పులివెందులలో సింగిల్‌విండో అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ మునిరెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి స్వగ్రామమైన కాజీపేటలో మల్లికార్జున రెడ్డి, పులివెందుల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యదర్శి చిన్నప్పరెడ్డిపై ఎర్రచందనం స్మగ్లర్‌లని కేసులు పెట్టారని బాజిరెడ్డి విమర్శించారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలోని బి.కోడూరులో గత మేనెలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు నిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారనీ ఇందులో ఒక పెళ్లికాని యువతి కూడా ఉన్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎప్పుడూ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని చెబుతూ పోలీసులు ప్రజా సమస్యలపై పోరాడకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. బ్రహ్మంసాగర్ నుంచి నీరు విడుదల చేయాలని కోరాలన్నా, ఏడు గంటల విద్యుత్ సరఫరా కోసం పోరాడాలన్నా ఎలాంటి ధర్నాలు చేయకుండా పోలీసులు కేసులు పెడతున్నారని ఆయన అన్నారు.
Share this article :

0 comments: