నా ఇంటిని నాలుగుసార్లు కొలుచుకుని పోయారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా ఇంటిని నాలుగుసార్లు కొలుచుకుని పోయారు

నా ఇంటిని నాలుగుసార్లు కొలుచుకుని పోయారు

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

గుంటూరు ఓదార్పులో వైఎస్ జగన్ ఆవేదన
మాట తప్పనందుకు ఐటీ నోటీసులు.. ఈడీతో ఎంక్వైరీ 
నా ఇంటిని నాలుగుసార్లు కొలుచుకుని పోయారు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆ రోజు మాటిచ్చా. నా నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చిందోకానీ.. ఎవరు ఏమన్నా.. ఆ మాట తప్పలేకపోయా. అయితే ఆ మాట తప్పనందుకే ఈ రోజు నన్ను, నా కుటుంబాన్నీ వేధిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా.. ఆ మాట తప్పనందుకు తాను చాలా గర్వపడుతున్నానని, ఆ మాట తప్పనందుకే.. ఈ రోజు ప్రతి మారుమూల గ్రామంలోకీ వెళ్లి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చిందని భావోద్వేగంతో చెప్పారు. మంగళవారం పునఃప్రారంభమైన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో(60వ రోజు) భాగంగా ఆయన రొంపిచర్ల, నకరికల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎడ్వర్డుపేటలో వెన్నపూస పిచ్చిరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. పాపిశెట్టిపాలెంలో షేక్ హుస్సేన్ సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించారు. మార్గం మధ్యలోని పలు గ్రామాల్లో పది వైఎస్సార్ విగ్రహాలను, ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ 10 విగ్రహాల్లో ఎనిమిదింటిని.. చేజర్ల, కుంకలగుంట గ్రామాల్లోనే(ఒక్కో గ్రామంలో నాలుగేసి) ఆవిష్కరించారు. యాత్రలో పలు చోట్ల జగన్ ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఎన్ని బాధలు పెడుతున్నా.. నేను మాట తప్పనందుకు సొంత మనుషుల్లా ఉన్న మంత్రులతోనే కోర్టులదాకా పోయి కేసులు వేయించారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులతో నోటీసులిప్పించారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌తో ఎంక్వైరీ చేయించారు. అధికారులు నా ఇంటికైతే వారి సొంత ఇంటిలాగా నాలుగుసార్లు వచ్చి గజం గజం కొలుచుకునిపోయారు. అయితే వారు ఎన్నెన్ని బాధలు పెడుతూ ఉన్నాకూడా.. ఆ రోజు నేనిచ్చిన మాటకు గర్వపడుతున్నా. ఆ మాట ఇచ్చినందుకే ఈ వేళ ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నా. ఏ రాజకీయ నాయకుడూ తిరగనన్ని గ్రామాల్లో తిరిగా. ఇప్పటిదాకా దాదాపు 600కుపైగా గుడిసెల్లోకి వెళ్లా.. అక్కడి పేదరికం తెలుసుకున్నా. ఈ రాష్ట్ర చరిత్రలో నేను చూసినంత దగ్గరగా మరెవరూ పేదరికాన్ని చూడలేదని గర్వంగా చెప్పగలను.

బిడ్డలను చదివిస్తే తల్లిదండ్రులకు డబ్బులిస్తాం..

ఆ పేద గుడిసెల్లోకి వెళ్లినప్పుడు జీవితంతో పోరాడుతున్న అక్కడవారి పరిస్థితి చూసి చాలా బాధనిపించింది. వారి పరిస్థితుల్లో నేను ఉంటే.. ఆ పేదరికాన్ని ఎలా పోగొట్టగలనన్న ఆలోచన చేశా. ఆ ఇళ్లలో ఆరేడు తరగతులు చదివే బిడ్డలను బడులు మాన్పించేసి పనుల్లోకి పంపడం చూశా. ఆ పిల్లలు పెద్ద చదువులు చదివి డాక్టరో, ఇంజనీరో అయితేనే కదమ్మా పేదరికం పోయేది? ఎందుకమ్మా వాళ్లనిలా పనులకు పంపుతున్నారు? అని ఆ అక్కాచెల్లెళ్లతో అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం విని చాలా బాధనిపించింది. ‘మాక్కూడా చదివించాలని ఉందన్నా.. కానీ కడుపు నిండితేనే కదన్నా వారిని బడికి పంపగలం’ అని వారన్న మాట ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంది. నేనీరోజు ఆ అక్కాచెల్లెమ్మలకు చెప్తున్నా.. త్వరలోనే సువర్ణయుగం వస్తుంది. ఆ సువర్ణయుగంలో.. మీరు బతకడం కోసం పిల్లలను పనికి పంపాల్సిన అవసరం ఉండదు. పిల్లలను బడికి పంపితే.. ప్రభుత్వం తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేస్తుందని హామీ ఇస్తున్నా.

అవ్వా, తాతలకు మూడు పూటలా భోజనం..

ఆ గ్రామాలకు పోయినప్పుడు.. చేలలో పనిచేసుకుంటూ నన్ను చూసి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చిన అక్కా, చెల్లెమ్మల్లో అవ్వలు కూడా ఉన్నారు. ఈ వయసులోనా అవ్వా నువ్వు పనిచేస్తున్నావు? అని ఓ అవ్వను అడిగా.. ‘నాయనా మీ నాయన పుణ్యాన నెల నెలా రూ.200 పింఛనైతే వస్తోంది.. కానీ దాంతో మూడు పూటలా భోజనం చేయలేం కదా నాయనా’ అన్న మాట నా గుండెలను ఇప్పటికీ కలచివేస్తోంది. ప్రతి అవ్వా, ప్రతి తాతకు నేను చెప్తున్నా.. త్వరలోనే సువర్ణయుగం వస్తుంది. బతకడం కోసం ఏ అవ్వా, తాతా పనిలోకి పోవాల్సిన అవసరమే ఉండదు. మీరు ఇళ్లల్లోనే ఉండి మూడు పూటలా భోజనం చేసే రోజు త్వరలోనే వస్తుంది.

అక్కాచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు

పల్లెల్లో అక్కాచెల్లెమ్మలను కలిసినప్పుడు అమ్మా మీకు పావలా వడ్డీ రుణాలు అందుతున్నాయా? అని అడిగా. ‘మీ నాయన బతికున్నప్పుడు బ్యాంకు మేనేజర్ల దగ్గరకు తల ఎత్తుకుని గర్వంగా పోయేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్యాంకు మేనేజర్లను పావలా వడ్డీ గురించి అడిగితే.. ఈ ప్రభుత్వం మాకు డబ్బులిస్తే కదా.. మీకు డబ్బులిచ్చేది అంటున్నారన్నా’ అని బాధపడ్డారు. వచ్చే సువర్ణయుగంలో మీరు రుణాల గురించి ఇబ్బందులు పడే పరిస్థితే రాకుండా చూస్తాం. మీకు వడ్డీలేని రుణాలు అందించే బాధ్యత మాదేనని హామీ ఇస్తున్నా.
Share this article :

0 comments: