నేతన్నలను గాలికొదిలిన ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేతన్నలను గాలికొదిలిన ప్రభుత్వం

నేతన్నలను గాలికొదిలిన ప్రభుత్వం

Written By ysrcongress on Thursday, February 2, 2012 | 2/02/2012

మరణాలు నేస్తున్న మగ్గం
ఏడాది కాలంలో 50 మందికిపైగా కార్మికుల ఆత్మహత్య
ఇప్పటిదాకా పరిహారం ఇచ్చింది ముగ్గురంటే ముగ్గురికే !
కార్మికులను ఆదుకునేందుకు వైఎస్ ప్రకటించిన ప్యాకేజీకి గ్రహణం
2009-10 బడ్జెట్‌లో రూ. 312 కోట్లు కేటాయించిన వైఎస్
ఆ బడ్జెట్‌ను రూ. 200 కోట్లకు కుదించి.. రూ. 109 కోట్లే విడుదల చేసిన ప్రస్తుత సర్కారు.. అదీ సహకార సంఘాలకే... వ్యక్తిగత రుణ మాఫీయే లేదు..


...వీరే కాదు గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 50మందికిపైగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇప్పటివరకు కేవలం ముగ్గురంటే ముగ్గురికే రాష్ట్ర సర్కారు నష్టపరిహారం చెల్లించింది. ఓవైపు ఆకాశానికంటుతున్న నూలు, జరీ రేట్లు.. మరోవైపు కొండలా పెరిగిపోతున్న అప్పుల కుప్పలు.. ఇంకోవైపు రుణం చెల్లించాలంటూ బ్యాంకర్ల వేధింపులు... వీటన్నింటిమధ్య సతమతమవుతున్న నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు లోనై గుండె ఆగి మరణిస్తున్నారు. మానవతాదృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేస్తోంది. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిహారం దక్కడం లేదు. గతంలో సిరిసిల్ల చేనేత కార్మికుల మరణాలపై స్పందించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణ మాఫీని ప్రకటించారు. అయితే ఆయన మరణానంతరం ఈ రెండింటికి గ్రహణం పట్టింది!

వ్యక్తిగత రుణాల మాఫీ ఎక్కడ: చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామని దివంగత వైఎస్ హామీనిచ్చారు. ఆ మేరకు 2009-10 బడ్జెట్‌లో రూ.312 కోట్లు కేటాయించారు. కానీ అదే ఏడాది ఆయన అకాల మరణంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. 2011-12లో ఈ బడ్జెట్‌ను రూ.200 కోట్లకు కుదించారు. అందులో ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం రూ.109 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అది కూడా కేవలం చేనేత సహకార సంఘాల రుణాలు మాత్రమే మాఫీ చేసింది. ఆర్టిజాన్ క్రెడిట్ కార్డు, పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న వ్యక్తిగత రుణాలను మాఫీ చేయలేదు. దీంతో రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నేత కార్మికులకు నోటీసులు జారీ చే స్తూ వేధిస్తున్నారు. 

21 నెలల వడ్డీ కట్టాలట..: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందానా.. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికులపై బ్యాంకులు మరో బండ పడేశాయి. 21 నెలల వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ అమలు చేస్తామంటూ మెలిక పెడుతున్నాయి. అప్పటివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. 2010 మార్చి వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే నిధులను మాత్రం 2011 ఏప్రిల్ నెలలో విడుదల చేసింది. ఇందులో వ్యక్తిగత రుణాలు చాలా తక్కువ. ఈ నిధులు ట్రెజరీ నుంచి మే చివరినాటికిగానీ బ్యాంకుల ఖాతాల్లోకి చేరలేదు. ఫలితంగా విడుదల చేసిన కొద్దిపాటి నిధులతో.. రుణాలు మాఫీ కావడం లేదు. 2010 ఏప్రిల్ నుంచి 2011 డిసెంబర్ వరకు 21 నెలల వడ్డీ చెల్లించాలంటూ చేనేత కార్మికులపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో రుణమాఫీ ప్రక్రియ నిలిచిపోయింది.

వైఎస్ ప్యాకేజీ ఏమైపోయింది..?: ఆత్మహత్యకు పాల్పడిన రైతులకిచ్చే ఆర్థిక ప్యాకేజీనే దివంగత నేత వైఎస్ నేతన్నలకూ అమలు చేశారు. ఆ మేరకు ఆయన హయాంలో 2006 ఫిబ్రవరిలో జీవో 46, అదే ఏడాది ఏప్రిల్‌లో 119 జీవోలు విడుదలయ్యాయి. 1997 ఏప్రిల్ ఒకటి నుంచి ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికులకు ఈ ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేశారు. పెద్ద దిక్కును కోల్పోయిన వందలాది చేనేత కుటుంబాలను ఉదారంగా ఆదుకున్నారు. చేనేత మరణాలు ఎక్కువగా చోటుచేసుకునే ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే 115 కుటుంబాలకు లక్షన్నర రూపాయల ప్యాకేజీని అందజేశారు. అయితే మహానేత మరణానంతరం ఈ ప్యాకేజీ నీరుగారిపోయింది. ఇప్పుడు పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డా వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఆర్థిక సాయం అందడం లేదు.

నూలు లేక ఆప్కో విలవిల...: ఆప్కోకు అవసరమైన నూలును జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) సరఫరా చేస్తుంది. అయితే ఆర్థిక సమస్యల వల్ల సరఫరా చేసిన నూలుకుగానూ ఎన్‌హెచ్‌డీసీకి ఆప్కో డబ్బులు చెల్లించలేకపోతోంది. నిధులు చెల్లించకపోతే నూలు సరఫరా నిలిపివేస్తామని పలుమార్లు ఎన్‌హెచ్‌డీసీ.. ఆప్కోకు తేల్చిచెప్పింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆప్కో నిధులు చెల్లించకపోవడంతో తాజాగా ఆ సంస్థకు ఎన్‌హెచ్‌డీసీ నూలు సరఫరాను పూర్తిగా నిలిపేసింది. మార్కెట్లో నూలు కొనుగోలు చేసి.. చేనేత సహకార సంఘాలకు ఇచ్చే పరిస్థితిలో ఆప్కో లేదు. దీంతో చేనేత సహకార సంఘాలే అధిక ధరకు మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

బకాయిలు తీర్చేదెప్పుడు..?: వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన బట్టను ఆప్కో సరఫరా చేస్తోంది. వివిధ శాఖలు ఆప్కోకు రూ.65 కోట్ల మేరకు బకాయి పడ్డాయి. బకాయిలు పేరుకుపోవడంతో సహకార సంఘాల నుంచి కొన్న బట్టకు ఆప్కో నిధులు ఇవ్వడం లేదు. ఆ సంఘాలు.. పనిచేస్తున్న కార్మికులకు వేతనాలివ్వడం లేదు.

రేట్లకు రెక్కలు ఇలా: గత రెండేళ్ల వ్యవధిలోనే పట్టుచీరలకు ఉపయోగించే రేషం (అడ్డదారం), వార్పు, జరీ ధరలు రెండింతలు పెరిగాయి. గతంలో కేజీ రేషం రూ.1,400 ఉండగా ప్రస్తుతం రూ.2,400కు చేరింది. వార్పు (నిలువుదారం) రూ.1,300లు ఉండగా ఇప్పుడు రూ.2,800కు చేరింది. జరీ ఒక మార్క్ (నాలుగు బిల్లలు) రూ.180లు ఉండగా ప్రస్తుతం రూ.400కు చేరింది. దీంతో నేతన్నలు ఒక చీరను తయారుచేస్తే లాభం రాకపోగా రూ.300 నుంచి రూ.500 దాకా నష్టం వస్తోంది.
-న్యూస్‌లైన్, హైదరాబాద్

ఇదీ సిరిసిల్ల ప్యాకేజీ..

నేతన్నల బలవన్మరణాలతో ‘ఉరి’సిల్లగా మారిన సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఆ ప్యాకేజీ కింద అనేక కార్యక్రమాలు చేపట్టారు.. ఆ వివరాలివీ..

అప్పుల ఊబిలో ఉన్న కార్మికులకు బ్యాంకు రుణాలిప్పించడం. తద్వారా వారిపై వడ్డీ భారం తగ్గించారు.

పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా కొత్త రుణాలను ఇప్పిం చారు. ఈ రుణాలతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపారు. బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ మహిళకు రుణం అందించారు.

నేత కార్మికులందరికీ అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డులు జారీ చేసి, ప్రతి కుటుంబానికి ఉచితంగా 35 కిలోల బియ్యం సరఫరా చేశారు.

ఆత్మహత్యలను నివారించి కార్మికుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

పనిభారంతో మద్యానికి బానిసైన వారిలో ప్రవర్తన తెచ్చేందుకు డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

కార్మికుల్లో వృత్తి నైపుణ్యం కోసం రూ.2 కోట్ల కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేశారు. శిక్షణాకాలంలో కార్మికులకు రూ1,500-రూ.2,000 దాకా స్టైఫండ్ అందజేశారు.

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక్కో వార్డుకు ఒక్కో ఎంపీడీవోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపట్టారు.

వెయ్యి కోట్లు కేటాయించాలి

దయనీయ స్థితిలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే వ్యక్తిగత రుణాలు మాఫీ చేయాలి. కొత్త రుణాలను ఇప్పించాలి. సబ్సిడీ నూలు సరఫరాను పెంచాలి. ఎన్‌హెచ్‌డీసీ నుంచి నూలు కొనుగోలు చేసి.. చేనేత సహకార సంఘాలకు సరఫరా చేయాలి. ఆప్కోకు వెంటనే బకాయిలు చెల్లించాలి. వచ్చే బడ్జెట్‌లో చేనేత రంగానికి వెయ్యి కోట్లు కేటాయించాలి. సిరిసిల్ల తరహా ప్యాకేజీని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.

-కేఏఎన్ మూర్తి, చేనేత ఐక్య వేదిక నేత 

ఇలాగైతే చేనేత కనుమరుగే..

చేనేతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందువల్లే నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదైనా ఉద్యమం చేసినప్పుడు ఒక హామీ పడేయడం తప్ప చేనేత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి చూపడం లేదు. ఎనిమిది కేజీల సబ్సిడీ రేషం ఇస్తామని... ఆరు కేజీలే ఇస్తున్నారు. ప్రభుత్వ తీరు ఇలాగేఉంటే చేనేత రంగం పూర్తిగా మరుగునపడిపోతుంది.
-పోలా రామాంజనేయులు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

గిట్టుబాటు ధర లేకే..

తయారు చేసిన చీరలకు గిట్టుబాటు ధరలు దక్కక కార్మికులు అప్పులపాలవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని ఆర్భాటం చేసినా అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. మగ్గం నేయడం తప్ప మరేపని తెలియని వారిని సర్కారే ఆదుకోవాలి.
-జింకా చలపతి, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నేత

భార్యతో కలిసి నేతన్న ఆత్మహత్య 
9 నెలల గర్భంతో ఉన్న భార్య అనాథ అయిన ఐదేళ్ల చిన్నారి
సిద్దవటం (వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: అప్పులు తిరిగి చెల్లించలేనన్న ఆవేదనతో ఓ నేతన్న.. నిండు గర్భిణైన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేళ్ల వయసున్న వీరి కుమార్తె అనాథగా మారింది. వైఎస్సార్ జిల్లాసిద్దవటం మండలం మాధవరం 123 వార్డులు గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేనేత పరిశ్రమ నిర్వహించే బాలాజీకి ఎనిమిదేళ్ల క్రితం ఇతనికి సిద్దవటం మండలం లింగంపల్లెకు చెందిన భారతితో వివాహమైంది. పలుచోట్ల అప్పులు చేసి ఆ మొత్తాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. అయితే తనకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తులు మోసం చేయడంతో ఆందోళనకు గురయ్యాడు. దాంతో మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Share this article :

0 comments: