ప్రపం చం మొత్తం మాయదారి వ్యామోహాల వెనక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రపం చం మొత్తం మాయదారి వ్యామోహాల వెనక

ప్రపం చం మొత్తం మాయదారి వ్యామోహాల వెనక

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012

నీ గురించి నువ్వు తెలుసుకోవడం జ్ఞానానికి తొలి మెట్టు అన్నాడు అరిస్టాటిల్. మన విద్యావిధానం ఆర్జన గురించి చెప్పినంతగా మనిషి గురించీ, సమాజం గురించీ చెప్పడం లేదు. దీని విష ఫలితాలు పాశ్చాత్య ప్రపంచాన్ని తాకి చాలా దశాబ్దాలైంది. ఆలస్యంగా మన ఇంటి తలుపు కూడా తట్టాయని తాజాగా చెన్నైలో జరిగిన విషాద ఘటన హెచ్చరిస్తోంది. ఆ నగరంలోని 160 ఏళ్ల చరిత్ర గల సెయింట్ మేరీ ఆంగ్లో ఇండియన్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రెండు రోజుల క్రితం తన హిందీ టీచర్‌ను పొడిచి చంపేశాడు. అందు కోసమని స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలతోపాటు కత్తిని కూడా తీసుకొచ్చాడు. తరగతిలో వెనకబడి ఉన్నాడని, బాగా చదివించమని ఆ టీచర్ అతని తల్లి దండ్రులకు ఒకటికి రెండుసార్లు ఫిర్యాదు చేశారట. 

ఈ చిన్న కారణం అతన్ని బాల్యంలోనే పెద్ద హంతకుడిగా మార్చేసింది. బాల్యంలో చేసిన హత్య గనుక మూడేళ్లకు మించి శిక్ష పడదని చెబుతున్నారు గానీ... అతడిక మామూలు మనిషిలా మసిలే స్థితి అయితే లేదు. ఇప్పుడు అమ్మా నాన్నలకు దూరంగా, తనలాగే రకరకాల నేరాలు చేసిన పిల్లలుండే బాల నేరస్తుల జువెనైల్ హోంలో ఒకడిగా మారాడు. పిల్లల నుంచి బాల్యాన్ని కొల్లగొట్టి, వారికి రంగుల హరివిల్లులను దూరంచేసి పోటీయే పరమావధిగా మారిస్తే పర్యవ సానాలు ఇంతకంటే మెరుగ్గా ఎందుకుంటాయి? 

విద్య-సమాజం విడదీయలేనివి. అవి పరస్పరాశ్రీతాలు. అదే సమయంలో పరస్పర ప్రభావితాలు కూడా. సమాజంతో ముడిపడి మాత్రమే విద్య ఉంటుంది. అలాగే సమాజాన్ని అది ప్రభావితం చేసి మెరుగుపరుస్తుంది.

మెరుగుపడిన సమాజం వల్ల విద్య కూడా మరింత ఉచ్ఛ స్థితికి వెళ్తుంది. ఇలా ఉండవలసిన క్రమం ఎక్కడో తెగిపోయింది. ఎల్‌కేజీలో చేరినప్పటినుంచి పీజీ దాకా పోటీ తత్వం పిల్లల్ని పీక్కుతింటోంది. వాళ్లని పీల్చి పిప్పి చేసి సమాజం మీదకు వదులుతోంది. విద్య పూర్తిగా లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా గత రెండున్నర దశాబ్దాలుగా రకరకాల పోటీ పరీక్షలు పుట్టుకొచ్చి వాటి మీద కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. అయిదారేళ్లుగా అయితే కాన్సెప్ట్ స్కూళ్ల పేరుతో ప్రాథమిక పాఠశాలల స్థాయికి కూడా ఈ పోటీ వచ్చేసింది. దాంతో పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1999-2009 మధ్య చూస్తేనే విద్యా ఖర్చు 162 శాతం పెరిగిందని ఒక అంచనా. అదే సమయంలో పట్టణ ప్రాంతాల కుటుంబాల వార్షిక వ్యయం 148 శాతం పెరిగింది. ఖర్చు పెరిగిపోవడంతో తల్లిదండ్రుల్లో ఆత్రుత కూడా పెరిగిపోతోంది. తమ సంతానం పెద్దయ్యాక ఏ డాక్టరో, ఇంజనీరో అయితే బాగా డబ్బు సంపాదిస్తారని, సమాజంలో చీకూచింతా లేకుండా బతుకుతారని ఆశిస్తున్నారు. అందుకోసం పిల్లలు పోటీలో రాణించడానికంటూ తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారు. 

సూర్యోదయానికి ముందే ఇంటినుంచి బయల్దేరిన విద్యార్థి చీకటి రాత్రి తిరిగొస్తున్నాడు. వారి రోజువారీ పనులన్నీ టైంటేబుల్ చట్రంలో ఇరుక్కుపోతున్నాయి. అమ్మా నాన్నలతోగానీ, ఇంట్లో ఉన్న మిగిలినవారితో గానీ గడిపే వ్యవధే ఉండటం లేదు. కొద్దో గొప్పో దొరికే వ్యవధిలో రంగు రంగుల చానెళ్లు వారిని నమిలేస్తున్నాయి. ఎక్కడెక్కడికో తీసుకు పోతున్నాయి. తమ పిల్లలకు సత్ప్రవర్తన అలవర్చి, వారిలోని సున్నితత్వాన్ని కాపాడి, మంచి అభిరుచులు ఏర్పరచవలసిన స్థానంలో ఉన్న తల్లిదండ్రులు పోటీ ప్రపంచం సృష్టించిన విషవలయంలో చిక్కుకుని తాము హైరాన పడి పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ సంగతిని గుర్తించేంత వ్యవధే వారికి ఉండటం లేదు. ఇందులో టీచర్లు సైతం పావులవుతున్నారు. సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. 

తమ సామర్థ్యాన్ని పిల్లల మార్కులతో కొలుచుకుంటున్నారు. కాగితాల్లో ఉన్నదంతా పిల్లల మెదళ్లకు బలవంతంగా ఎక్కించి వారిని ‘టాపర్లు’గా మార్చేద్దామన్న తహతహ పెరిగిపోయింది. పర్యవసానంగా గురు-శిష్య పరంపర అనే భావనే పోయి విద్యార్థి వినియోగదారుగా... టీచర్ సర్వీస్ ప్రొవైడర్‌గా మారారు. విద్యాలయాలు బోధనా దుకాణాలయ్యాయి. ఎలాంటి ‘సరుకు’ తీసుకొచ్చినా దాన్ని సానబట్టి మెరిపించేస్తామని తల్లిదండ్రుల్ని మురిపిస్తున్నాయి. విద్య ఈ స్థాయికి దిగజారడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే. ప్రధాన ముద్దాయిలూ ఆ సర్కార్లే. విద్యకు పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చి క్రమేణా ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ తమ బాధ్యతలనుంచి ప్రభుత్వాలు తెలివిగా తప్పుకున్నాయి. 

‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండన్న’ట్టు ప్రవర్తిస్తున్నాయి. 2000-01లో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి విద్యపై చేసిన ఖర్చు... మొత్తం ఖర్చులో 17.4 శాతం ఉండగా, 2009 నాటికి అది 14.2 శాతానికి దిగజారింది. ఇదే వ్యవధిలో కేంద్రం ఖర్చు 2.3 శాతం నుంచి స్వల్పంగా 4.4 శాతానికి మాత్రమే చేరుకుంది. క్యూబాలాంటి చిన్న దేశాలు కూడా తమ జీడీపీలో 18.7 శాతం విద్యకు కేటాయిస్తుంటే మన దేశం 4.1 శాతం మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంటోంది. 

అమెరికాలోనో, బ్రిటన్‌లోనో హైస్కూల్ విద్యార్థులు రెచ్చిపోయి రివాల్వర్ చేతబూని తోటి పిల్లల్ని చంపేశారన్న వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యపోయాం. కుటుంబ సంబంధాలు బలంగా ఉన్న మనలాంటి దేశంలో అలాంటివి సంభవించ బోవని భరోసా ఇచ్చుకున్నాం. కానీ, ఊరంతటికీ జబ్బు చేసినప్పుడు మన ఇల్లు ఒక్కటీ కులాసాగా ఉంటుందనుకోవడం తెలివితక్కువతనమే అవుతుంది. ప్రపం చం మొత్తం మాయదారి వ్యామోహాల వెనక పరుగులు పెడుతుంటే... అందులో మనం సైతం చేరిపోతే పర్యవసానాలు ఇంకోలా ఉండాలని కోరుకోవడం దురాశే అవుతుంది. జనం చైతన్యవంతమై ప్రభుత్వాల బాధ్యతారాహిత్యాన్ని నిలదీసి నప్పుడే, దారి మార్చుకునేలా చేసినప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది.
Share this article :

0 comments: