వై.ఎస్.విజయమ్మ నాయకత్వంలో వైఎస్సార్ సీఎల్పీ ఏర్పాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వై.ఎస్.విజయమ్మ నాయకత్వంలో వైఎస్సార్ సీఎల్పీ ఏర్పాటు

వై.ఎస్.విజయమ్మ నాయకత్వంలో వైఎస్సార్ సీఎల్పీ ఏర్పాటు

Written By ysrcongress on Tuesday, February 14, 2012 | 2/14/2012

క్రాప్ హాలిడే గురించి మాట్లాడలేదు 
సాగుకు ప్రత్యేక బడ్జెట్ ఊసే లేదు 
చేనేత రుణాల మాఫీ అంశమూ లేదు 
ఫీజు రీయింబర్స్‌మెంట్, జూడాల సమ్మె
తదితర కీలక అంశాలనూ విస్మరించారు 
ప్రతి ప్రజా సమస్యపై సభలో పోరాడతాం

హైదరాబాద్, న్యూస్‌లైన్:రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, ఎస్.వి.మోహన్‌రెడ్డిలు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తే.. అందుకు గల కారణాలను కానీ, పరిష్కారానికి భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యల గురించి కానీ గవర్నర్ చెప్పకపోవటం విచారకరమని సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. రాష్ట్రంలో 80% ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉండగా.. క్రాప్ హాలిడే ప్రకటించిన ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చే ఆలోచన చేయకపోవటం దురదృష్టకరమన్నారు. 

దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేనేత రుణాల మాఫీ కోసం రూ.300 కోట్లు కేటాయిస్తే.. ఆయన మరణం తర్వాత దాన్ని రూ.142 కోట్లకు కుదించారని.. ఈ అంశం కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. ఫీజు రీయింబర్స్, 108 సేవల ఇబ్బందులు, జూడాల సమ్మె, కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన, దళితులకు ప్రత్యేక బడ్జెట్ తదితర కీలక అంశాలేవీ గవర్నర్ ప్రసంగంలో లేవని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంశంపై గవర్నర్ ప్రస్తావించకపోవటాన్ని జూపూడి ప్రభాకరరావు తప్పుపట్టారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం చేసిన ఘటనలపై దోషులను శిక్షిస్తామన్న మాట కూడా లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క రోజన్నా ఎస్సీ, ఎస్టీల సమస్యలపై చర్చించాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. 

సర్కారు పడిపోతుందన్న భయమేమో..: రాష్ట్రంలో 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరగటం ప్రభుత్వానికి ఇష్టం లేనందువల్లే తమ అనర్హత అంశంపై నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతోందని.. విలేకరులు అడిగిన ప్రశ్నకు బాలినేని సమాధానం చెప్పారు. ఉప ఎన్నికల్లో 24 మందీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని అధికార పార్టీకి భయం ఉండొచ్చన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు స్థానాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతే మీపై చర్య తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమతో చెప్తున్నారని తెలిపారు. స్పీకర్‌పై గౌరవం ఉందని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 వైఎస్సార్ సీఎల్పీ ఏర్పాటు - ధర్మాన కృష్ణదాస్ వెల్లడి:

వై.ఎస్.విజయమ్మ నాయకత్వంలో ఏర్పాటు చేశాం
ప్రజాసమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: 
శాసనసభలో ప్రజా సమస్యలపై పోరాటానికి దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలందరం వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని(వైఎస్సార్ సీఎల్పీ) ఏర్పాటు చేసుకున్నట్లు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ నాయకత్వంలో వైఎస్సార్ సీఎల్పీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారమిక్కడ వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. అనంతరం కృష్ణదాసు మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. పాలకపక్షంతో కుమ్మక్కైందని విమర్శించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాదిరిగా తామంతా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ‘అందుకే విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడతాం. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని చెప్పారు. అదే విధంగా దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలినీ ఎండగడతామన్నారు. 

‘భూ కేటాయింపులపై స్పీకర్ వేసిన సభా సంఘాన్ని వైఎస్ హయాంకే పరిమితం చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దాన్ని చంద్రబాబు హయాం నుంచి ప్రస్తుత సీఎం కిరణ్ పాలన వరకూ విస్తరింపజేసేలా ఒత్తిడి తెస్తాం’ అని తెలిపారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, టి.బాలరాజు, జి.బాబూరావు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు, ఎస్.వి.మోహన్ రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు.


Share this article :

0 comments: