రామోజీ చెరలోవి అసైన్డ్ భూములే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ చెరలోవి అసైన్డ్ భూములే

రామోజీ చెరలోవి అసైన్డ్ భూములే

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

తన భూదాహం కోసం ఎలాంటి నిబంధనలనైనా తుంగలో తొక్కేందుకు రామోజీ వెనకాడరని మరోసారి స్పష్టమైంది. ఇక తాను చెప్పినదానికల్లా గంగిరెద్దులా తలూపి జీ హుజూర్ అంటూ చేసిపెట్టే చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో అండగా ఉంటే.. భూదాహం తీర్చుకోవటానికి రామోజీ తొక్కే అడ్డదార్లకు కొదవేముంటుంది! తాజాగా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామ శివార్లలో ఆయన కబ్జాలో ఉన్న 60.10 ఎకరాల స్థలం మిగులు భూమి అని రెవెన్యూ అధికారులు సర్వే ద్వారా తేల్చిన నేపథ్యంలో ఇది మళ్లీ రూఢీ అయింది.

స్వయంగా రామోజీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను ఆధారం చేసుకుని అధికారులు ఆధునిక ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతి ద్వారా నిర్వహించిన సర్వేలో రామోజీ చెరలో ఉన్న భూములు ‘మిగులు’ ఖాతాలో గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్నవని తేలిన సంగతి తెలిసిందే. దీంతో రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను జాయింట్ కలెక్టర్ జగన్నాధం కొట్టేసిన విషయం విదితమే. అసలు మిగులు భూములుగా తేల్చిన తర్వాత ఈ స్థలాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో పరిశీలించేందుకు రెవెన్యూ అధికారులు శనివారం పాత రికార్డులను పరిశీలించి కంగు తిన్నారు. ఆ 60.10 ఎకరాల భూములను 1992లో స్థానిక పేదవారికి అసైన్ చేసినట్లు తేలింది. అంటే అసైన్‌మెంట్ భూములను రామోజీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు. 

1992లో పేదలకు కేటాయింపు... 

అనాజ్‌పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 275లో నాలుగు ఎకరాలు, సర్వే నంబర్ 281లో 91 ఎకరాలను 1975-76 లోనే ప్రభుత్వం మిగులు భూములుగా గుర్తించిందని తాజాగా అధికారుల పరిశీలనలో తేలింది. ఆ తర్వాత వాటిని 1992లో స్థానిక నిరుపేదలకు ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం చొప్పున అసైన్ చేశారు. అసైన్‌మెంట్ కమిటీలో దీన్ని ప్రతిపాదించి మరీ ఖరారు చేశారు. ఇప్పుడు రామోజీ చెరలో ఉన్నట్లుగా అధికారులు తేల్చిన 60.10 ఎకరాల భూమి అలా పేదలకు కేటాయించిన భూమిలో భాగమేనని పాత రికార్డుల పరిశీలనతో తేలిందని అధికారులు శనివారం ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. అంటే.. రామోజీరావు ఆ భూములను పేద రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రూఢీ అవుతోంది. ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యం చేరువలోని పాలమాకుల గ్రామంలో రామోజీ ఇలాగే పెద్ద మొత్తంలో అసైన్‌మెంట్ భూములు స్వాహా చేసినట్లు అధికారుల పరిశీలనలో బట్టబయలైన విషయం తెలిసిందే. రామోజీరావు తమ భూముల్లోకి దారి లేకుండా చేయటంతోపాటు.. తమను రకరకాలుగా భయపెట్టి తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అతి తక్కువ ధరకు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అక్కడి రైతులు బహిరంగంగా ఆరోపించటమే కాకుండా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. పాలమాకుల భూముల విషయంలో అనుసరించిన పద్ధతినే రామోజీరావు అనాజ్‌పూర్‌లో కూడా అనుసరించినట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 

పత్రికలో అబద్ధాల రాతలు... 

ఓవైపు రామోజీ భూదందాలు ఆధారాలతో సహా బట్టబయలవుతున్నా ఆయన మాత్రం ‘నేను తప్పులు చేయను’ అంటూ స్వయంగా తన పత్రికలో అబద్ధాలను వివరణలుగా రాసుకోవటం విస్మయం కలిగిస్తోంది. పాలమాకులలో రామోజీ అక్రమాలను ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. దీంతో అధికారులు సర్వేకు ఉపక్రమిస్తున్న తరుణంలో.. తన స్వాధీనంలోని భూములు పక్కాగా పట్టా భూములేనంటూ ఈనాడు పత్రికలో రామోజీ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. కానీ రామోజీ భూముల్లో ప్రభుత్వ స్థలాలున్నట్లు తేలింది. దీంతో తన అక్రమాల డొంక కదులుతోందని గాభరా పడ్డ రాజగురివింద.. తన కబ్జాలో ఉన్న దాదాపు రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే అసైన్‌మెంటు భూముల ఫెన్సింగ్ తొలగించారు. 

దీంతో అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అక్రమంగా సర్కారు భూములు, అసైన్డ్ భూములను సొంతం చేసుకుని కూడా.. తాను పరిశుద్ధుడ్నని తన పత్రికలో రాసుకోవటం ఆయన దగాకోరుతనాన్ని బట్టబయలు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. అనాజ్‌పూర్‌లో కూడా రామోజీ స్వాధీనంలో ఉన్నది మిగులు భూములేనని తేల్చి, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జాయింట్ కలెక్టర్ కొట్టేస్తే.. రామోజీ మాత్రం తన పత్రిక శనివారం నాటి సంచికలో ‘నా స్వాధీనంలో ప్రభుత్వ భూములు లేవు’ అని రాసుకుని (ఆయన సంస్థ ఉద్యోగి పేరుతో) మరోసారి పరువు పోగొట్టుకున్నారు. దాదాపు 37 ఏళ్ల కిందటే ఆ భూములను మిగులు భూములుగా ప్రభుత్వం గుర్తించటం, వాటిని ఆ తర్వాత పేదలకు అసైన్ చేయటం వాస్తవమైతే.. అవి నిఖార్సయిన పట్టాభూములంటూ రామోజీ తన వివరణలో పేర్కొనటం విచిత్రం. అవి అసైన్డ్ భూములని తేలిన నేపథ్యంలో రామోజీపై చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సెలవులో ఉన్నందున ఆయన రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

త్వరలోనే ఆ భూముల స్వాధీనం... 

రామోజీ కబ్జాలో ఉండిపోయిన 60.10 ఎకరాల స్థలం మిగులు భూమి అని తేలినందున వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ సిబ్బంది సిద్ధమయ్యారు. రామోజీ పిటిషన్‌ను జేసీ కోర్టు కొట్టేసిన క్రమంలో.. ఆ భూములను స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ పద్ధతిలో కంచె నిర్మిస్తే మళ్లీ భూములు కబ్జా అయ్యే ప్రమాదం ఉండటంతో శాటిలైట్ పరిజ్ఞానం వినియోగించే డీజీపీఎస్ పద్ధతిలో హద్దులు గుర్తించి కంచె నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల.. ఒకవేళ ఎవరైనా కంచె తొలగించినా హద్దులను సులభం గా నిర్ధారించుకునే వీలు కలుగుతుంది. 
Share this article :

0 comments: