నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని వారిని ప్రశ్నించరేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని వారిని ప్రశ్నించరేం?

నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని వారిని ప్రశ్నించరేం?

Written By ysrcongress on Monday, February 20, 2012 | 2/20/2012

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో గందరగోళం అంటూ దుష్ర్పచారం 
జగన్ అరెస్టు తర్వాత వారిపై వేటు, తర్వాతే ఉప ఎన్నికలు అంటూ రాతలు 
విప్ ధిక్కరించామని ఆ 17 మంది విస్పష్టంగా ప్రకటించటం తెలియదా? 
వారు అసెంబ్లీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కండువాలు ధరించి రావటం కనిపించదా? 
నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని వారిని ప్రశ్నించరేం? 
సీఎం - మంత్రులు - సీనియర్ల ఆధిపత్య పోరుతో కాంగ్రెస్‌లో పెనుదుమారం 
ఏడుగురు ఎమ్మెల్యేలు దూరమవటంతో ప్రధాన ప్రతిపక్షంలో అయోమయం 
కాంగ్రెస్, టీడీపీల్లో గందరగోళాన్ని దాచి.. వైఎస్సార్ కాంగ్రెస్‌పై కుట్ర కథలు 
ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతిష్ట దెబ్బతీసే పన్నాగం

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, వారికి ఉమ్మడిగా కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా.. అందరూ కూడబలుక్కొని మరో కుట్రకు తెరతీశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని గత రెండేళ్లుగా పనిచేస్తున్న ఈ మాయాత్రయం ఇప్పుడు మరో కుతంత్రాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టవుతారని.. ఆ నేపథ్యంలో 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి.. వారిపై అసత్య కథనాలతో ప్రతిష్టను దెబ్బతీసి.. అనంతరం తీరికగా ఉపఎన్నికలు జరిపించుకోవాలన్న కుటిల బుద్ధిని బాహాటంగా చాటుకుంటోంది. కాంగ్రెస్, టీడీపీ కూటమి అనుకున్నదే ఆలస్యమన్నట్లు.. ఎల్లో మీడియా ‘గందరగోళంలో జగన్ వర్గం’ అంటూ కట్టుకథలతో కొత్త ప్రచారానికి తెరతీసింది. ఇచ్చిన మాట కోసం అవిశ్వాస తీర్మానంపై పార్టీ విప్‌లను ధిక్కరించి 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు.. వారి శాసన సభ్యత్వంపై నిర్ణయం తీసుకోవలసిన వారిని ప్రశ్నించాల్సిన మీడియా.. అందుకు విరుద్ధంగా మాట మీద నిలబడిన ఎమ్మెల్యేలే ఏదో గందరగోళంలో పడినట్లు దుష్ర్పచారానికి ఒడిగడుతోంది. పైగా.. వారిపై అనర్హత ఎప్పుడు ప్రకటించాలి? ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి? అన్న ప్రణాళికను కూడా ఎల్లో మీడియా నిర్దేశించటం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎలాంటి గందరగోళం లేదని.. తమ అభిప్రాయాలపై వారు స్పష్టమైన వైఖరితో ఉన్నారని మొదటి నుంచీ విస్పష్టం. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలంతా దానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. అంతేకాదు.. ప్రస్తుత శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన రోజున కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ కండువా ధరించి మరీ సభకు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అంతకుమించి.. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ ద్వారా అసెంబ్లీ లోపలా వెలుపలా క్రియాశీలమైన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శాసనాసభా పక్షాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదంతా చూసి.. భయపడుతున్న కాంగ్రెస్ - టీడీపీ - ఎల్లో మీడియా దుష్టత్రయం.. వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బతీయటమే లక్ష్యంగా ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరతీసిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. 

నిర్ణయం తీసుకోవలసిందెవరు? 

రైతులు, రైతు కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో శాసనసభలో ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుగానే స్పష్టమైన ప్రకటన చేసింది. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కాక ముందు సరైన సందర్భమని చెప్పినా.. ప్రతిపక్ష టీడీపీ అవిశ్వాసానికి వెనుకడుగు వేసింది. ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందోనని ఆందోళనకు గురైంది. పైగా ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలో ఎవరో చెప్తే తాము వినాల్సిన అవసరం లేదని, ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసని చెప్తూ చివరకు చేసిందేమిటి? పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని లెక్కలేసుకున్న తర్వాతే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇచ్చిన మాటపై నిలబడి 17 మంది ఎమ్మెల్యేలు పార్టీల విప్‌లను ధిక్కరించి మరీ అవిశ్వాస తీర్మానానికి ఓటు వేశారు. వారిపై ఫిర్యాదు చేయటానికి కూడా కాంగ్రెస్ వారం సమయం తీసుకుందంటే.. గందరగోళంలో పడింది ఆ పార్టీ నేతలేనన్నది సుస్పష్టం. ఆ 17 మంది ఎమ్మెల్యేలు.. స్వయంగా స్పీకర్ సాక్షిగా, శాసనసభ సాక్షిగా, యావత్తు రాష్ట్ర ప్రజల సాక్షిగా విప్‌ను ధిక్కరించారు. దానిపై స్పీకర్ నోటీసులు ఇస్తే వాటికి సమాధానమూ ఇచ్చారు. పైగా రైతులు, రైతు కూలీల కోసం పార్టీ విప్‌ను ధిక్కరించాల్సి వచ్చిందని, తమపై తక్షణం వేటు వేయాలని లిఖితపూర్వకంగా స్పీకర్‌కు అందజేశారు. ఇంత జరిగాక నిర్ణయం తీసుకోవలసిందెవరు? పార్టీ విప్‌ను ధిక్కరించిన వారిపై వేటు వేయాలని అడగాల్సిందెవరు? విప్‌ను ధిక్కరిస్తామని చెప్పి మరీ ధిక్కరించిన ఎమ్మెల్యేలే స్వయంగా ‘మమ్మల్ని అనర్హులుగా ప్రకటించండి.. ఉపఎన్నికల్లో పోటీ చేస్తాం’ అని చెప్పినప్పటికీ నిర్ణయం వెలువడలేదు. దానికి ఎమ్మెల్యేలదే తప్పయినట్లు ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా సిండికేట్ దుష్ర్పచారానికి దిగింది. ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించినా కూడా పాలకులు రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం నడచుకోలేనప్పుడు వాటిని ఎత్తిచూపాల్సిన ఎల్లో మీడియా ఆ పనిచేయకపోగా దానికి వక్రభాష్యం చెప్తూ రెండు ప్రధాన పార్టీల వ్యూహంలో భాగమై పనిచేస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 

ఎమ్మెల్యేల్లో ఏ మార్పు కనిపించింది? 

స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే ఎమ్మెల్యేలదా తప్పు? సత్వరం నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఇక స్పీకర్ వద్దకు వెళ్లబోమని కూడా ప్రకటించారు. మరి కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పీకర్‌పై ఒత్తిడి తేలేకపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలతో పాటే ఈ 17 సెగ్మెంట్లు చేరి మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందో కాంగ్రెస్, టీడీపీలకు బాగా తెలుసు. అందుకే కుట్ర ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో దాటవేత వైఖరిని ప్రదర్శించాయి. ఇప్పుడు ఏడు స్థానాల ఉపఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఇక 17 మందిపై వేటు వేసినా తక్షణం ఎన్నికలు జరగవన్న ఆలోచనతో కొత్త కుట్రను అమలు చేస్తున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో సర్కారు నిత్యం సతమతమవుతున్నప్పటికీ.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుండా ఒక పథకం ప్రకారం అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయి పనిచేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాలుగు రోజులూ ఏ సమస్యపైనా చర్చించలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఎవరిది గందరగోళం..?

విప్‌ను ధిక్కరించిన తదనంతర పరిణామాల్లో వచ్చిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనటాన్ని కూడా ఈ సిండికేట్ జీర్ణించుకోలేకపోతోంది. ఆ 17 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఉన్నా ఉప ఎన్నికల గండంతో ఇంతకాలం సాగదీసిన అధికార పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కయి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్‌లో మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య విభేధాలు తీవ్రమై ఆధిపత్య పోరుతో కుమ్ములాటలతో ఆ పార్టీ గందరగోళంలో ఉంది. అలాగే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇక సహించలేమని ఏడుగురు ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్‌బై చెప్పినప్పుడు.. తెలంగాణ టీడీపీ ఫోరం అంటూ ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే ఎజెండా ఖరారు చేసుకుని కొందరు అసెంబ్లీకి హాజరైతే.. మరికొందరు బహిష్కరించిన టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అంతెందుకు ఇటీవలి కాలంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన పొలిట్‌బ్యూరో అయితేనేం, టీడీఎల్‌పీ అయితేనేం.. ఏ సమావేశం పెట్టినా పట్టుమని పది మంది కూడా హాజరు కాలేదంటే ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులేమిటో తేటతెల్లమవుతున్నాయి. ఇచ్చిన మాట కోసం 17 మంది ఎమ్మెల్యేలు విప్‌లను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటమే కాకుండా.. విప్‌ను ధిక్కరించామని స్పీకర్ సమక్షంలో చెప్పారు. అప్పటికీ నిర్ణయం వెలువడకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. అయినప్పటికీ వారేదో గందరగోళంలో పడ్డారని దుష్ర్పచారం చేయటం వెనుక కాంగ్రెస్, టీడీపీల కుతంత్రం ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. 

‘మ్యాచ్ ఫిక్సింగ్’పైనా మాయమాటలేనా?

అధికార కాంగ్రెస్‌తో ప్రతిపక్ష టీడీపీ గత రెండేళ్లుగా కుమ్మక్కయి వ్యవహరిస్తున్న విషయం జగమెరిగిన సత్యం. కడప, చిత్తూరు స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలూ పరస్పరం సహకరించుకుని ఓటేసుకున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటాలో ఏకంగా కొంత మంది ఎమ్మెల్యేలు పరస్పరం రెండో ప్రాధాన్యతా ఓటు వేసుకున్నాయి. బాన్సువాడ ఉపఎన్నికలో టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్‌కు పడినట్లు బయటపడింది. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన అమీర్‌పేట భూముల విషయంలో కానీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రిజమ్ సిమెంట్స్‌కు వెయ్యెకరాలు కేటాయించిన విషయంలో కానీ.. చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోవటం కూడా కలిసికట్టుగా చేసిన వ్యవహారంగా ఆయా పార్టీల నేతలే చెప్తున్నారు. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కమిషనర్ల నియామకంలో బాబు డిసెంట్ నోట్ రాయలేదన్న విషయం స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్ చెప్పగా.. దీంట్లో కిరణ్‌తో బాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని మరో మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. 

ఎన్నికల భయంతోనే..?

సీఎం కిరణ్ తాను అనుకున్న ఎమ్మెల్యేలకే నియోజకవర్గ నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఆ కేటాయింపుల్లో వివక్ష చూపిస్తున్నారని, అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేస్తే.. అదేదో ఆయన పొరపాటు చేసినట్లుగా కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా సిండికేట్ దుష్ర్పచారానికి ఒడిగట్టాయి. నిజానికి ముఖ్యమంత్రి నిధుల కేటాయింపులో తనవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు. 

కట్టుకథలతో దుష్ర్పచారం... 

ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఉప ఎన్నికలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 స్థానాల్లో ఉపఎన్నికలు రాకుండా ఇంతకాలం తెరవెనుక కుట్రలు పన్నిన ఈ సిండికేటు ఇప్పుడు మాట మార్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడు నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసినా వచ్చే ఇబ్బందేమీ లేదన్న రీతిలో దుష్ర్పచారానికి ఒడిగట్టింది. ఈ 17 స్థానాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఫలితాలు చేదుగా ఉంటాయని కాంగ్రెస్, టీడీపీలకు తెలుసన్న విషయాన్ని ఆయా పార్టీల నాయకులే అంగీకరిస్తున్నారు. అయితే ఎన్నికలకు అనుకున్నట్లుగానే సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ఆ ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే కొత్త దుష్ర్పచారం మొదలుపెట్టినట్లుగా చెప్తున్నారు. అందులో భాగంగానే మార్చిలో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, జగన్ అరెస్టయ్యే సమయానికి కాస్త ఇటు అటుగా 17 మందిపై వేటు వేస్తే సరిపోతుందని యోచిస్తున్నారని విషప్రచారం మొదలుపెట్టారు. జగన్‌ను అరెస్టు చేసి ఎన్నికలకు వెళితే తప్ప ఆయా నియోజకవర్గాల్లో తమ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు సాగవని కాంగ్రెస్, టీడీపీలు భావించినట్లున్నాయని.. అందుకే కట్టుకథలకు తెరలేపాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Share this article :

0 comments: