జగన్‌కు దగ్గరగా ఉన్న వారిని దీర్ఘకాలం జైల్లో ఉంచే వ్యూహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు దగ్గరగా ఉన్న వారిని దీర్ఘకాలం జైల్లో ఉంచే వ్యూహం

జగన్‌కు దగ్గరగా ఉన్న వారిని దీర్ఘకాలం జైల్లో ఉంచే వ్యూహం

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

 తప్పుడు కేసుల నమోదులో వైఎస్సార్ జిల్లా పోలీసుల చమత్కృతి
* జగన్‌కు దగ్గరగా ఉన్న వారిని దీర్ఘకాలం జైల్లో ఉంచే వ్యూహం..
* ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో పీడీ కేసుల్లో ఇరికిస్తున్న వైనం

పులివెందుల నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఐదున్నర లక్షల మెజారిటీ కట్టబెట్టిన జనాభిమానానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వచ్చే ఎన్నికల్లోనైనా మెజారిటీ తగ్గించాలంటే.. జగన్ కోసం జనం వీధుల్లోకి రావడానికే భయపడే స్థాయిలో ఇప్పట్నుంచే వారిని బెదిరించాలన్న ఆలోచనతో వారిపై మూకుమ్మడి కేసులు పెడుతున్నారు. ఇంకాస్త గట్టివాళ్లపై రౌడీషీట్లు తెరచి వేధిస్తున్నారు. ఈ భయాలనూ ఖాతరు చేయని వారికి ఆర్నెల్లో, సంవత్సరమో బెయిల్ దొరకకుండా చేసేలా ‘పీడీ’ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో వరుసగా రెండు మూడు సార్లు నిందితులుగా ఉన్న వారిపై ప్రయోగించడానికి వీలున్న ఈ పీడీ కేసుల్ని.. వైఎస్సార్ జిల్లా పోలీసులు ఇలా ‘ఉపయోగించుకుంటున్నారు’. వారు పెడుతున్న తప్పుడు కేసుల గురించి తెలుసుకోవడానికి.. మచ్చుకు ఓ రెండు కేసులను పరిశీలిస్తే జగన్‌కు ఏదో రకంగా దగ్గర సంబంధముంటే చాలు.. వారిపై ఎలాగోలా కేసు నమోదు చేయడానికి పోలీసులు రెడీ అయిపోతున్నారని అర్థమవుతుంది.

కేసు-1
కేసులో ‘పేర్కొన్న’ ప్రకారం.. వేంపల్లె పరిసరాల్లోని కొండల వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని 2012 జనవరి 21న పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో వేంపల్లె ఎస్‌ఐ రాజగోపాల్ తన సిబ్బంది నలుగురితో పాటు ముగ్గురు ఫారెస్టు అధికారులను వెంట తీసుకెళ్లారు. ఎందుకైనా మంచిదన్న ముందుచూపు(?)తో వీఆర్వో ఓబులేశు, గ్రామ సేవకుడు(కట్టుబడి) దానంలను కూడా పంచనామా పెద్దలుగా వెంటబెట్టుకెళ్లారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బుగ్గకొట్టాలు దాటాక వచ్చే కొండల వద్ద ఆగారు. పోలీసులను చూసి అక్కడున్న కొందరు వ్యక్తులు పారిపోసాగారు. వెంటాడగా ఇద్దరు చేతికి దొరికారనుకున్నంతలోనే వారు పోలీసులను తోసేసి పారిపోయారు. 

అలా తోసేసి పారిపోయిన వారిని కల్లూరు గంగాధర రెడ్డి, కొమ్మా చిన్నపురెడ్డిలుగా ఫారెస్టు సిబ్బంది గుర్తించారు. (పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్లో వీరిద్దరు. గతంలో ఎప్పుడూ ఫారెస్టు కేసుల్లో లేనప్పటికీ వీరిని స్థానిక పోలీసులకు బదులు ఫారెస్టు సిబ్బందే గుర్తించడం విశేషమే!). పైగా అక్కడ దొరికిన ఎర్రచందనం దుంగల బరువు 143 కేజీలని పోలీసులు పేర్కొన్నారు. పంచనామాకు వెళ్లినప్పుడు కాటా తీసుకెళ్లకపోయినా.. బరువు కచ్చితంగా లెక్కగట్టగల్గడం పోలీసుల గొప్పతనం! ఇలా గంగాధరరెడ్డి, చిన్నపురెడ్డి, మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎర్రచందనం అక్రమ రవాణా కేసు(క్రైం.నెం.6/2012) నమోదైంది.

తెల్లబోయిన వీఆర్వో, కట్టుబడి దానం
మరుసటి రోజు పేపర్లలో ఈ వార్త వచ్చింది. అది చూసి.. వీఆర్వో ఓబులేశు, కట్టుబడి దానంలు తెల్లబోయారు. కారణం అంతకు ముందురోజు వేంపల్లె బజార్లో వెళుతున్న ఈ ఇద్దరినీ ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించుకుని కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. తాము సంతకాలు పెట్టిన కాగితాలు ఇలా ‘ఉపయోగించుకున్నారని’ తెలిశాక వీఆర్వో, కట్టుబడి దానంలకు ఏం చేయాలో పాలుపోలేదు. మూడు నాలుగు రోజుల అంతర్మథనం తర్వాత జిల్లా కలెక్టర్‌ను కలిసి జరిగిన విషయాన్ని రాతపూర్వకంగా తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఏమవుతుందో వేచి చూడాలి.

కేసు-2
కేసులో ‘పేర్కొన్న’ ప్రకారం.. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఎస్‌ఐగా పనిచేసిన తిమ్మారెడ్డి ఇటీవలే బదిలీపై ఖాజీపేటకు వచ్చారు. 2011 డిసెంబరు 22న అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ఖాజీపేట పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాదారులపై దాడిచేశారు. ఒక టాటా సుమోతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారు తమకు తొండూరుకు చెందిన వై.వెంకట మల్లికార్జునరెడ్డితో పరిచయం ఉందని, అతను ఎర్రచందనం కొనుగోలు చేసేవాడని చెప్పార(ట). దీంతో ఈ కేసులో ముద్దాయిగా తొండూరు మల్లికార్జునరెడ్డిని ఎస్‌ఐ తిమ్మారెడ్డి చేర్చేశారు. ఈ కేసు గురించి అర్థం కావాలంటే కొన్ని నెలలు వెనక్కు వెళ్లాలి.

తొండూరు మాజీ జెడ్పీటీసీ అయిన శివమోహన్‌రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుడు. అంతకు మించి మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి బంధువు. ఇతను గతంలో తొండూరులో పాఠశాల భవన నిర్మాణ కాంట్రాక్టు చేశాడు. ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసి బిల్లులూ పొందాడు. అదే సమయంలో ఇతనికి పెట్రోలు బంకు డీలర్‌షిప్ వచ్చింది. బంకు ఏర్పాటుకు పాఠశాల ప్రహరీ అడ్డం వచ్చింది. దాన్ని పడగొట్టి బంకు ఏర్పాటుకు పూనుకున్నాడు. ఈ చర్యను నిరసిస్తూ స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన వై.వెంకట మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ఆక్రమణ దారుడైన శివమోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి బదులు, ఆందోళన చేపట్టిన జనంపై అప్పటి ఎస్‌ఐ తిమ్మారెడ్డి తన ప్రతాపం చూపారు. 

విషయం తెలుసుకున్న ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్, జగన్ మామ ఇ.సి.గంగిరెడ్డి హుటాహుటిన తొండూరుకు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్‌ఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు స్పందించక పోవడంతో విషయం ఎస్పీవద్దనే తేల్చుకుంటాం అని వేలాది మంది కార్యకర్తలతో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కడపకు పాదయాత్రగా బయలుదేరారు. దీంతో మార్గమధ్యంలో ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు కలుసుకుని స్థానిక పోలీసులతో క్షమాపణ చెప్పించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ తిమ్మారెడ్డి తొండూరు నుంచి ఖాజీపేటకు బదిలీ అయ్యారు. కాబట్టి ఖాజీపేటలో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ల నోట తొండూరు మల్లికార్జున పేరు ‘పలికింది’.
Share this article :

0 comments: