నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లో ఏం చూసి పెట్టుబడులు పెట్టారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లో ఏం చూసి పెట్టుబడులు పెట్టారు?

నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లో ఏం చూసి పెట్టుబడులు పెట్టారు?

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012

ఐటీ కమిషనర్‌కు ఏబీకే ప్రసాద్, విజయసాయిరెడ్డి ఫిర్యాదు
ఈ వ్యవహారంపై అన్ని ఆధారాలనూ సమర్పిస్తామని వెల్లడి
నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లో ఏం చూసి పెట్టుబడులు పెట్టారు?
రామోజీ వ్యక్తిగతంగా లబ్ధి పొందిన రూ.112 కోట్లపై పన్నే వేయలేదు
అత్యధిక ప్రీమియానికి షేర్లు బదలాయించి ఆయన వేల కోట్లు రాబట్టారు
వాటికి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించిందీ లేనిదీ దేవునికే తెలియాలి
సుప్రీంకోర్టును కూడా రామోజీ గ్రూపు తప్పుదోవ పట్టించింది
జగన్ గ్రూపు కంపెనీలపై చేసినట్టుగానే దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రామోజీ గ్రూపు కంపెనీల్లో రిలయన్స్ గ్రూపు గుల్ల (షెల్) కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తీరుపై సీనియర్ పాత్రికేయుడు ఎ.బి.కె.ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఐటీ కమిషనర్‌కు రెండ్రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదులో వారు కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పిస్తామని తెలిపారు. జగన్ గ్రూపు కంపెనీల కేసుల్లో చేసిన విధంగానే రామోజీ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడుల విషయంలోనూ దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

‘‘2007 సెప్టెంబర్ 29న ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ఒక్కో వాటా రూ.2.71 లక్షల ప్రీమియం చొప్పున 4,350 వాటాలను రామోజీరావుకు కేటాయించింది. తద్వారా రూ.118.15 కోట్ల పెట్టుబడి వచ్చినట్టయింది. తరువాత నాలుగు నెలలకల్లా, అంటే 2008 జనవరి 30న రూ.100 కోట్ల మూలధనమున్నరిలయన్స్ గ్రూపు గుల్ల కంపెనీ ఒకటి ఉషోదయలో రూ.1,423.6 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో వాటాకు రూ.5.28 లక్షలు వెచ్చించి 26,930 వాటాలను కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడి ద్వారా రామోజీ వ్యక్తిగతంగా రూ.112 కోట్లు లబ్ధి పొందారు. ఈ రూ.112 కోట్లకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 28(4) కింద పన్ను విధించే విషయంలో ఐటీ శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. రిలయన్స్ గ్రూపు గుల్ల కంపెనీల పెట్టుబడులను విశ్లేషిస్తే.. ఉషోదయలో 78.68 శాతం మూలధన వాటా ఉన్న రామోజీ మొత్తం పెట్టుబడి రూ.13.02 శాతం ఉంటే, రిలయన్స్ గ్రూపు కంపెనీయేమో కేవలం 21.32 శాతం వాటా కోసం 87 శాతం మేర పెట్టుబడి పెట్టింది! 

2008-09 ఆర్థిక సంవత్సరానికి రామోజీ గ్రూపు 22,320 వాటాలను ఒక్కో వాటా రూ.5.28 లక్షల చొప్పున రిలయన్స్ గ్రూపునకు చెందిన మరో గుల్ల కంపెనీకి రూ.1,180 కోట్లకు బదలాయించింది. ఈ మొత్తానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించారో లేదో ఆ దేవునికే తెలియాలి! దీనిపై దర్యాప్తు చేసేందుకు ఐటీ శాఖ సైతం ఆసక్తి చూపుతున్నట్టు కన్పించడం లేదు. జగన్ గ్రూపు కంపెనీల మూలధనం వాటా నామమాత్రమైనా, ఐటీ వర్గాలు మాత్రం క్యాపిటల్ రిసిప్ట్‌ను రెవెన్యూ రిసిప్ట్‌గా మదింపు చేశాయి. మన దేశ రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆ సూత్రం ప్రకారం రామోజీ గ్రూపుపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. కంపెనీల్లో మూలధనానికి సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎలాంటి వాల్యుయేషన్ రిపోర్టునూ రామోజీ గ్రూపు దాఖలు చేయలేదు. పైగా ఆ గ్రూపు గత కొన్నేళ్లుగా వరుసగా నష్టాల్లో ఉంది. అలాంటప్పుడు పెట్టుబడిదారులు ఏం చూసి ఆ గ్రూపు కంపెనీల పట్ల ఆకర్షితులయ్యారు? దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరముంది. రామోజీ గ్రూపు సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించింది. 2008 జనవరి 30 నాటికి రూ.1,864 కోట్ల డిపాజిట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ రూ. 2014.68 కోట్లు చెల్లించాల్సి ఉందని సత్యనారాయణ అండ్ కో చార్టర్డ్ అకౌం టెంట్లు అదే సమయానికి సర్టిఫై చేశారు! కాబట్టి 2008-09 ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు మొత్తాల మధ్య తేడా రూ.150 కోట్లపై పన్ను విధించాలి. జగన్ కంపెనీల విషయంలో చేసినట్లే దేశ ప్రయోజనాల దృష్ట్యా రామోజీ కంపెనీల విషయంలోనూ దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నాం’’ అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Share this article :

0 comments: