పశుసంవర్థక శాఖ ఏడీని అటవీశాఖలో విలీనం చేసేందుకు ససేమిరా!ముఖ్యమంత్రికి ‘భలే’ షాక్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పశుసంవర్థక శాఖ ఏడీని అటవీశాఖలో విలీనం చేసేందుకు ససేమిరా!ముఖ్యమంత్రికి ‘భలే’ షాక్!

పశుసంవర్థక శాఖ ఏడీని అటవీశాఖలో విలీనం చేసేందుకు ససేమిరా!ముఖ్యమంత్రికి ‘భలే’ షాక్!

Written By ysrcongress on Tuesday, February 14, 2012 | 2/14/2012

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీనియర్ ఐఏఎస్ అధికారి, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భలేరావు షాక్ ఇచ్చారు. పశుసంవర్థక శాఖకు చెందిన అధికారి ఒకరిని అటవీశాఖలో విలీనం చేయాలని సీఎం సిఫారసు చేయగా.. అలా చేయడం కుదరదంటూ భలేరావు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. సీఎం నిర్ణయాన్ని అమలు చేయడం కుదరదంటూ ఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంబంధిత ఫైలును తిప్పి పంపడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. సీబీఐ విచారణల పేరిట తమను వేధిస్తూ, జైళ్లలో పెడుతూ.. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ ఐఏఎస్ అధికారులు మండిపడుతున్న విషయం విదితమే. తాము వర్క్ టూ రూల్ పనిచేస్తామని ఐఏఎస్ అధికారులు అంటుండగా.. సీఎం సిఫారసునే తోసిపుచ్చిన వైనం సంచలనం సృష్టిస్తోంది. పశుసంవర్థక శాఖకు చెందిన హకీం అనే అధికారి డెప్యుటేషన్‌పై అటవీశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేస్తుండగా.. ఆయన అయిదేళ్ల డెప్యుటేషన్ గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం అంతకుమించి డెప్యుటేషన్‌కు అనుమతించరాదు. హకీం మాతృశాఖకు వెనక్కు వెళితే ఇక్కడున్న ఏడీ హోదా ఉండదు. అందువల్ల తనను అటవీశాఖలో విలీనం చేయాలంటూ ఆయన తన రాజకీయ పరపతిని ఉపయోగించి సీఎంను కలిశారు. ముఖ్యమంత్రి ఆయనను అటవీశాఖలో విలీనం చేయాలంటూ సిఫారసు చేశారు. 

ఈ మేరకు సీఎంఓ నుంచి వెళ్లిన ఫైలును పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భలేరావు తిప్పిపంపారు. నిబంధనల ప్రకారం తమ శాఖ అధికారిని అటవీశాఖలో విలీనం చేయడానికి వీలుకాదని, పైగా ఇప్పటికే సిబ్బంది కొరతతో అల్లాడుతున్న పశుసంవర్థక శాఖ మరింత ఇబ్బంది పడుతుందని నోట్‌ఫైల్‌లో రాశారు. సాధారణ పరిపాలన విభాగం భలేరావు వాదనను సమర్థించగా.. న్యాయ శాఖ కూడా బలపరిచింది. ఈ మేరకు ఫైలు సీఎం వద్దకు వెళ్లగానే.. ఆయన ‘నేను గతంలో రాసిన మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ అధికారిని అటవీశాఖలో విలీనం చేయాల్సిందే..’ అన్న అర్థం వచ్చేలా రాసి మళ్లీ ఫైలు పంపారు. భలేరావు కూడా తాను గత నిర్ణయానికే కట్టుబడి ఉన్నానంటూ.. ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే సీనియర్‌కు అన్యాయం జరుగుతుందని మళ్లీ నోట్‌ఫైల్‌లో రాసి తిప్పి పంపారు. ‘నిజంగా హకీంను విలీనం చేస్తే ప్రస్తుతం అటవీశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారికి అన్యాయం జరుగుతుంది. జూనియర్ కింద సీనియర్ పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా సమంజసమైనదే’ అని అటవీ శాఖ అధికారులతోపాటు పశుసంవర్థక శాఖ వర్గాలు కూడా అంటున్నాయి.
Share this article :

0 comments: