లక్ష్మీనారాయణ ‘నార్కో’ పరీక్షకు సిద్ధం కావాలి: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష్మీనారాయణ ‘నార్కో’ పరీక్షకు సిద్ధం కావాలి: వాసిరెడ్డి పద్మ

లక్ష్మీనారాయణ ‘నార్కో’ పరీక్షకు సిద్ధం కావాలి: వాసిరెడ్డి పద్మ

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

అపుడే సీబీఐ- ఓ వర్గం మీడియా బంధం బయటపడుతుంది
జగన్‌పైనా, ఆయన సంబంధిత వ్యక్తులపైనా ఇష్టానుసారం రాస్తుంటే మౌనం వహించారు
పనంతా పూర్తయ్యాక.. సీబీఐ జేడీ ఇప్పుడు అమాయకత్వం నటిస్తే ఎలా?
నట సామ్రాట్టు కూడా ఆయనకు సాటిరారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాకు, సీబీఐ అధికారులకూ మధ్య బంధం ఏమిటో బయటపడాలంటే సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. సీబీఐ వర్గాల పేరుతో నెలల తరబడి కొన్ని పత్రికలు జగన్‌పైనా, ఆయనకు సంబంధించిన వ్యక్తులపైనా ఇష్టానుసారం వార్తలు రాస్తుంటే, మీడియా అడ్డగోలుగా వార్తా ప్రసారాలు చేస్తుంటే మౌనం దాల్చిన లక్ష్మీ నారాయణ ఇపుడు అమాయకత్వం నటిస్తూ నోరు విప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 

ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లీకుల పేరుతో పత్రికల్లో వస్తున్న వార్తలు తనకు ఇపుడే తెలిసినట్లుగా లక్ష్మీనారాయణ సోమవారం పత్రికా ప్రకటన జారీ చేయడం పచ్చి నాటకమని ధ్వజమెత్తారు. అందుకే ఆయన నార్కో పరీక్షలకు సిద్ధమై తన నిజాయతీ ఏమిటో నిరూపించుకోవాలని కోరుతున్నామని చెప్పారు. నాలుగు గోడల మధ్య సీబీఐ అధికారులు, నిందితుల మధ్య మాత్రమే జరిగే విచారణల వివరాలు పూస గుచ్చినట్లుగా కొన్ని పత్రికల్లో ఎలా వస్తున్నాయి? ప్రతి రోజూ బ్యానర్ వార్తలు రావడానికి కారణమైన ఆ సీబీఐ అధికారులు ఎవరు? సీబీఐ విచారణలో పాల్గొంటున్న అధికారులు చెప్పకపోతే ఈ పత్రికలకు వివరాలు ఎలా తెలుస్తాయి? ఆ లీకు వీరులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలపై తాము ఫిర్యాదు చేసినా లక్ష్మీనారాయణ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారిపై బురద జల్లిస్తూ వార్తలు రాయించేసి, ఇపుడు తమ పనంతా పూర్తయ్యాక మీడియా కథనాలపై మాట్లాడ్డం ఏమిటని నిలదీశారు. జేడీ నటన ముందు నటసామ్రాట్టులు కూడా సాటిరారని పద్మ నిప్పులు చెరిగారు. అసలు సీబీఐ ఈ పత్రికల్లో వస్తున్న కథనాల డెరైక్షన్‌లోనే దర్యాప్తును నడిపిస్తోందా? లేక తను కావాలనుకున్న రీతిలో కథనాలను రాయించుకుని ఆ ప్రకారం రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తన విచారణల తీరు ద్వారా ప్రజల్లో ఎంత పలుచనకు గురైందో, దాని ప్రతిష్ట ఎంతగా దిగజారిందో తెలుసుకోవాలని హితవు పలికారు. 

విజయరామారావును ఆదర్శంగా తీసుకున్నారా?

లక్ష్మీనారాయణ తీరు చూస్తూంటే ఆయన సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని పద్మ ఎద్దేవా చేశారు. సీబీఐ తమకు ఇష్టమైనవారు దోషులైనా వదిలేస్తోందని, తమకు ఇష్టంలేని వారికి కేసులతో సంబంధం లేకపోయినా అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు పేరుతో సీబీఐ చేస్తున్న నిర్వాకంపై రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలున్నాయన్నారు. ఎమ్మార్ ఉదంతంలో నిధులు దుర్వినియోగం కావడానికీ విదేశీ అకౌంట్లలోకి తరలించడానికీ కారణమైన తుమ్మల రంగారావు ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించకుండా సునీల్‌రెడ్డిని అరెస్టు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమకు దర్యాప్తులో సహకరిస్తున్నందుకే రంగారావుకు బెయిల్ ఇవ్వవచ్చని సీబీఐ భావిస్తే, ఓ వర్గం మీడియా మీకు సహకరిస్తోంది కనుకనే లీకు వార్తలు ఇస్తున్నారా? అని ఆమె దుయ్యబట్టారు. ఫలానా రోజున ఫలానా వ్యక్తిని సీబీఐ తన ముందుకు విచారణకు పిలుస్తుందనే విషయం ఎంపిక చేసుకున్న పత్రిక లకే ఎలా తెలుస్తోంది? ఆ పత్రికల్లో వార్తలు ప్రచురించాకే సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఎలా వెళుతున్నాయి? విజయసాయిరెడ్డికి నార్కో పరీక్షలు చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు ఆ పత్రికల్లో వార్తలు వచ్చాకే కోర్టులో పిటిషన్ దాఖలు కావడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తుల విషయంలో గానీ, ఓఎంసీ, ఎమ్మార్ ఉదంతాల్లో గానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలేమిటి? సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరు ఏమిటి? అని ఆమె ధ్వజమెత్తారు. దేశంలో సీబీఐలాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ మరొకటి లేదు కనుక దాని ప్రతిష్టను ఇనుమడింపజేసేలా అధికారులు వ్యవహరించాలని ఆమె హితవు పలికారు.
Share this article :

0 comments: