‘ముఖ్య’నేతకూ దిమ్మతిరిగింది... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ముఖ్య’నేతకూ దిమ్మతిరిగింది...

‘ముఖ్య’నేతకూ దిమ్మతిరిగింది...

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012

* సీఎంఓ ఆదేశాలతో మద్యం సిండి‘కేటు’ను వదిలేసిన ఏసీబీ!
* హైదరాబాద్ సహా 4 జిల్లాల్లో సిండికేట్ రింగ్ లీడర్ బాలరాజ్‌గౌడ్ 
* ఆయన నుంచి ముడుపులు అందుకున్న వారి వివరాలతో పక్కా జాబితా 
* ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 100 మంది అధికారులు... నెలకు దాదాపు రూ. 2 కోట్ల వరకూ ముడుపులు 
* 3 నెలల కిందటే బాలరాజ్ సిండికేట్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
* చిట్టాలో సీఎం సన్నిహితులు.. వివరాలు సీఎంఓకు తెలిపిన అధికారులు!
* ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ సీఎంఓ మౌఖిక ఆదేశాలు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని నగరం, మరో 3 జిల్లాల్లో మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న బాలరాజ్‌గౌడ్.. ప్రజాప్రతినిధులకు అందించిన ముడుపులకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలతో ఏకంగా ప్రభుత్వ పెద్దలకే ముచ్చెమటలు పోయించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బాలరాజ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయన తన నుంచి ముడుపులు స్వీకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లను ఆధారాలతో సహా వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మంత్రులతో పాటు మరో కీలక రాష్ట్ర మంత్రికి ఎప్పుడెప్పుడు ఎంత ముట్టజెప్పిందీ ఏసీబీ ముందుంచారు. 

బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని నగదు రూపంలో ప్రజా ప్రతినిధులకు ముట్టజెప్పినట్లు వివరించారు. బాలరాజ్‌గౌడ్ పంపిణీ చేసిన మొత్తం నెలకు రూ 1.89 కోట్ల వరకు ఉంటుందని తేలింది. ముడుపులు అందుకున్న వారి జాబితాలో ముఖ్యమంత్రికి సన్నిహితులైన మంత్రులు, శాసనసభ్యులే ఎక్కువ మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం.. బాలరాజ్‌ను అరెస్ట్ చేయకుండా వదిలివేయాలని మౌఖికంగా ఆదేశించటంతో.. ఏసీబీ అధికారులు ఆ ఆదేశాలను పాటించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. 

‘ముఖ్య’నేతకూ దిమ్మతిరిగింది... 
లిక్కర్ సిండికేటు రింగ్ లీడర్ బాలరాజ్ బినామీల పేరుతో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దాదాపు 60 మద్యం దుకాణాలున్నాయి. మరో 50 దుకాణాల్లో వాటా ఉంది. గత సాధారణ ఎన్నికల్లో ఆయన మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బాలరాజ్ కార్యకలాపాలపై కన్నేసి ఉంచిన ఏసీబీ అధికారులు.. పక్కా సమాచారం లభించటంతో గత ఏడాది నవంబర్ 26న రాత్రి పొద్దుపోయాక ఆయన సిండికేట్ కార్యాలయంపై దాడి చేశారు. అందులోని కొన్ని కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు వారి కేటగిరీని బట్టి ప్రతి నెలా ముడుపులు ఇచ్చినట్లు ఉన్న ఓ లెక్కల పుస్తకం ఏసీబీ కంట పడింది. 

ఆ డైరీ ప్రకారం.. బాలరాజ్ నుంచి ముడుపులు పుచ్చుకున్న వారి జాబితాలో 31 మంది ప్రజాప్రతినిధులు, దాదాపు 100 మంది ఎక్సైజ్, పోలీసు అధికారులతో పాటు ఏసీబీ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ప్రజాప్రతినిధుల పేర్లు పొడిపొడిగా ఉండటంతో ఏసీబీ అధికారులు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆ వివరాల కోసమే ఈ నెల 10న బాలరాజ్‌ను అనధికారికంగా అదుపులోకి తీసుకుని విచారించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ పేర్లు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు; మెదక్ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఆరుగురు శాసనసభ్యులు, ఒక ఎంపీ; రంగారెడ్డి జిల్లాలో ఒక మంత్రి కుమారుడు, ఎనిమిది మంది శాసనసభ్యులు; హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మంత్రులు; కోస్తాంధ్ర జిల్లాకు చెందిన మరో కీలక మంత్రి ఆయన వ్యక్తిగత సహాయకుని ద్వారా తన నుంచి ముడుపులు అందుకున్న వారిలో ఉన్నారని ఏసీబీ అధికారులకు బాలరాజ్‌గౌడ్ తెలిపారు. 

ముడుపులు ఇచ్చారనటానికి బ్యాంక్ నుంచి ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తంలో డ్రా చేశారో స్టేట్‌మెంట్లతో సహా వివరించారు. ఈ వివరాలు చూసి విస్తుపోయిన ఏసీబీ అధికారులు.. వెంటనే సమాచారం మొత్తాన్నీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. బాలరాజ్‌గౌడ్‌ను అరెస్ట్ చేస్తే అతడు వెల్లడించిన వివరాలను కోర్టు ముందు ఉంచాల్సి వస్తుందని సీఎంఓకు తెలియజేశారు. జాబితాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చూసిన సీఎం కార్యాలయం బిత్తరపోయి.. బాలరాజ్‌ను అరెస్టు చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బాలరాజ్‌ను అరెస్టు చేసినట్లు అప్పటికే లీక్ కావటంతో ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించి బాలరాజ్ సమీప బంధువు శ్రీనివాస్‌గౌడ్ ద్వారా అరెస్టు కాలేదంటూ ఓ పత్రికా ప్రకటన జారీ చేయించారు. అంతకు ముందు రోజే బాలరాజ్ ముందస్తు బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 

ఏసీబీ అధికారులు, జర్నలిస్టులు కూడా... 
బాలరాజ్‌గౌడ్ ముడుపుల జాబితాలో.. నాలుగు జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. వారిలో ఇన్‌స్పెక్టర్ మొదలుకుని డిప్యూటీ కమిషనర్ వరకూ వివిధ స్థాయిల్లోని అధికారుల పేర్లు ఉన్నాయి. అంతేకాదు ఏసీబీ అధికారులు కూడా ముడుపులు తీసుకున్న వారిలో ఉన్నారని సమాచారం. ఇక పోలీసులకు స్టేషన్ల వారీగా లెక్కగట్టి ముడుపులు ఇచ్చారు. నెలకు ఒక్కొక్కరికీ రూ. 30 వేల వరకు ఇచ్చినట్లు బాలరాజ్ చెప్పారు. ఏసీబీ అధికారులు, జర్నలిస్టులు, ఇతర ప్రజా సంఘాల నేతలు ఎవరు ఏ సమయంలో ఎంతెంత చొప్పున తీసుకున్నారో ఆ వివరాలు కూడా చెప్పినట్లు తెలిసింది.
Share this article :

0 comments: