మంత్రి స్థానంలో అధికారి ఉంటే.. పద్ధతిని మరిచి దర్యాప్తు సాగుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి స్థానంలో అధికారి ఉంటే.. పద్ధతిని మరిచి దర్యాప్తు సాగుతోంది

మంత్రి స్థానంలో అధికారి ఉంటే.. పద్ధతిని మరిచి దర్యాప్తు సాగుతోంది

Written By ysrcongress on Monday, February 6, 2012 | 2/06/2012

ఎమ్మార్ అంశంతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసుల్లో మూలాల్లోకి వెళ్లి వాస్తవాలను వెలికి తీయటానికి కాకుండా.. ఎవరినో లక్ష్యంగా చేసుకున్నట్లుగా సీబీఐ దర్యాప్తు సాగుతోందనే ఆరోపణలకు తాజాగా ఐఏఎస్ అధికారుల వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల అనుచిత లబ్ధిపొంది సంస్థలు జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయంటూ వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చటానికి వీలుగా మూలాలను శోధించాల్సిన సీబీఐ.. అందుకు విరుద్ధంగా కొంత మందిని ముందుగానే లక్ష్యంగా చేసుకొని కక్ష సాధింపులకు దిగుతోందంటూ వస్తున్న విమర్శలు నిజమేనని ఐఏఎస్‌ల ఆవేదన రుజువుచేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాలు.. ప్రజల బలమైన ఆకాంక్షలను పాలనలో ప్రతిబింబించే విధంగా రూపొందించుకున్న విధానాల స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసిన అధికారులను బలిచేయాలనే లక్ష్యంతో సీబీఐ పనిచేస్తోందని ఐఏఎస్ అధికారుల సంఘం ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఉపాధి కల్పన దిశగా వివిధ కంపెనీలకు భూములు కేటాయించటంతో పాటు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించటం ప్రభుత్వ విధానంలో భాగం. ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్టులయిన పారిశ్రామికవేత్తలు, సంస్థలకు భూములు కేటాయించటాన్నీ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, ఆయా నిర్ణయాల మూలాల్లోకి వెళ్లి వాస్తవ విషయాలను గ్రహించటానికి సీబీఐ అధికారులు కనీస ప్రయత్నం కూడా చేయకపోవటం ఈ అనుమానాలను బలపరుస్తోంది. 

కేంద్రం అనుమతి మేరకు ఏర్పాటయిన ఎస్‌ఈజెడ్‌లకు భూములు ఇస్తే.. భూములు పొందిన కంపెనీల ప్రతినిధులను పిలిచి దర్యాప్తు అధికారులు ప్రశ్నించటం కూడా సీబీఐ ‘అసలు’ లక్ష్యాన్ని, ప్రతిపక్ష టీడీపీ, మాజీ మంత్రి శంకరరావు చేసిన ఆరోపణల మీదే దృష్టి పెట్టటం మినహా ‘క్విడ్ ప్రొ కొ’ పెట్టుబడుల దిశగా దర్యాప్తు జరగటం లేదనే విషయాన్ని స్పష్టంచేస్తోంది. ఉదాహరణకు.. చంద్రబాబు హయాంలోనే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఫార్మా సెజ్ ఏర్పాటయితే పెట్టబడులు పెట్టటానికి కంపెనీలేవీ ముందుకు రాలేదు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫార్మా రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరబిందో, హెటిరో డ్రగ్స్.. తదితర కంపెనీలను ఆహ్వానించి భూములు కేటాయించారు. భూ కేటాయింపుల మూలాల్లోకి వెళ్లి పరిశీలించి వాస్తవ విషయాలను వెలికి తీయాల్సిన సీబీఐ.. నిర్ణీత వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకొనే దర్యాప్తు సాగిస్తున్నట్లు వ్యవహరించటాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 

భూకేటాయింపుల మీద విచారణ చేయాల్సి వస్తే.. భూ కేటాయింపుల కోసం విజ్ఞప్తి ఎక్కడి నుంచి వచ్చింది? కంపెనీలు, వ్యక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలో హేతుబద్ధత ఉందా? ప్రతిపాదన ఫైల్ సచివాలయం చేరిన తర్వాత సెక్షన్ అధికారి నుంచి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, మంత్రిమండలి.. వరకు ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు? ఏ దశలో అయినా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయా? భూముల కేటాయింపు పారదర్శకంగా జరిగిందా? లేదా? ఈ అంశాలను లోతుగా, సమగ్రంగా పరిశీలిస్తే ‘అయాచిత లబ్ధి’కి చోటు ఉందో, లేదో తెలిసిపోతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ దిశగా కనీస ప్రయత్నం చేయకుండా సీబీఐ దర్యాప్తు సాగటం చూస్తుంటే.. ఐఏఎస్‌ల వాదనల్లో సహేతుకత ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, కేవలం నిర్ణయాలను అమలు చేసిన అధికారులను బలిపశువులుగా చేస్తున్నారంటూ ఐఏఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్న ఆవేదన నిజమేనని సీబీఐ తీరును చూస్తే అర్థమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

పద్ధతి మరచిన సీబీఐ 

దర్యాప్తులో సీబీఐ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు ‘కావాల్సిన’ వ్యక్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఒకే కేసులో ఒకే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో.. మంత్రి ఉంటే దర్యాప్తు అంతా పద్ధతి ప్రకారమే సాగుతోంది. మంత్రి స్థానంలో అధికారి ఉంటే.. పద్ధతిని మరిచి దర్యాప్తు సాగుతోంది. మంత్రులను వారి చాంబర్లకు వెళ్లి విచారించిన సీబీఐ అధికారులు.. ఐఏఎస్ అధికారుల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న రమాకాంత్‌రెడ్డి విషయంలో సీబీఐ అధికారులు కనీస మర్యాద పాటించకపోవటం విమర్శలకు తావిచ్చింది. విచారణలో అడుగుతున్న ప్రశ్నల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఆశించిన సమాధానాలు రాబట్టటం కోసం సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. వాస్తవ విషయాలను రాబట్టే ప్రయత్నాలు చేయటం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ‘‘ఫలానా జీవో ఇవ్వటానికి మీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు?’ విచారించిన అధికారులందరినీ అడిగిన ఉమ్మడి ప్రశ్న ఇది. బిజినెస్ రూల్స్(పాలనా నిబంధనల)ను ఉద్దేశపూర్వకంగా అర్థం చేసుకోకపోవటం వల్లే సీబీఐ అధికారులు ‘ఒత్తిడి’ ప్రశ్నను పదేపదే అడుగుతున్నారు. 

సాధారణంగా ఫైళ్ల పుటప్ ఎలా జరుగుతుంది? ఫైల్ పుటప్ అయినప్పటి నుంచి జీవో వెలువడే వరకు జరిగే ప్రక్రియ ఏమిటి? నోట్ ఫైల్‌లో ఏఏ అంశాలు ఉంటాయి? - అనే కీలక అంశాలను సీబీఐ అధికారులు కావాలనే పట్టించుకోవటం లేదు. నోట్‌ఫైల్‌లో.. జీవో జారీ వెనక సమగ్ర నేపథ్యం ఉంటుంది. జీవోలకు సంబంధించిన ఫైళ్లు, వాటి నోట్‌ఫైల్స్ తెప్పించుకుని నిపుణుల సహాయంతో అధ్యయనం చేసిన తర్వాత.. నిగ్గు తేల్చాల్సిన అంశాలను గుర్తించి దర్యాప్తు ప్రారంభించాలి. కానీ సీబీఐ ఈ దిశగా అసలు ప్రయత్నమే చేయటం లేదు. సాధారణ దొంగతనం కేసులో అనుమానితులను పిలిచి విచారించినట్లుగా అధికారులను పిలిపిస్తున్నారు. సంబంధిత ఫైళ్లను నిపుణుల సహాయంతో అధ్యయనం చేసిన తర్వాత కూడా అనుమానాలు నివృత్తి కాకుంటే.. అధికారుల ఇళ్లు లేదా చాంబర్లకు వెళ్లి మాట్లాడే అవకాశం ఉంది. కానీ.. సీబీఐ అలా చేయడం లేదు. టార్గెట్ చేయాల్సిన వ్యక్తులను ముందుగా నిర్ణయించుకుని.. తమకు కావాల్సిన విధంగా సమాచారం రాబట్టుకోవటానికి అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. అవసరం లేకపోయినా గంటల కొద్దీ విచారిస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: