సాయిరెడ్డికి నార్కో పరీక్షకు నో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయిరెడ్డికి నార్కో పరీక్షకు నో

సాయిరెడ్డికి నార్కో పరీక్షకు నో

Written By ysrcongress on Friday, February 3, 2012 | 2/03/2012


జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో రెండో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డికి సత్యశోధన పరీక్షలు (నార్కోఅనాలసిస్) నిర్వహించాలన్న సీబీఐ ప్రయత్నాలకు సీబీఐ న్యాయస్థానం బ్రేకులు వేసింది. సత్యశోధన పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ పరీక్షలకు అనుమతించడం రాజ్యాంగం నిందితునికి కల్పించిన ప్రాథమిక హక్కును హరించడమే అవుతుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సాయిరెడ్డికి సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ గురువారం కొట్టివేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఇటువంటి పరీక్షల నిర్వహణకు అనుమతించలేమని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ ఇటువంటి పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సెల్వి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో స్పష్టం చేసిన విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. బైర్రాజు రామలింగరాజు వర్సెస్ సీబీఐ కేసులోనూ ఇటువంటి పరీక్షలు చట్ట, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పును వెలువరించిన విషయాన్ని ఉత్తర్వుల్లో ఉదహరించారు. ‘‘సీఆర్‌పీసీ-161(2) కింద తనకు వ్యతిరేకంగా సేకరించే సాక్ష్యాల గురించి చెప్పకుండా మౌనంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ చట్టం కల్పించింది. తాము అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం చెప్పితీరాలన్నది చట్టంలో నిషేధం. సత్యశోధన పరీక్షలో ఉపయోగించే మత్తు పదార్థాలతో మనిషి సహజసిద్ధమైన స్పృహను కోల్పోతారు. తనను అడిగే ప్రశ్నలకు స్పృహలో ఉండి సమాధానాలు చెప్పలేరు. సత్యశోధన, పాలిగ్రాఫ్, బీప్‌టెస్ట్‌ల ద్వారా తప్పనిసరిగా తమకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కోరడం రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ 21, 20(3)కి పూర్తిగా విరుద్ధం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం. 

అది మానసిక స్థితిలోకి బలవంతంగా ప్రవేశించడమే అవుతుంది’’ అని జడ్జి ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సత్యశోధన పరీక్షల సమయంలో ‘సోడియం పెంటథాల్’ను ఇస్తారని, ఇది ఏ మాత్రం మోతాదు ఎక్కువైనా కోమాలోకి వెళ్లడం గానీ ప్రాణాలుపోయే అవకాశం ఉందని సాయిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సత్యశోధన పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. తన మనస్సాక్షికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా చెప్పాలని దర్యాప్తు సంస్థలు ఎవరినీ బలవంతపెట్టలేవని, ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 20(3), 21కు విరుద్ధమని నివేదించారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండే హక్కును కూడా రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు. సాయిరెడ్డి అరెస్టుకు ముందు 32 రోజులపాటు దాదాపు 300 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారని, కస్టడీలో 10 రోజులపాటు మరో 80 గంటలపాటు సీబీఐ విచారించిందని నివేదించారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సాయిరెడ్డి సీబీఐ అధికారులకు వెల్లడించారని, అయినప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని, వాస్తవాలు వెల్లడించలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు సత్యశోధన పరీక్షలకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Share this article :

0 comments: