ఊరట కూడా కల్పించని సీఎం కిరణ్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఊరట కూడా కల్పించని సీఎం కిరణ్..

ఊరట కూడా కల్పించని సీఎం కిరణ్..

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

దేశం మొత్తమ్మీద ఉత్పత్తయ్యే టెక్స్‌టైల్స్‌లో 90 శాతం తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే తయారవుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో లేని వ్యాట్‌ను మన రాష్ట్రంలోనే ఎందుకు విధించాలన్నది వ్యాపారుల వాదన. వీరికి మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒకరోజు ధర్నా కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఊరట కలిగించే చర్యలు తీసుకుంటుందని వస్త్ర వ్యాపారులతోపాటు రాజకీయపక్షాలు, కొందరు మంత్రులు కూడా ఆశించారు. సోమవారం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముందే దీనిపై అధికారులు సీఎం కిరణ్‌కు నివేదిక సమర్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యాట్ మినహాయించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వసూలు చేయడం ద్వారా కొంత సంతృప్తి కలిగించవచ్చన్న ప్రతిపాదన కూడా నివేదికలో పొందుపరిచారు. రూ.50 లక్షల వార్షిక టర్నోవరు దాటిన వారికే 5 శాతం వ్యాట్ వర్తింప జేయాలని సూచించారు. అయితే వీటిని పరిశీలించిన సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది రాజకీయంగా సీఎం తీసుకోవాల్సిన నిర్ణయమైనా.. ఆయన స్పందించనందున ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తోందని తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులు ‘న్యూస్‌లైన్’తో చెప్పారు.

ముగిసిన తొమ్మిది రోజుల పోరు
బంద్‌తో నిలిచిన రూ.1,170 కోట్ల లావాదేవీలు
పనుల్లేక అల్లాడిన 40 లక్షల మంది కార్మికులు
పదివేలకుపైగా హోల్‌సేల్ షాపులు, లక్షకుపైగా రిటైల్ దుకాణాలు.. అన్నీ మూతపడ్డా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షలమంది కార్మికులు పనులు కోల్పోయినా.. ప్రతిరోజూ వందల కోట్ల లావాదేవీలు నిలిచిపోయినా సర్కారుకు పట్టలేదు! రాజకీయపార్టీల నేతలు దీక్షలు చేసినా.. ధర్నాలు చేసినా.. రోడ్డెక్కినా చెవికెక్కించుకోలేదు!! మొత్తమ్మీద వస్త్రాలపై వ్యాట్ విధించడం అన్యాయమంటూ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్స్ (ఏపీఎఫ్‌టీఏ) పిలుపు మేరకు జరిగిన తొమ్మిదిరోజుల బంద్ విజయవంతమైనా.. సర్కారు కళ్లు తెరవలేదు. ప్రభుత్వం తీరు చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా మారిపోయింది. దేశంలో ఎక్కడా లేనిరీతిలో రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపై వ్యాట్ అమలు చేయడం అన్యాయమని, తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ జనవరి 23 నుంచి వస్త్ర వ్యాపారులు దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు. నిత్యం కొనుగోలుదారులతో కళకళలాడే క్లాత్ మార్కెట్లన్నీ అప్పట్నుంచీ బోసిపోయాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, విజయవాడ, చీరాల, ప్రొద్దుటూరు, గుంటూరు తదితర ప్రాంతాల్లోని క్లాత్ మార్కెట్లు వారం రోజులపాటు షట్టర్లు కూడా తెరవనందున లక్షల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయారు. రోజుకు సగటున రూ. 130 కోట్లకుపైగా వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. తొమ్మిది రోజుల బంద్‌తో మొత్తం రూ.1,170 కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ అయినందున గత వారంలో షాపులు తెరిస్తే ఇంతకంటే ఇంకా ఎక్కువ వ్యాపారం సాగేదని వస్త్ర వ్యాపారులు అంటున్నారు. మంగళవారంతో బంద్ ముగిసినా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలపై ఈ ప్రభావం మరికొన్ని రోజులు తప్పేలా లేదు. హోల్‌సేల్ దుకాణాలు కూడా పనిచేయనందున రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ షాపుల వారు స్టాకు కూడా బుక్ చేసుకోలేకపోయారు. ఇక స్టాకు కోసం చిన్న వ్యాపారులు ఆర్డర్ ఇచ్చినా హోల్‌సేల్ దుకాణాలవారు దానిని ట్రాన్స్‌పోర్టులో బుక్ చేసి పంపడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది. చాలాచోట్ల హోల్‌సేల్ వ్యాపారుల దగ్గర కూడా ప్రస్తుతం స్టాకు కావాల్సినంత లేదు.
Share this article :

0 comments: