రాష్ట్రంలో పరిపాలన దారుణంగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో పరిపాలన దారుణంగా

రాష్ట్రంలో పరిపాలన దారుణంగా

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరం
జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన
చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు
104, 108 సిబ్బంది ఉద్యోగాలు ఎప్పడు పోతాయో తెలియని స్థితి

నెల్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక.. పేదల కష్టాలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్నారు. ప్రజలు తమ సమస్యలు తీర్చాలని ఎన్నిరకాలుగా ఆందోళనలకు దిగినా ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరంలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాముని రాజ్యం చూడలేదుగానీ..: జిల్లాలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు అనివార్య కారణాల వల్ల ఇక్కడ కొన్ని విగ్రహాలను అవిష్కరించేందుకు వీలుకలగలేదు. అయినప్పటికీ.. ఇప్పటివరకూ ఎదురుచూసిన మీ అభిమానం, ఆప్యాయతలను ఎన్నటికీ మరవలేను. రెండున్నర సంవత్సరాల క్రితం మృతి చెందిన మహానేతను ఇప్పటికీ మరిచి పోకుండా, ఆయన్ను ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవడం సంతోషం. రాముడి రాజ్యం మనం చూడలేదుగానీ, మహానేత డాక్టర్ వైఎస్సార్ పరిపాలనలో సువర్ణయుగాన్ని చూశాం.

మహానేత గుర్తుకు వస్తూనే ఉంటారు..: మహానేత మరణం తర్వాత పేదవాడి గురించి ఆలోచించే నాయకుడు రాష్ట్రంలో ఒక్కరూ కనిపించడం లేదు. ఇలాంటి దారుణమైన పరిపాలన చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఆ మహానేత గుర్తుకు వస్తూనే ఉంటారు. వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు దగ్గర నుంచి చదువుకోవాలనుకునే ప్రతి పేద విద్యార్థి వరకు, వయసు మీద పడిన ప్రతి అవ్వా, తాతల వరకు, అనారోగ్యం పాలైన ప్రతి పేదవాడి వరకూ.. ఇలా ప్రతి ఒక్కరి గురించీ ఆలోచించి, వారికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి వారి హృదయాల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.

రైతు భయపడుతున్నాడు: పేదవాడికి మేలు చేసే విషయంలో ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో లక్ష ఎకరాలు బీడు పెట్టి రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ సమస్యలపై ఆందోళన చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగించే వారిపై కూడా పాలకులు ట్యాక్సులు విధించి వేధిస్తున్నారు. 104, 108 సిబ్బంది ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులు బాధ కల్గిస్తున్నాయి. పేదల కష్టాలు తీర్చేందుకు ఆ మహానేత తిరిగి రాలేకపోవడం చాలా బాధగా ఉంది.

రోడ్లపై బారులు తీరిన జనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో జరిపిన ఒక రోజు పర్యటనకు విశేష స్పందన లభించింది. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలో విగ్రహాలు ఆవిష్కరించేందుకు ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు.. ఆయన వచ్చే దారి వెంబడి బారులు తీరి కనిపించారు. ప్రతి చోటా కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. మోపూరు క్రాస్ వద్ద ఒక వృద్ధురాలు జగన్‌ను చూసి ఉద్వేగానికి లోనై.. ‘నువ్వు సీఎం అయితేనే మా కష్టాలు తీరతాయ’ంటూ తన ఆకాంక్షను బయటపెట్టింది. ఆమెను హత్తుకున్న జగన్ ‘త్వరలోనే అన్ని కష్టాలూ తీరుతాయ’ని భరోసా ఇచ్చారు. పొదలకూరు సమీపంలో అలోవిరా ఉత్పత్తుల పరిశ్రమకు చెందిన మహిళలు జగన్‌ను ఆపి తమ కష్టాలు చెప్పుకొన్నారు. అనంతరం రాపూరు మండలం వేపినాపి, సిద్ధవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాపూరు మండల కేంద్రంలోని మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చిత్తూరు జిల్లా సరిహద్దుల వరకూ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రయాణంలో ఆయనకు స్థానిక ప్రజలు, మహిళల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. అనంతరం జగన్ కడప వెళ్లారు. నెల్లూరు నుంచి కడపకు 300 కి.మీ. దూరం. ఉదయం 11 గంటలకు నెల్లూరులో బయల్దేరిన జగన్ సాయంత్రం 5 గంటలకల్లా కడప చేరుకోవాల్సి ఉండగా.. రాత్రి 10.30 గంటలకుగాని చేరుకోలేకపోయారు. అడుగడుగునా అభిమానులు కాన్వాయ్‌ను ఆపడం, కరచాలనాలకు పట్టుబట్టడం, పూల మాలలు, బాణసంచాల హడావిడి, అక్కడక్కడా చేలో పనులో వదిలేసి పరిగెత్తుకొచ్చిన కూలీలతో మాటామంతీ.. వెరసి ఆయన ఐదున్నర గంటల ఆలస్యంగా కడప చేరారు.
Share this article :

0 comments: