ఆత్మహత్యల బాటలో రైతులు - ఆదుకునే మనసు రాని సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మహత్యల బాటలో రైతులు - ఆదుకునే మనసు రాని సర్కారు

ఆత్మహత్యల బాటలో రైతులు - ఆదుకునే మనసు రాని సర్కారు

Written By ysrcongress on Tuesday, February 21, 2012 | 2/21/2012

అప్పుల ఊబిలో 52 లక్షల మంది రైతులు 
ఆత్మహత్యల బాటలో రైతులు - ఆదుకునే మనసు రాని సర్కారు 
రుణ వసూళ్ల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు.. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు 
మళ్లీ పంటకు పెట్టుబడులు కరువు... 
విస్తరిస్తున్న క్రాప్ హాలిడే... 
పడిపోయిన రబీ సాగు 
పంట నష్టంపై కేంద్రానికి ఆలస్యంగా నివేదికలిచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం 
కేంద్రం నుంచి సాయం వచ్చే లోపు పెట్టుబడి రాయితీ అయినా అందించలేని కరుకుతనం 
కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ. 2 వేల రాయితీకి కూడా గండి కొడుతున్న రాష్ట్ర సర్కారు 
ఆ మొత్తం తాము ఇప్పటికే ఇస్తున్నాం.. 
కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదని మెలిక 
సాగు సంక్షోభంలో పడ్డా సర్కారు నిర్లక్ష్యంతో ప్రమాదం: వ్యవసాయ నిపుణుల ఆందోళన

అన్నదాత దిక్కులేని వాడయ్యాడు. కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. పంట కోసం పెట్టిన ఖర్చంతా ఆవిరైపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గత ఖరీఫ్ పంటలను కరువు దెబ్బతీసినా.. కనీసం కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీని కాస్త ముందుగా ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావటంలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ. 2,000 పెట్టుబడి రాయితీని కూడా.. ‘ఆ మొత్తం మేం ముందే ఇస్తున్నాం.. కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ తన ఖజానాలో వేసుకుంటోంది. 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో గత ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం వల్ల ఏకంగా 86 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. పంటల దిగుబడి సగానికిపైగా పడిపోయింది. ఫలితంగా రైతులు రూ. 5,747 కోట్ల మేర పెట్టుబడులు కోల్పోయారు. దీనివల్ల దాదాపు 51.54 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిలో 48.33 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులే. ఈ లెక్కలన్నీ సర్కారు వారు పరిశీలించి వేసుకున్న గణాంకాలే. వాస్తవంగా పంట నష్టం, నష్టపోయిన అన్నదాతల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో రైతులు అప్పుల్లో కూరుకుపోయి కోలుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్లే ఇటీవల కాలంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులే కేంద్ర కరువు పరిశీలన బృందానికి తెలియజేశారు. కానీ.. రైతుల ఆత్మహత్యలను నిలువరించేందుకు, వారికి బతుకుపై భరోసా కల్పించేందుకు కాస్తంత సాయం అందించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావటంలేదు. ఈ పరిస్థితుల్లో రైతుకు అండగా నిలిచి అసెంబ్లీ లోపలా వెలుపలా సర్కారుపై ఒత్తిడి తేవాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా.. తన బాధ్యతకు నీళ్లొదిలేసింది. రాజకీయ మనుగడ కోసం అధికార కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అంటకాగుతున్న టీడీపీ.. అసెంబ్లీ సమావేశాలు మొదలై వారం రోజులు గడుస్తున్నా అసలు రైతు సమస్యల ఊసే ఎత్తటం లేదు. 

రైతంటే ఎందుకంత చిన్నచూపు? 

రైతులను ఆదుకునే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో కరువు వల్ల వర్షాధార ప్రాంతాల్లో పంటలు ఎండిపోగా.. సర్కారు విద్యుత్ కోతల వల్ల బావులు, బోర్ల కింద కూడా పైర్లు మాడిపోయాయి. విద్యుత్ కోతలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమైనా.. ఆ నెపాన్ని తెలంగాణ సకల జనుల సమ్మెపైకి నెట్టే ప్రయత్నం చేసింది. సింగరేణి కార్మికుల సమ్మె వల్ల బొగ్గు సరఫరా లేక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవటం వల్లే విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చిందంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పోనీ.. వర్షాభావమో, కరెంటు కోతలో.. కరువు పరిస్థితుల వల్ల జరిగిన పంట నష్టం అంచనాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి కేంద్ర సాయం కోసం నివేదిక పంపించారా? అంటే అదీ లేదు. గత ఏడాది అక్టోబర్ 15వ తేదీకల్లా పంట నష్టం నివేదికను కేంద్రానికి పంపుతామని చెప్పిన ప్రభుత్వం.. గత నెల 13వ తేదీ వరకూ పంపలేకపోయింది. కేంద్ర ప్రభుత్వానికి కరువు నివేదికను అక్టోబర్‌లో పంపితే అదే నెలలో కేంద్ర బృందం వచ్చేది. గత ఏడాది నవంబర్ నాటికే కేంద్ర సాయం అందే అవకాశం ఉండేది. ఆ సాయాన్ని అదే నెలలో రైతులకు పంచితే వారికి ఎంతోకొంత ప్రయోజనం చేకూరేది. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపటంలో చేసిన జాప్యం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యమవుతోంది. 

వడ్డీ అయినా మాఫీ చేయవచ్చు కదా! 

ఈ విషయంలో పొరపాటు ఇక్కడే జరిగినందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ‘కేంద్ర బృందం ఎలాగూ రాష్ట్రంలో పర్యటించి కరువు ప్రభావాన్ని అధ్యయనం చేసి వెళ్లింది. త్వరలో కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అవి వచ్చే వరకూ ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తే అన్నదాతలకు అంతో ఇంతో ఉపశమనం కలిగేది. ఓ వైపు బ్యాంకర్లు, మరోవైపు వడ్డీ వ్యాపారులు రుణ వసూళ్ల కోసం రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు.. మళ్లీ పంటలు వేయటానికి పెట్టుబడులు పుట్టటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించకపోతే అర్థం ఉండదు’’ అని వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారే వ్యాఖ్యానించటం పరిస్థితికి అద్దం పడుతోంది. కరువు నేపథ్యంలో పంట రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే కొంత ఉపశమనం కలిగేదని, అది కూడా చేయకపోవటం దారుణమని, ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుందని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

20 శాతం పడిపోయిన రబీ సాగు... 

ఖరీఫ్‌ను కరువు ముంచేయటంతో పెట్టుబడులు కూడా కోల్పోయిన రైతులు.. రబీ పంటలకు పెట్టుబడులు లేక, అప్పులు పుట్టక పంటలు సాగు చేయలేకపోయారు. వ్యవసాయం గిట్టుబాటు కానందున దేశ చరిత్రలోనే ఎక్కడా లేని రీతిలో కోస్తా జిల్లాల్లో చాలా మంది రైతులు సాగుకు స్వస్తి చెప్పి పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించారు. ఫలితంగా రబీ సాగు విస్తీర్ణం సాధారణంకంటే 20 శాతం పడిపోయింది. వేసిన పంటల్లోనూ చాలా వరకు భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల నీరులేక ఎండిపోతున్నాయి. ఈ ప్రభావం ఆహార ఉత్పత్తుల దిగుబడిపై తీవ్రంగా ఉంటుందని.. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరుగుతాయని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్రం ఇచ్చిన రాయితీ కూడా ఇవ్వరట... 

కరువు వల్ల పంటలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ పెంచినా.. ఆ మొత్తాన్ని రైతులకు అందించేందుకు రాష్ట్ర సర్కారు ససేమిరా అంటోంది. పెరిగిన ఎరువుల ధరలు, కూలీ రేట్లు, వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా ఇన్‌పుట్ సబ్సిడీని ఎకరాకు రూ. 10,000కు పెంచాలని అన్ని రాజకీయ పక్షాలూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. గత రెండేళ్లలో వ్యవసాయ ఖర్చులు అనూహ్యంగా పెరిగాయని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు కావటంలేదని సాక్షాత్తూ వ్యవసాయ శాఖ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని అంతో ఇంతో పెంచుతుందని రైతులు ఆశించారు. కానీ అది అడియాసగానే మిగిలింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్టుబడి రాయితీని హెక్టారుకు రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచింది. అయితే కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 ఇన్‌పుట్ సబ్సిడీని అదనంగా పెంచినా.. ఆ మేరకు తాము ఇప్పటికే ఇస్తున్నామని, కేంద్రం పెంచిన మొత్తాన్ని రైతులకు ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం హెక్టారుకు రూ. 6,000 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్న విషయం వాస్తవమే. కేంద్ర ప్రభుత్వం రూ. 4,000 ఇస్తున్నప్పుడు రాష్ట్రం రూ. 6,000 ఇచ్చింది. కేంద్రం దీనిని పెంచినప్పుడు రాష్ట్రం కూడా పెంచాలి కదా! కేంద్రం పెంచిన మేరకు రాష్ట్రం కూడా హెక్టారుకు రూ. 2,000 అదనంగా ఇస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు భారం ఏమీ ఉండదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిని పెంచేందుకు విముఖత వ్యక్తం చేయటం అన్యాయం. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించకపోతే రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికే ప్రమాదం ఉంది’ అని వ్యవసాయంపై మక్కువ ఉన్న ఓ మంత్రి ‘న్యూస్‌లైన్’తో వ్యాఖ్యానించారు
Share this article :

0 comments: