చంద్రబాబు-కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు-కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్

చంద్రబాబు-కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

* సమాచార కమిషనర్ల ఎంపికే అందుకు నిదర్శనమని వ్యాఖ్యలు
* ఏకాభిప్రాయమని సీఎం అన్నదాన్నే లాలూచీ అని తానంటున్నానన్న బొత్స
* చానళ్లలో స్క్రోలింగులు రావడంతో.. తానలా అనటం లేదంటూ వివరణ
* చెప్పాల్సింది చెప్పా.. ఏమనుకుంటారో మీ ఇష్టమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు
* టీడీపీ సిండికేట్లనూ త్వరలో బయటపెడతానని హెచ్చరిక
* బాబు వంటి విపక్ష నేత రాష్ట్రం చేసుకున్న ఖర్మ అంటూ ధ్వజం
* మద్యం, సిండికేట్లు తప్ప ప్రజాసమస్యలు పట్టవా.. అని పశ్న

హైదరాబాద్, న్యూస్‌లైన్: అపవిత్ర బంధం తాలూకు పరదా పూర్తిగా తొలగింది. చంద్రబాబు-కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్ పచ్చి నిజమని మరోసారి వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవలే కుండబద్దలు కొట్టి మరీ చెప్పిన ఈ వాస్తవాన్ని తాజాగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడాస్వయంగా ధ్రువీకరించారు! సీఎం కిరణ్‌తో చంద్రబాబు లాలూచీ పడ్డారని బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టి సందర్భంగా ఆయన బాహాటంగానే ప్రకటించారు. మద్యం సిండికేట్ల వ్యవహారంపై బాబు చేస్తున్న విమర్శలపై మండిపడ్డ బొత్స, ఆ క్రమంలో బాబు-కిరణ్ బండారాన్ని పూర్తిగా బయటపెట్టారు. 

రాష్ట్రంలో అనేక సమస్యలున్నా వాటన్నిటినీ వదిలేసి, మద్యం సిండికేట్లంటూ తననే లక్ష్యం చేసుకొని బాబు పావులు కదుపుతున్నారని ఆయన అనుమానం వ్యక్తపరిచారు. ప్రభుత్వంతో, సీఎంతో బాబు లాలూచీ పడ్డారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సమాచార కమిషనర్ల ఎంపికే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కమిషనర్ల ఎంపికపై కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చిందని కిరణ్ పేర్కొనడాన్ని, దానిపై బాబు ఎలాంటి డిసెంట్ నోటూ పంపలేదని స్పష్టం చేయడాన్ని బొత్స గుర్తు చేశారు. ఏకాభిప్రాయమని సీఎం అన్న విషయాన్నే, బాబు లాలూచీ పడ్డారని దేశీ భాషలో తాను చెబుతున్నానని వివరించారు. బాబు లాలూచీ పడ్డారే తప్ప సీఎం కాదని చెప్పుకొచ్చారు.

ఛీ ఛీ బాబూ!
అయితే బొత్స వ్యాఖ్యలన్నీ టీవీ చానళ్ల స్క్రోలింగుల్లో హోరెత్తడంతో వెంటనే చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు పేర్ని నాని, అనిల్, ఎమ్మెల్యే మస్తాన్ వలీలతో కలసి సీఎల్పీలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సమాచార కమిషనర్లను చట్టప్రకారం ఎలాంటి లోపాలూ లేకుండా ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఏ తప్పులు లేనందున బాబు దాన్ని ఆమోదించారని చెప్పుకొచ్చారు. అంతే తప్ప సీఎంతో బాబు లాలూచీ పడ్డారని తాననటం లేదన్నారు. 

బాబు సహకారాన్ని సీఎంతో లాలూచీగా, మ్యాచ్‌ఫిక్సింగ్‌గా భావించవచ్చా అని విలేకరులు అడగ్గా, ‘నేను చెప్పాల్సింది చెప్పాను, మీరేమనుకుంటారో అది మీ ఇష్టం’ అంటూ తన మనోగతాన్ని చెప్పకనే చెప్పారు! సర్కారుతో బాబుకు లాలూచీ ఉందో, లేదో ఆయన తీరు చూస్తే స్పష్టమవుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ‘‘బాబు వంటి విపక్ష నేత ఉండడం రాష్టం ఖర్మ, ఛీ ఛీ! రైతులు, వైద్య విద్యార్థులు, చేనేత కార్మికులు వంటి పలు సమస్యలున్నా అవేవీ ఆయనకు పట్టడం లేదు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వాటికోసం పోరాడకుండా, కేవలం మద్యం సిండికేట్లు, మంత్రులకు ముడుపులంటూ మూడు రోజులుగా సభను అడ్డుకోవడం దారుణం’’ అంటూ ధ్వజమెత్తారు. 

మద్యం సిండికేట్లతో ప్రమేయమున్న టీడీపీ వారిపై బాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీ మద్యం వ్యాపారుల చిట్టాను తాను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. ‘‘ఎమ్మార్ కేసులో 2000 నుంచీ విచారించాలని సీబీఐ భావిస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న బాబు లాంటి వ్యక్తి నీతి గురించి మాట్లాడటం పెద్ద వింత! నా బంధుమిత్రులు చట్టబద్ధంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని దైర్యంగా చెప్పాను. బాబు మాత్రం ఆయన కుటుంబీకులుంటే అలా చెప్పేవారు కాదు. ప్రస్తుత మద్య విధానమే లోపభూయిష్టంగా ఉంది. దాన్ని మార్చాలి. ఎలాగన్నది ప్రభుత్వమే చూస్తుంది’’ అన్నారు.
Share this article :

0 comments: