దారి లేకుండా చేసి దగా చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దారి లేకుండా చేసి దగా చేశారు

దారి లేకుండా చేసి దగా చేశారు

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

పాల్మాకులలో ప్రభుత్వ, పేదల భూములను స్వాహా చేశారని వెల్లడి
పాల్మాకులలోని ఆయన భూములన్నింటినీ సర్వే చేయించాలని వినతి
లేకుంటే తామే రైతులతో ప్రైవేటు సర్వే చేయిస్తామని హెచ్చరిక
సర్వే చేయిస్తానని కలెక్టర్ హామీ

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని పాల్మాకుల గ్రామ శివారులో ప్రభుత్వ స్థలాలు, పేద రైతులకు ప్రభుత్వమిచ్చిన అసైన్‌మెంట్ భూములను కబ్జా చేసిన ఈనాడు అధినేత రామోజీపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 

పాల్మాకులలో రామోజీకి ఉన్న 431 ఎకరాల్లో ప్రభుత్వ, అసైన్‌మెంట్ భూములున్నట్టు అధికారుల పరిశీలనలో తేలినా, ఆయనపై కేసులు నమోదు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రామోజీ భూదందాను ‘సాక్షి’ పత్రిక బయటపెట్టినా, మొక్కుబడిగా రెండు సర్వే నెంబర్లలో సర్వే చేసి మిన్నకుండిపోయిన అధికారులు, మొత్తం 431 ఎకరాలను బహిరంగ సర్వే చేసి రామోజీ అక్రమాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాసులునాయుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, బాధిత రైతులు మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రిని కలిసి మూడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

‘‘రామోజీ భూ కబ్జాపై ‘సాక్షి’లో కథనాలు వచ్చినప్పుడు కలెక్టర్ స్పందించి సర్వేకు ఆదేశించారు. కొంత మేర సర్వే చేసిన అధికారులు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు తేల్చారు. అయితే, సర్వేను అక్కడికే పరిమితం చేశారు. ఇందుకు కారణమేమిటి? కబ్జా ఉదంతాలు బయటకు వస్తే పరువు పోతుందని ఆందోళన చెందిన రామోజీ స్వయంగా 10 ఎకరాల అసైన్‌మెంట్ భూముల ఫెన్సింగ్ తొలగించడంతో అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం భూములను సర్వే చేస్తే రామోజీ కబ్జా లీలలు పూర్తిగా బయటపడతాయి. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా 15 ఎకరాలు స్వాహా చేసినట్టు అధికారికంగా తేలినందున ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఆయన చెరలో ఉన్న ప్రభుత్వ, అసైన్‌మెంట్ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలి’’ అని కలెక్టర్‌ను కోరారు. అధికారులు సమగ్ర సర్వే చేపట్టకపోతే, బాధిత రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అందజేసిన ఫిర్యాదు ఆధారంగా పాల్మాకులలోని స్థలాలను సర్వే చేయించేందుకు తహశీల్దార్‌ను ఆదేశిస్తానని కలెక్టర్ చెప్పారు. అందులో తేలే విషయాల ఆధారంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రామోజీ భూములను సమగ్ర సర్వే చేయించకపోతే, జిల్లాలోని రైతుల ఆధ్వర్యంలో తామే ప్రైవేటుగా సర్వే చేయించి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ మండలాల కమిటీల అధ్యక్షులు కె.శ్యామ్, రాజేశ్వర్‌రెడ్డి, పోచయ్య, భీమార్జున్‌రెడ్డి, శంషాబాద్ మండల నాయకులు జి.యాదగిరి, శివారెడ్డి, సామ్యూల్‌రాజ్, పరమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దారి లేకుండా చేసి దగా చేశారు 
నాకు పాల్మాకులలో 13 ఎకరాల స్ధలం ఉండేది. అందులో రెండున్నర ఎకరాలను కొంత మొత్తం ఇచ్చి కొన్నారు. మిగిలిన స్థలం కూడా అమ్మమని ఒత్తిడి చేశారు. నేను అమ్మలేదు. దీంతో నా స్థలంలోకి దారి లేకుండా చేశారు. ఇట్లా చేసి భూములను ఆక్రమించుకుంటే ఎట్లా?
-పెంటయ్య (బాధిత రైతు)

నా స్థలంలోకి పోనివ్వడంలేదు 

మాకు మూడు ఎకరాల స్ధలం ఉంది. అందులో ఎకరన్నర స్థలం అమ్మాను. కానీ మూడు ఎకరాలకు సంబంధించిన పాస్ బుక్‌లు వారి వద్ద ఉంచుకున్నారు. ఇప్పుడు మిగిలిన స్థలంలోకి నన్ను పోనివ్వడం లేదు. అక్కడికి వెళితే సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగుతున్నారు. నా సొంత స్థలంలోకి కూడా వెళ్లలేని దుస్థితి నెల కొంది. 
-రాజు (బాధిత రైతు)
Share this article :

0 comments: