బాబు నిర్వాకాల ఊసు లేకుండా సుప్రీంకోర్టులో అఫిడవిట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు నిర్వాకాల ఊసు లేకుండా సుప్రీంకోర్టులో అఫిడవిట్

బాబు నిర్వాకాల ఊసు లేకుండా సుప్రీంకోర్టులో అఫిడవిట్

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012


*ఎమ్మార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అసలు దోషి చంద్రబాబు 
*టెండర్లలో అక్రమాలను నాడే బయటపెట్టిన విజిలెన్స్ విభాగం 
*2002 సెప్టెంబర్ 4న ఎమ్మార్‌కు ప్రాజెక్టు కట్టబెడుతూ జీవో 
*2002 నవంబర్ 6న 535 ఎకరాలు అప్పగిస్తూ ఒప్పందం 
*2003 ఆగస్టు 19న ఎమ్మార్‌తో కొలాబరేషన్ ఒప్పందం.. 
*మూడో పార్టీకి అవకాశం కల్పిస్తూ అదనంగా నిబంధనలు 
*దీనివల్లే స్టైలిష్ హోమ్స్ పుట్టుకు వచ్చిందన్న విజిలెన్స్ నివేదిక 
*చంద్రబాబు అక్రమాల ప్రస్తావన లేకుండానే సర్కారు అఫిడవిట్ 
*కిరణ్, బాబు కుమ్మక్కయ్యారనేందుకు ఇది నిదర్శనం కాదా? 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి తేటతెల్లమైంది. ఎమ్మార్ అక్రమాలకు కారణమైన అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించటం ద్వారా.. ఈ కేసు నుంచి ఆయనకు రక్షణ కల్పిస్తోంది. ఎమ్మార్ విషయంలో 2004కు ముందు నాటి పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరపకపోవటంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎమ్మార్ కేసు విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఉంచిన ఓ అఫిడవిట్‌లోనూ చంద్రబాబు అక్రమాల గురించి లేశమంతైనా చెప్పలేదు. 

ఎమ్మార్ సంస్థ సృష్టించిన ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, మోసపూరితంగా వ్యవహరించిందని అఫిడవిట్‌లో చెప్పిన ప్రభుత్వం.. కుంభకోణం అసలు మూలాలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎమ్మార్‌తో చంద్రబాబు ప్రభుత్వం 2002లో ఒప్పందం కుదుర్చుకున్న విషయం కానీ.. తన బినామీ కోనేరు ప్రసాద్‌కు లబ్ధి కలిగే విధంగా కొలాబరేషన్ ఒప్పందం చేసుకోవటం గురించి కానీ కోర్టుకు తెలియజేయకుండా.. పూర్తిగా ఎమ్మార్ ఎంజీఎఫ్‌పై అభియోగాలు మోపేందుకే అఫిడవిట్‌ను పరిమితం చేసింది. 

విజిలెన్స్ బట్టబయలు చేసినా కూడా... 
ఎమ్మార్ విషయంలో చంద్రబాబు పాత్ర, కోనేరు ప్రసాద్, స్టైలిష్ హోమ్స్ నిర్వాకాల గురించి సాక్షాత్తూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రభుత్వం పూర్తిగా దాచిపెట్టింది. గ్లోబల్ టెండర్లు పిలవకుండా ఆసక్తి వ్యక్తీకరణ పేరుతో నిర్వహించిన టెండర్లలో చంద్రబాబు అండ్ కో ‘తన ఆసక్తిని’ ఎలా నెరవేర్చుకుందో కూడా విజిలెన్స్ స్పష్టం చేసింది. ‘నిజానికి డెవలపర్‌గా ఎమ్మార్‌ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ, కొలాబరేషన్ ఒప్పందంలో క్లాజ్ ప్రకారం మూడో పక్షానికి అవకాశం ఇచ్చినట్లయింది’ అని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పుడు అన్ని వివాదాలకు కారణమైన స్టైలిష్ హోమ్స్ అనే సంస్థ పుట్టుకురావటానికి వీలు కల్పించింది కూడా 2003, ఆగ స్టు 19న కుదుర్చుకున్న ఈ కొలాబరేషన్ ఒప్పందమేనని విజిలెన్స్ తన నివేదికలో తేల్చి చెప్పింది. ఎమ్మార్‌కు ప్రాజెక్టును కట్టబెడుతూ 2002 సెప్టెంబర్ 4న చంద్రబాబునాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత.. అదే ఏడాది నవంబర్ 6న 535 ఎకరాలు ఇచ్చేందుకు ఎమ్మార్‌తో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంతటితో ఆగకుండా ఎమ్మార్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చిన తన బినామీ కోనేరు ప్రసాద్‌కు ‘న్యాయం’ చేసేందుకు ఓ కొలాబరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎమ్మార్‌కు భూమిని కట్టబెడుతూ జారీ చేసిన 359 జీవోలో లేని అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ఎమ్మార్ సంస్థ మూడో పక్షానికి కట్టబెట్టేందుకు వీలుగా ఓ నిబంధనను చేర్చింది. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ అంశాలను ఎక్కడా ప్రస్తావించనే లేదు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు కుమ్మక్కయినందువల్లే.. ఈ కీలక అంశాలన్నింటినీ మరుగుపరచి.. దర్యాప్తును పక్కదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

టెండర్లలోనే అక్రమాలకు పునాదులు... 
ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్, 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్, దాని చుట్టూ శ్రీమంతుల విల్లాలు... ఇలా ఉంటే ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలన్న కోనేరు ప్రసాద్ ప్లాన్‌ను అనుసరించి చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టును ఎమ్మార్‌కు కట్టబెట్టాలని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లుగా 2001లో ఏపీఐఐసీ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించారు. దీనికి ఎమ్మార్‌తో పాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, మలేషియాకు చెందిన ఐఓఐ, దేశీయ సంస్థలైన ఎల్ అండ్ టీ, షాపుర్జీ పల్లోంజీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. చంద్రబాబు సర్కారు ముందుగా అనుకున్న పథకం ప్రకారమే.. బిడ్లు దాఖలు చేసిన సోమ్ ఏసియా, షాపుర్జీ పల్లోంజీ బిడ్లను తిరస్కరించింది. 

టెండర్ల గడువు ముగిసే నాటికి ఎల్ అండ్ టీ, ఐఓఐ వెనక్కి వెళ్లాయి. ఆ సంస్థలు పోటీ నుంచి వైదొలిగేలా స్వయంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదిపారు. చంద్రబాబు అనుకున్నట్లే ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. ఎమ్మార్ టెండర్‌నే బాబు సర్కారు ఆమోదించింది. ప్రజాప్రయోజనాలు ఏ మాత్రం ఇమిడిలేని ఈ ప్రాజెక్టు అమలు కోసం సింగిల్ టెండర్‌ను ఆమోదించటాన్ని విజిలెన్స్ తప్పుపట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో.. అసలు ఈ టెండర్ ప్రక్రియ గురించి ఏమాత్రం చెప్పకుండా.. ఎప్పుడో వచ్చిన ఎంజీఎఫ్ దోచుకుందని మాత్రమే చెప్పుకొచ్చారు. 

దోషులెవరో ఆ ధరే చెపుతుంది... 
ఎమ్మార్ సంస్థకు చంద్రబాబు ఎంతగా ప్రయోజనం చేకూర్చారన్నది ఆయన నిర్ణయించిన భూమి ధరను బట్టే చెప్పొచ్చు. ఎమ్మార్‌కు భూమిని కట్టబెట్టటానికి మూడేళ్ల ముందే.. ఆ ప్రాజెక్టు ప్రాంతంలోనే తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూమిని చంద్రబాబు ఎకరా కోటి రూపాయల ధరకు అమ్ముకున్నారు. కానీ ఎమ్మార్ విషయంలో మాత్రం అంతులేని ఔదార్యం ప్రదర్శించారు. ఎకరా రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 29 లక్షల ధరకే ఆ సంస్థకు ధారపోశారు. దీనిపై విచారణ అవసరం లేదా? కాంగ్రెస్ సర్కారుకు చంద్రబాబు అవినీతి కనిపించలేదా? పోనీ చంద్రబాబు అమ్మినట్లు ఎకరా కోటి రూపాయలు అనుకున్నా.. ఎమ్మార్‌కు ఎకరా భూమికి రూ. 75 లక్షలు చొప్పున డిస్కౌంట్ ఇచ్చినట్లే కదా! ఈ లెక్కన 535 ఎకరాలకు రమారమి రూ. 400 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లే కదా! రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 400 కోట్ల మేర నష్టం కలిగించినట్లే కదా! 

ఇది ‘ఫిక్సింగ్’ కాక మరేమిటి? 
ఎమ్మార్ వ్యవహారంలో చంద్రబాబు అక్రమాల బాగోతం ఇంత స్పష్టంగా కనపడుతున్నా.. ఆయన పాత్రపై విచారణ జరపటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? కేంద్రంలో కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐ నాటి కుంభకోణం మూలాలను శోధించేందుకు ఎందుకు నిరాకరిస్తోంది? సాక్షాత్తూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా కూడా.. చంద్రబాబును నేటికీ ప్రశ్నించకపోవటానికి కారణం ఏమిటి? ఈ కేసులో చంద్రబాబును విచారించాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌తో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు ఇచ్చినా స్పందించరెందుకు? అన్న ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం మనసును తొలుస్తున్నాయి. అయితే.. రాష్ట్ర కేబినెట్ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి చెప్పినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగే.. ఆయనను కేసు నుంచి తప్పించటానికి కారణమన్న జవాబు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
Share this article :

0 comments: