ఏ రైతును కదిలించినా కష్టాలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ రైతును కదిలించినా కష్టాలే

ఏ రైతును కదిలించినా కష్టాలే

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

గుంటూరు ఓదార్పులో వైఎస్ జగన్ ధ్వజం
జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, 108, 104 సిబ్బంది మొర ఆలకించేవారే లేరు
రైతులకు గిట్టుబాటు ధర కరువైంది.. ఏ రైతును కదిలించినా కష్టాలే
ఆ దివంగత నేత బతికి ఉంటే.. తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంతా అంటున్నారు
బాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు


ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: జూనియర్ డాక్టర్లు 15 రోజులుగా సమ్మె, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్క జూనియర్ డాక్టర్లే కాదు.. కాంట్రాక్టు లెక్చరర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, 108, 104 ఉద్యోగులు దీక్షలు చేస్తున్నా వారి మొర ఆలకించే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నచిన్న వ్యాపారులను కూడా వదలకుండా ఈ ప్రభుత్వం ఐదు శాతం వ్యాట్‌తో బాదుతోందని నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లాలో 62వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా గురువారం జగన్.. నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 13 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్ర సంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

పేదోడిని ఆదుకునే 108, 104 ఏవి..?
పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకునే 108 పథకం దివంగత నేత చనిపోయిన తరువాత అటకెక్కిపోయింది. ఇప్పుడు ఈ పథకం ఎలా తయారైందీ అంటే.. 108 అనే నంబర్‌కు ఫోన్ కొడితే ...! 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రెండు మూడు గంటలైనా రాని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇంకా ఏం సమాధానాలు వినిపిస్తున్నాయంటే.. మా అంబులెన్స్‌లో డీజిల్ లేదు.. మా అంబులెన్స్‌లు రిపేర్ కోసం షెడ్డుకు వెళ్లాయి.. మా ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారు.. అని చెబుతున్నారు.

ప్రతి గ్రామంలో నడవలేని పేదవాళ్ల కోసం మొబైల్ ఆసుపత్రులు తీసుకురావాలనీ, ముసలి వయసులో ఉన్న అవ్వా తాతలకు బీపీ వచ్చినా... షుగర్ వచ్చినా వారి వద్దకే వెళ్లి అక్కడే పరీక్షలు చేసి మందులివ్వాలని వైఎస్సార్ 104 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు ఆ 104కు ఫోన్ చేస్తే.. మా అంబులెన్స్‌లో మందులు లేవు అన్న సమాధానాలు వినపడుతున్నాయి. ఇవాళ అందరీ నోట ఒకే మాట వినపడుతోంది. ఆ దివంగత నేత బతికే ఉంటే మా పరిస్థితులు ఇలా ఉండేవే కావన్న మాట వినపడుతోంది.

రైతన్నలకు ఎన్నాళ్లీ కష్టాలు...
ఇక్కడకు (పాలపాడు) రాకముందు చాలా గ్రామాలు తిరుగుతూ వస్తున్నా.. రైతన్న దగ్గరకు వెళ్లి వడ్ల (ధాన్యం) ధర ఎంత ఉందన్నా? అని అడిగితే.. బస్తాకు రూ.750కి మించి రాని అధ్వాన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నామన్నా అని చెబుతున్నారు. మిరప వేసిన రైతన్నను అడిగితే..? ఈ ఏడాది వర్షాలు సరిగా పడలేదు.. బొబ్బర వైరస్ సోకి పంట పోయింది.. ఇది చాలదన్నట్లు అకాల వర్షాలు కురిసి కాయ తాలుబోయింది. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్లు పండాల్సిన మిరప ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా పండలేదన్నా అని చెప్పారు. ఈ మిరపను తీసుకొని మార్కెట్‌కు వెళ్తే క్వింటాల్‌కు రూ 5,000కు కూడా రావడం లేదన్నా అని చెప్పినప్పుడు బాధనిపించింది. పసుపు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎలా ఉన్నావని వారిని పలకరిస్తే.. అన్నా.. పంట చేతికొచ్చే సరికి రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షలు ఖర్చు అవుతుంది.. ఇవాళ పసుపును మార్కెట్‌కు తీసుకుని పోతే రూ. 3,500 కూడా రాని పరిస్థితులు ఉన్నాయి.. ఈ రేట్లకు అమ్మితే ఎకరాకు కనీసం అంటే రూ.60 నుంచి రూ.70 వేల నష్టం వస్తుందన్నా.. అని వాపోతున్నారు. పత్తి రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పత్తికి ఇవాళ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.3,500 కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు...
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఈరోజు కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆయన రాజకీయాల్లోనే పుట్టారు.. రాజకీయాల్లోనే జీవితం గడుపుతున్నారు. ఈరోజు రాజకీయాల్లో ఉంటాం.. రేపు వెళ్లిపోతాం. రాజకీయాలు అంటే రాజకీయం చేయడం కాదు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికే ఉండటం. నాయకుడు అనే వాడికి విలువలు ఉండాలి.. విశ్వసనీయత ఉండాలి. ఫలానా నాయకుడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబునాయుడు. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ చెబుతూ నిజం అని నమ్మించే వ్యక్తి చంద్రబాబుగారు!

వారి అధికారం వైఎస్ రెక్కల కష్టం..
ఆ దివంగత నేత రెక్కల కష్టం మీద ఇవాళ రాష్ట్రంలోనైనా.. కేంద్రంలోనైనా సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారు. అందుకు కారణమైన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్. అటువంటి నేత చనిపోయాడు అనే సంగతి తెలిసి.. తిరిగి రాలేడు అని తెలిసి.. ఆయనను అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ పక్కనపెట్టింది. చివరకు చంద్రబాబుతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్లకు ప్రజలు పట్టడం లేదు.. ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందీ అంటే.. చనిపోయిన దివంగత నేతకు ఒక న్యాయమటా.. బతికి ఉన్న చంద్రబాబుకు వేరొక న్యాయమటా..!
Share this article :

0 comments: