ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని భావించిన దివంగత సీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని భావించిన దివంగత సీఎం

ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని భావించిన దివంగత సీఎం

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012


7 జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పథకం
అనుమతుల దిశగా కృషి.. జాతీయ హోదా కోసం అప్పుడే ప్రయత్నాలు 
1975లో జరిగిన ఒప్పందం కేవలం 50 వేల ఎకరాల రెగ్యులేటరీ కోసమే
40 ఏళ్ల కల అంటూ మహానేతను మరిపించే కుట్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజల నీటి అవసరాలు తీరాలంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మినహా మరో మార్గం లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టిగా విశ్వసించారు. అందుకే ఎంతటి వ్యయానికైనా వెనుకంజ వేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. ఆలోచన వచ్చిన వెంటనే ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను తెప్పించుకోవడంతో పాటు ఎటువంటి జాప్యానికి తావివ్వకుండా పనులు మొదలుపెట్టే స్థాయికి తీసుకెళ్లారు. 

తెలంగాణలోని 7 జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యంతో పాటుగా తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జాతీయ హోదా సాధించేందుకు చివరిక్షణం వరకు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఆయన మృతి తర్వాత ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి. కానీ మహారాష్ట్ర వైపు నుంచి కొంత సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో.. ఇంతటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టిన దివంగత వైఎస్ పేరును మరిపించే విధంగా మరో కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే కొన్ని పత్రికలు 40 ఏళ్ల కల అంటూ కొత్త పల్లవిని అందుకున్నాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని పార్టీలు కూడా అందుకనుగుణంగా మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి ప్రాణహిత, వైఎస్ ప్రాణం పోసిన ఇప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల పూర్వాపరాలను ఒకసారి పరిశీలిస్తే... 

50 వేల ఎకరాల ప్రాణహిత రెగ్యులేటరీ..

1975లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్‌బి చౌహాన్‌ల మధ్య మొత్తం మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఇందులో లెండి, లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టులను ఇప్పటికే చేపట్టారు. మూడోదే ప్రాణహిత. దీన్నే ప్రభుత్వాలు విస్మరించాయి. అప్పట్లో ఈ ప్రాజెక్టు పరిధి చాలా చిన్నది. కేవలం 5 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి వీలుగా రెగ్యులెటరీని నిర్మించాలనేది ఆప్పటి ప్రణాళిక. దీని ద్వారా కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉంది. అయినప్పటికీ దీన్ని చేపట్టడానికి అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి ఏడాది గోదావరి నది నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా...ప్రాజెక్టు గురించి పట్టించుకున్న వారే లేరు. 

16.4 లక్షల ఎకరాల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు

నిజామాబాద్ పర్యటన సందర్భంగా ప్రజల కష్టాలను పరిశీలించిన వైఎస్ ఈ ప్రాజెక్టును చేపట్టాలనే కృతనిశ్చయానికి వచ్చారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నివేదికను ఇవ్వాల్సిందిగా 2005లో ‘వ్యాప్‌కాస్’ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్)ను ఆదేశించారు. సదరు సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహితను చేపట్టేందుకు 2007 మే 16న (జీవో నంబర్ 124) ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత మెదక్, రంగారెడ్డి, ఇతర జిల్లాల ప్రజల అవసరాలను గుర్తించి... 1975లో ప్రతిపాదిత ప్రాజెక్టుతో (5 టీఎంసీల నీటి నిల్వ) పోలికేలేని విధంగా ప్రాజెక్టును మరింత విస్తరించారు. ఏకంగా 160 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే విధంగా విస్తృత పరిచారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని సైతం 50 వేల ఎకరాల నుంచి 16.40 లక్షల ఎకరాలకు పెంచారు. అంతేకాదు పరిశ్రమల అవసరాల కోసం 16 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, గ్రామీణ ప్రాంత తాగునీటి అవసరాలకోసం మరో 10 టీఎంసీలను ఉపయోగించుకునే విధంగా రూపకల్పన చేశారు. ఈ మేరకు 2008 డిసెంబర్ 17న మరో జీవోను విడుదల చేశారు. అనంతరం మంత్రిమండలిలో చర్చించి ప్రాజెక్టుకు చట్టబద్ధతను కల్పించారు. టెండర్లను ఆహ్వానించి 28 ప్యాకేజీలకు ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. కావాల్సిన అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలను పంపించారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం సూత్రప్రాయ అంగీకారాన్ని తెలియజేయడమే కాకుండా ప్రధాని ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చింది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించాలని వైఎస్ అప్పట్లోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా మారిపోయింది.

కొలరాడో స్ఫూర్తిగా...

అమెరికాలోని కొలరాడో-బిగ్ థాంప్సన్ ప్రాజెక్టు స్ఫూర్తిగా దివంగత వైఎస్ రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్లకు ప్రాణం పోశారు. కొలరాడో రాష్ట్రంలోని పర్వత సాణువుల్లో ఈ అతిపెద్ద ప్రాజెక్టు సాధ్యం కాగా లేనిది.. రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్లను నిర్మించలేమా? అని వైఎస్ భావించారు. అమెరికాలోని పశ్చిమ పర్వత సాణువుల్లోంచి కిందకు ఉరకలు వేసే కొలరాడో నదీ జలాలను తూర్పు సాణువుల్లోని బిగ్ థాంప్సన్ నదితో అనుసంధానం చేసి మైదాన ప్రాంతాలకు నీటిని మళ్లించేందుకు దీనిని నిర్మించారు. సుమారు 7.2 ల క్షల ఎకరాలకు సాగునీరందించడంతో పాటు తాగునీటి, పారిశ్రామిక అవసరాలను కూడా తీరుస్తోంది. దీని కింద పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, డ్యామ్‌లు ఉన్నాయి. సుమారు 33 నగరాలు, పట్టణాలు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందుతున్నాయి.
Share this article :

0 comments: