గౌరవనీయులైన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి, - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గౌరవనీయులైన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి,

గౌరవనీయులైన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి,

Written By ysrcongress on Monday, February 13, 2012 | 2/13/2012

విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలతో పాటుగానే ఒకే సారి ఉప ఎన్నికలు నిర్వహించాలని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. తాము ఏ పరిస్థితుల్లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసింది, ఎందుకు ఉప ఎన్నికలు కోరాలనుకుంటున్నది వివరిస్తూ కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్యేల లేఖ పూర్తి పాఠం కింది విధంగా ఉంది.

గౌరవనీయులైన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి,

భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన 17 మంది శాసనసభ్యులమైన మేము, అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 62 శాతం జనాభా గల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరిస్తూ గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన అసెంబ్లీలో ఓటు వేశాం.

రాష్ట్ర ప్రభుత్వం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఏ మాత్రం రైతులకు గిట్టుబాటు కాలేదు. తాను ప్రకటించిన కనీస మద్దతు ధరను కూడా రైతులకు చెల్లించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో రాష్ట్రంలోని రైతులు మునుపెన్నడూ లేనంత విపత్తును ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో సంభవించిన వరదలు, కరవు పరిస్థితుల కారణంగా రైతులు సుమారు 18000 కోట్ల రూపాయల మేరకు నష్ట పోయారు. వారిని ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిని కూడా అమలు చేయకుండా రైతులను వారి మానాన వారిని వదలి వేసింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా గోదావరి జిల్లాల్లోని రైతులు అసాధారణమైన రీతిలో స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేను ప్రకటించారు. ప్రజా ప్రతినిధులుగా ఈ పరిణామాలన్ని చూస్తూ మేం మౌనంగా ఉండలేక పోయాం. అంతేకాక, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పదే పదే ప్రయత్నాలు చేస్తోండటంతో మేమంతా గత ఏడాది ఆగస్టు 22వ తేదీన మా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశాం. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేశాం. 

కానీ, ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతామని భయపడిన కాంగ్రెస్ పార్టీ మా రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చింది. మేం మా పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని, ఇందులో తమకు ఎలాంటి సందిగ్ధత లేదనీ స్పీకర్‌కు స్పష్టం చేసినా లాభం లేక పోయింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలనూ ఎదుర్కొనే సాహసం కాంగ్రెస్‌కు లేదనేది స్పష్టంగా తేలి పోయింది. రాష్ట్రంలో 110 మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల పదవీకాలం పూర్తయి 16 నెలలు దాటినా ఎన్నికలు లేవు. ఇంకా దిగ్భ్రాంతిని కలిగించే విషయం ఏమిటంటే, గత ఏడాది సెప్టెంబర్ నుంచీ ఖాళీగా ఉన్న పంచాయితీ పదవులకు ఇంత వరకూ ఎన్నికలు నిర్వహించలేక పోయింది. మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్నది రాజ్యాంగపరంగా తప్పని సరి చర్య అయినా పట్టించుకోవడం లేదు. దురదృష్ట వశాత్తూ ఈ వైఫల్యాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎన్నికలంటే భయపడుతున్న ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. 

గత డిసెంబర్ 5వ తేదీన మేం విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంపై ప్రభుత్వం విప్ మా అందరినీ అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ గౌరవనీయులైన శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోని నిబంధనల ప్రకారం స్పీకర్ మాపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అనివార్యంగా స్పీకర్ మమ్మల్ని అనర్హులుగా ప్రకటించాలి. రాజీనామాలు చేయడం వెనుక మాపై ఎలాంటి ఒత్తిడులూ లేవని మేం స్పీకర్ సమక్షంలో స్పష్టంగా వెల్లడించాం. మీడియా ద్వారా కూడా ఇదే విషయాన్ని చెప్పాం. కానీ స్పీకర్ మాత్రం అనర్హతకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కారణాలు ఆయనకే తెలియాలి. సాధ్యమైనంత మేరకు మా అనర్హతను వాయిదా వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్రంలో మీడియా మొత్తం కథనాలను ప్రచురిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 30వ తేదీ లోపుగా ఉప ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఇపుడే కనుక మాపై అనర్హత వేటు వేస్తే వాటితో పాటే మా 17 స్థానాల్లో కూడా ఎన్నికలు వస్తాయనే భయంతో వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గౌరవనీయులైన స్పీకర్ కనుక తన నిర్ణయాన్ని త్వరగా ప్రకటిస్తే ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలతో పాటుగా మా 17 నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుపవచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆలస్యం చేయాల్సిందిగా లోపాయికారీగా కోరుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని ఎన్నికలూ ఒకేసారి జరుగనీయరాదన్నది కాంగ్రెస్ అభీష్టంగా ఉంది. 

అందువల్ల, ఈ అంశాల నేపథ్యంలో దయతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7 స్థానాలకూ ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారం వరకూ ఎన్నికల షెడ్యూలును ప్రకటించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. 

కృతజ్ఞతలతో 
భవదీయులు
వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు.
Share this article :

0 comments: