కేబినెట్‌లో అందర్నీ వదిలేసి అధికారులనే లక్ష్యంగా చేసుకుంటారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేబినెట్‌లో అందర్నీ వదిలేసి అధికారులనే లక్ష్యంగా చేసుకుంటారా?

కేబినెట్‌లో అందర్నీ వదిలేసి అధికారులనే లక్ష్యంగా చేసుకుంటారా?

Written By ysrcongress on Sunday, February 5, 2012 | 2/05/2012


నియమ నిబంధనలు, సహజ న్యాయసూత్రాలనూ తుంగలో తొక్కి దర్యాప్తు చేస్తున్నారు
ఏ తప్పు జరిగినా.. తొలి బాధ్యత మంత్రులు, కేబినెట్‌దే..
సచివాలయ బిజినెస్ రూల్స్‌లో అది స్పష్టంగా ఉంది
కార్యదర్శి ఫైలు పంపారు.. ఏముందో తెలియదు.. సంతకం పెట్టామంటే కుదరదు
గనుల కేటాయింపు, పరిశ్రమలకు రాయితీల విషయంలో మొత్తం బాధ్యత కేబినెట్‌దే
వేల కోట్లు తింటున్న మంత్రులను వదిలేసి చిన్న చేపలపై ప్రతాపమా?
దర్యాప్తు సంస్థ తీరును ప్రధాని, సీబీఐ డెరైక్టర్‌కు వివరించాలని నిర్ణయం.. త్వరలో ఢిల్లీకి ప్రతినిధులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: డిపార్ట్‌మెంటులో ఏం జరిగినా తొలి బాధ్యత సంబంధిత మంత్రిదేనని రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం స్పష్టం చేసింది. సచివాలయ బిజినెస్ రూల్స్‌లో ఇది స్పష్టంగా ఉందని.. అయితే, అన్ని నియమ నిబంధనలను, సహజ న్యాయసూత్రాలను తుంగలో తొక్కి, ప్రస్తుత సీబీఐ దర్యాప్తు జరుగుతోందని మండిపడింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న గనుల కేటాయింపు వ్యవహారం, పరిశ్రమలకు ఇచ్చిన రాయితీల విషయంలో మొత్తం బాధ్యత కేబినెట్‌దేనని తేల్చి చెప్పింది. కేబినెట్‌లోని అందర్నీ వదిలేసి అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. ‘మంత్రులు కొన్ని వేల కోట్లు లంచాలు తీసుకున్నారు. అలాంటి పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలమీద ప్రతాపం చూపించడం ఏమిటి’ అని నిలదీసింది. సీబీఐ దర్యాప్తు తీరుతెన్నులు, మంత్రులను వదిలేసి అధికారులనే లక్ష్యంగా చేసుకోవడంపై శనివారం సాయంత్రమిక్కడి ఐఏఎస్ అసోసియేషన్ భవనంలో ఐఏఎస్‌ల సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రిటైర్డు ఐఏఎస్‌లతోపాటు మొత్తం 150 మంది హాజరయ్యారు. సుమారు మూడు గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. అనంతరం ఐఏఎస్‌ల సంఘం అధ్యక్షుడు శ్రీపాద భలేరావు, ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మహాపాత్ర, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు విలేకరులతో మాట్లాడారు. బిజినెస్ రూల్స్, ప్రొసీజర్స్‌కు విరుద్ధంగా కేవలం అధికారుల ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో సీబీఐ దర్యాప్తు జరుగుతోందని వారు ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ తరహాలో పోరాటం చేస్తామంటూ వస్తున్న ఊహాగానాలను ఖండించారు. సీబీఐ దర్యాప్తు తీరు సరిగా లేదన్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మీడియా కూడా ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని వారు కోరారు. తప్పుచేసిన వారికి తాము మద్దతు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. జైల్లో ఉన్న ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని ఉద్దేశించి సీపీఐ రాష్ర్ట కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.

బిజినెస్ రూల్స్ ఎంతవరకూ తెలుసు?

ప్రజాస్వామ్యంలో కేబినెట్ ఎలా పనిచేయాలి? మంత్రి ఎలా పనిచేయాలి? కార్యదర్శి ఎలా పనిచేయాలి? సీఎం ఎలా పనిచేయాలి? అనేదానికి సచివాలయ బిజినెస్ రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నాయని కాకి మాధవరావు వివరించారు. ఈ బిజినెస్ రూల్స్ సీబీఐ అధికారులకు ఎంతవరకు తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘డిపార్ట్‌మెంట్‌లో ఏం జరిగినా తొలి బాధ్యత మంత్రిదేనని ఈ రూల్స్‌లో స్పష్టంగా ఉంది. అధికారులకు అధికారం బదలాయించేది కూడా సంబంధిత మంత్రులే. ప్రతి వారం సంబంధిత కార్యదర్శి.. ఆ వారంలో ఏమేం పనులు చేశారన్న జాబితాను సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి కచ్చితంగా పంపాలని బిజినెస్ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి’ అని వివరించారు. కార్యదర్శి ఫైలు పంపారు.. అందులో ఏముందో తెలియదు.. సంతకం పెట్టానని సీబీఐ విచారణలో మంత్రి చెబితే చెల్లదని ఆయన అన్నారు. ఇలాంటివి జరిగితే మంత్రి వైఫల్యంగాను, క్యాబినెట్ వైఫల్యంగాను భావించాల్సి ఉంటుందని మాధవరావు స్పష్టంచేశారు. అయితే, ఇందుకు విరుద్ధంగా సీబీఐ దర్యాప్తు సాగుతోందన్నారు. ‘మాకు ఏమీ తెలీదు.. ఫైలొచ్చింది సంతకం పెట్టాం’ అని మంత్రులు అనడం మంత్రిగా వారు చేసిన ప్రమాణానికీ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. 

రూ.100 కోట్లు తీసుకున్న వాళ్లను వ దిలేసి..

‘రాజకీయ నాయకుల్లో అవినీతి లేదా? అధికారులే అవినీతి పరులని ఎలాఅంటారు?’ అని కాకి మాధవరావు ప్రశ్నించారు. రూ.100 కోట్లు లంచం తీసుకున్న వాళ్లను వదిలేసి.. రూ.10, 20 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయడం ఏ విధంగా సహజన్యాయమన్నారు. ఏడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు మాట్లాడటం ఏమిటని అన్నారు. ‘మూడు నెలల్లో చార్జిషీటు వేయాలి కాబట్టి ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభించనందున ఆదరాబాదరాగా అధికారులను వేధించడం ఎందుకు? ఆధారాలు ఇంకా లభించనందున చార్జీషీటు దాఖలు చేయడానికి సమయం కావాలని కోర్టును సీబీఐ ఎందుకు అడగదు’ అని ప్రశ్నించారు. ఏపీఐఐసీ ైవె స్ చైర్మన్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతున్న సీబీఐ.. ఆ సంస్థ చైర్మన్, డెరైక్టర్లు సంతకాలు చేసినప్పటికీ.. వారిని ఎందుకు బాధ్యులను చేయడం లేదని నిలదీశారు. ఆర్టికల్ 14కి పూర్తి విరుద్ధంగా సీబీఐ దర్యాప్తు సాగుతోందని, సీబీఐకి ప్రత్యేక ఆర్టికల్ ఏమైనా ఉందా? అంటూ మండిపడ్డారు. ‘దర్యాప్తు సందర్భంగా చిన్న అధికారులను వారు బూతులు తిడుతున్నారు. మీపై ఒత్తిడి ఉందా అని పెద్ద అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఈ విధమైన దర్యాప్తు చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆయన అన్నారు. ‘రైల్వే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. ఆయన గ్యాంగ్‌మన్ లేదా డ్రైవరో కాదు. మరి.. ఇప్పటి మంత్రులకు బాధ్యతెందుకు ఉండదు’ అని ప్రశ్నించారు. విధానపరమైన నిర్ణయాలన్నీ సీఎం, మంత్రులు, కేబినెట్టే తీసుకుంటాయని... వాటి అమలే అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. 

సస్పెన్షన్లు, అరెస్టులు శిక్షలు కావా?

సీబీఐ అరెస్టులు చేయడం శిక్ష కాదంటూ ఐఏఎస్‌లతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనడంపై మాధవరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులను సస్పెండ్ చేయడం, అరెస్టు చేయడం ఏవిధంగా శిక్ష కాదో తమకు అర్థం కావడం లేదన్నారు. బిజినెస్ రూల్స్‌పైన, ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే విధానంపైన కనీస అవగాహనలేకుండా సీబీఐ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. కాగా, మంత్రులను వదిలేసి.. అధికారులే లక్ష్యంగా సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై చార్జిషీటులోని అధికారులకు వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేసేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని ఐఏఎస్‌ల సంఘం తీర్మానించింది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు తీరును ప్రధానికి, సీబీఐ డెరైక్టర్‌కు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతినిధి బృందం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది. బృందంలో ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని నేడో రేపో ప్రకటించనున్నారు. ఐఏఎస్‌ల సంఘం భేటీకి హాజరైన వారిలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్ళులు రమాకాంత్‌రెడ్డి, మోహన్ కందా, సి.ఎస్.రావుతోపాటు సీఎం పేషీ అధికారులు జవహర్‌రెడ్డి, శ్రీధర్, రావ త్ తదితరులున్నారు.
Share this article :

0 comments: