కిరణ్ సర్కారుకు, అటు చంద్రబాబుకు ఎదురుదెబ్బే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ సర్కారుకు, అటు చంద్రబాబుకు ఎదురుదెబ్బే

కిరణ్ సర్కారుకు, అటు చంద్రబాబుకు ఎదురుదెబ్బే

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012

రాజకీయ నాయకుల ఎంపికపై అభ్యంతరం 
నలుగురి పేర్లకు తిరస్కరణ
సీఎంకు, ప్రతిపక్ష నేతకు గట్టి ఎదురుదెబ్బ 
కమిషనర్ల ఎంపికపై తీవ్ర విమర్శలు 
8 మంది జాబితాలో నలుగురు కాంగ్రెస్ నేతలే 
కిరణ్ ‘పునరావాస’ ప్రణాళికకు బాబు మద్దతు 
గవర్నర్‌కు, కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ 
ఫైల్‌ను వెనక్కి పంపిన నరసింహన్

హైదరాబాద్, న్యూస్‌లైన్: సమాచార కమిషన్‌ను రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా మార్చాలనుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఆ విషయంలో ఆయనకు మద్దతునిచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. సీఎం, ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేసిన ఎనిమిది మందిని సమాచార కమిషనర్లుగా నియమించాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తిరస్కరించారు. సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా.. సమాచార కమిషనర్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న నలుగురిని ఎంపిక చేయటం పట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఫైలును మంగళవారం ప్రభుత్వానికి తిప్పి పంపించారు. ఈ పరిణామం ఇటు కిరణ్ సర్కారుకు, అటు చంద్రబాబుకు ఎదురుదెబ్బేనని సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకులను, వారికి కావాల్సిన వారిని కమిషనర్లుగా ఎంపిక చేయటం ద్వారా.. సమాచార కమిషన్‌ను సీఎం కిరణ్ రాజకీయ కమిషన్‌గా మార్చారని.. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సీఎంతో కుమ్మక్కై తనవంతు సహకారం అందించారని తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులతో కూడిన కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించవద్దంటూ పౌర సంఘాలు, మేధావుల నుంచి గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. కమిషనర్ల ఎంపిక కోసం సమావేశమైనప్పుడు కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పేర్లు ప్రకటించినప్పుడు కానీ.. కిరణ్ చేసిన ఎంపికపై వ్యతిరేకంగా నోరు మెదపని చంద్రబాబు.. పౌరసంఘాల నుంచి ఉవ్వెత్తున విమర్శలు వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. రాజకీయ నాయకులను సమాచార కమిషనర్లుగా ఎంపిక చేయటాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి ‘డిసెంట్ నోట్’ (అసమ్మతి లేఖ) రాశానంటూ పార్టీ నేతల ద్వారా మీడియాకు చెప్పించారు. కానీ.. ప్రతిపక్ష నేత డిసెంట్ నోట్ లాంటిదేమీ రాయలేదని స్వయంగా ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేయటంతో.. బాబుది పచ్చి నాటకమని తేటతెల్లమైంది. 

రాజకీయ ప్రత్యర్థికి పునరావాసం... 

గత ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇంతియాజ్ అహ్మద్.. మళ్లీ పోటీ చేస్తే తనకు కష్టమని సీఎం అనుకున్నారో ఏమో కానీ.. ఆయనకు పదవి ఇస్తామని ఎరచూపి కాంగ్రెస్‌లోకి రప్పించుకున్నారు. ఇప్పుడు సమాచార కమిషనర్‌గా నియమించాలని ఇంతియాజ్ పేరును సీఎం సిఫారసు చేశారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని కమిషనర్‌గా నియమించేందుకు సీఎం ప్రతిపాదించినా చంద్రబాబు వ్యతిరేకించకుండా మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మరోసారి రూఢీ అయింది. 

* పీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్న వర్రె వెంకటేశ్వర్లును సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ కమిషనర్‌గా కమిటీ ఎంపిక చేసింది. 

* 2009 ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయనిర్మలకు సమాచార కమిషన్‌లో చోటు కల్పించటం ద్వారా.. కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పెద్దలకు మరో నజరానా సమర్పించటానికి సర్కారు ప్రయత్నించింది. 

* మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె, 2009 ఎన్నికల్లో తిరువూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తాంతియా కుమారి పేరును కమిటీ ఎంపిక చేసింది. 

ఢిల్లీ వరకూ వెళ్లిన ఫిర్యాదులు... 

సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా కమిషనర్ల ఎంపిక జరిగిందంటూ పౌర సంఘాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయటంతో పాటు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. సమాచార హక్కు చట్టం సెక్షన్ 15(6) ప్రకారం.. రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలున్న వారిని కమిషనర్లుగా ఎంపిక చేయకూడదని; 15(5) ప్రకారం.. సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, పరిపాలన, జర్నలిజం, న్యాయం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో విశేష అనుభవం, లోతైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయాలని స్పష్టంగా చెప్తున్నా సర్కారు పట్టించుకోలేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ సీఎస్ కాకి మాధవరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.కె.శ్రీనివాసన్ తదితరులతో కూడిన ‘సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక’ ఒకడుగు ముందుకేసి.. కమిషనర్ల ఎంపికపై ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. కమిషనర్ల ఎంపికలో సర్కారు అనుసరించిన తీరును కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలతో పాటు పలు ప్రజా సంఘాలు కూడా ఏఐసీసీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే.. సమాచార కమిషనర్ల ఎంపిక మీద పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి కిరణ్ వివరణ ఇస్తారంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. సమాచార కమిషనర్ల ఎంపికలో సీఎం తీరును నిరసిస్తూ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం, వివాదం ఢిల్లీకి చేరటం తదితర పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్.. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న నలుగురి పేర్లను తిరస్కరించారు. ఈ మేరకు ఫైలును సర్కారుకు వెనక్కు పంపారు.
Share this article :

0 comments: