వాస్తవాలను మరుగుపరిచి అరచేతిలో స్వర్గం చూపిన ‘ఆనం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాస్తవాలను మరుగుపరిచి అరచేతిలో స్వర్గం చూపిన ‘ఆనం’

వాస్తవాలను మరుగుపరిచి అరచేతిలో స్వర్గం చూపిన ‘ఆనం’

Written By ysrcongress on Saturday, February 18, 2012 | 2/18/2012


1,45,854 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థికమంత్రి
ప్రణాళికేతర వ్యయం రూ. 91,824 కోట్లు, ప్రణాళిక వ్యయం 54,030 కోట్లు
పన్నుల రూపేణా రూ. 66,021 కోట్లు రాబడతామని ప్రకటన
జనంపై రూ.13 వేల కోట్ల దాకా పన్నుల బాదుడు ఖాయం!
వైఎస్ హామీ ఇచ్చిన ‘9 గంటల కరెంటు, 30 కిలోల సబ్సిడీ బియ్యం’ ఊసే లేదు
రైతు సమస్యలు పట్టలేదు, దేశాన్నే కుదిపేసిన ‘క్రాప్ హాలిడే’ ప్రస్తావనే లేదు
విద్య, వైద్యం వంటి కీలక సామాజిక పథకాలన్నింటికీ మొండిచేయే
బకాయిలకే చాలని రీతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయింపులు
ధరల నియంత్రణకు చర్యలు శూన్యం.. బడ్జెట్‌లో కానరాని ప్రజా మాల్స్
కొండలా పెరిగిన రాష్ట్ర అప్పులు.. బడ్జెట్‌కు మించి రూ.1.60 లక్షల కోట్లకు...

సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
రాష్ట్రానికి వెన్నెముకైన రైతన్న ఊసు లేదు. అతని సమస్యల ప్రస్తావన అసలే లేదు. విద్య, వైద్యం వంటి అత్యంత కీలకమైన ప్రజా సంక్షేమ రంగాలను పట్టించుకునే పెద్ద మనసు లేదు. వాటిని పట్టి పీడిస్తున్న సమస్యను పరిష్కరించాలన్న మనస్సాక్షి అస్సలు లేదు. ఉన్నదల్లా ఆద్యంతం అంకెల గారడీ! అవాస్తవాలతో కళ్లకు గంతలు కట్టే గడుసుతనం!! అంతకు మించి బడ్జెట్‌లో అసలేమీ లేదు. 

పేరుకు రూ.1,45,854 కోట్లతో ఆర్థిక మంత్రి శుక్రవారం అసెంబ్లీలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన 2012-13 రాష్ట్ర బడ్జెట్ అచ్చం ఆత్మ లేని శరీరాన్ని తలపించింది. రాష్ట్ర వ్యవసాయ సంక్షోభ తీవ్రతను జాతీయ స్థాయిలో ప్రతిధ్వనింపజేసిన క్రాప్ హాలిడే వంటి పెను విపత్తు కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. రైతు సమస్యలపై కిరణ్ సర్కారు మొద్దు నిద్రకు నిరసనగా ఏకంగా శాసనసభ్యత్వాలనే వదులుకునేందుకు కూడా 17 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడ్డ అపూర్వ ఘట్టాన్ని ఇటీవలే రాష్ట్రంతో పాటు దేశమంతా అబ్బురపాటుతో వీక్షించింది. అయినా సరే, బడ్జెట్లో మాత్రం రైతు సమస్యల పరిష్కార చర్యల ఊసే లేదు! సామాజిక పెట్టుబడిగా పరిగణించాల్సిన ఉదాత్తమైన విద్యా రంగాభివృద్ధిపైనా అదే నిర్లక్ష్యం. ఓవైపు విద్యా హక్కు కోసం కేంద్రం చట్టమే తెచ్చింది. కానీ కిరణ్ సర్కారు మాత్రం ఇంత కీలక రంగానికి సంబంధించి తనపై ఉన్న సామాజిక బాధ్యతను కనీస స్థాయిలో నెరవేర్చేందుకు కూడా ఏ మాత్రమూ సిద్ధంగా లేనని బడ్జెట్ సాక్షిగా తేల్చి చెప్పింది. పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఉదాత్త ఆశయంతో మొదలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి, బకాయిల చెల్లింపునకే కనాకష్టంగా సరిపోయే బొటాబొటి కేటాయింపులతో సరిపెట్టింది! 

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు, సమాజానికి దీని ద్వారా ఏం సందేశమివ్వాలనుకుంటున్నారో ఏలిన వారికే తెలియాలి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఉదాత్త లక్ష్యంతో దివంగత వైఎస్ తలపెట్టిన బృహత్తర కార్యక్రమం జలయజ్ఞం. గణాంకాలు, ఆర్థిక కోణాలను పక్కన పెట్టి.. ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుంది, తద్వారా సాధ్యపడే అదనపు దిగుబడి, ఉపాధి ద్వారా ఎన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతుందనే సామాజిక కోణంలో ఆలోచించి, మనస్ఫూర్తిగా అమలు చేయాల్సిన పథకమిది. కానీ అందుకు కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు.

జలయజ్ఞానికి పెంపు లేదు...

జలయజ్ఞానికి ఈసారీ నిధులు పెంచలేదు. అసలు గత బడ్జెట్ కేటాయింపుల నుంచే.. కొద్దిపాటి వ్యయంతో నిర్మాణం పూర్తయి సాగునీరందించగల పలు ప్రాజెక్టులకు పైసా కూడా విదల్చలేదు. అలా వాటిని ఖర్చు చేయకపోగా, దాన్నే కారణంగా చూపుతూ ఈసారి కూడా అంతంతమాత్రం నిధులతోనే సరిపెట్టి తెంపరితనాన్ని ప్రదర్శించింది! పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి ఆదుకోవడమే గాక లక్షలాది ప్రాణాలను నిలబెట్టిన అపర సంజీవనులైన 104, 108 పథకాలకు చివరికి డీజిల్‌కు కూడా దిక్కు లేని దౌర్భాగ్య పరిస్థితిని ప్రభుత్వమే చేజేతులా కల్పించింది! తాజా బడ్జెట్లోనూ వాటిపై శీతకన్నేసింది. పేదల సంక్షేమం తనకసలే పట్టదని మరోసారి నిరూపించుకుంది. రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకమైనా, రెండే రెండు హామీలతో 2009లో కాంగ్రెస్‌ను వైఎస్ రెండోసారి అధికారంలోకి తీసుకొస్తే, వాటినీ కిరణ్ ప్రభుత్వం విస్మరించింది. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుతిస్తామని, సబ్సిడీ బియ్యాన్ని గరిష్టంగా 30 కిలోలకు పెంచుతామని వైఎస్ ఇచ్చిన హామీలను పూర్తిగా అటకెక్కించింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా తాజా బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదు. చేనేత కార్మికులకు వైఎస్ ప్రకటించిన రూ.312 కోట్ల రుణ మాఫీలో నేటికీ సగం కూడా అమలు చేయలేదు. పన్నుల రూపేణా రూ.66,021 కోట్లు రాబడతామని ఆనం ప్రకటించారు. ప్రస్తుత పన్నుల ఆదాయం కంటే ఇది ఏకంగా రూ.13 వేల కోట్లు అదనం! అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం పొడవునా ఆ మేరకు జనం నడ్డి విరుస్తామని అమాత్యులు చెప్పకనే చెప్పారు! మొత్తం మీద ఇది అంకెల గారడీకే తప్ప రాష్ట్రాభివృద్ధికీ, ప్రజా సంక్షేమానికీ పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వని పనికిమాలిన బడ్జెట్‌గా మిగిలిపోతుందంటూ ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.

ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరచేతిలో అంకెల గారడీ ప్రదర్శించారు. వాస్తవాలను మరుగునపరిచి, అంతా బాగుందంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఒకటి రెండు కొత్త పథకాలను ప్రస్తావించి, ప్రజల కోసం ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రాన్ని కలచివేస్తున్న ఏ సమస్యా బడ్జెట్‌లో ప్రస్తావనకు గానీ, పరిష్కారానికి గానీ నోచుకోలేదు. పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలను ఎలా చెల్లిస్తారో చెప్పనే లేదు. ఇన్‌పుట్ వ్యయం భారీగా పెరిగి, గిట్టుబాటు ధర లభించక క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు తరుణోపాయం చూపలేదు. జీవన వ్యయం విపరీతంగా పెరిగి అవస్థలు పడుతున్న వృద్ధులు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు కాస్తయినా పెంచడానికి కూడా మనసొప్పని ప్రభుత్వం, గొప్పలు చెప్పుకోడానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యమూ ఇచ్చింది. ఆచరణసాధ్యం కాని ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకోవడం చూసి ఆర్థిక వేత్తలే విస్తుపోతున్నారు.



రాష్ట్రంలో సమస్యలే లేవా!

భూతద్దం పెట్టి వెదికినా రాష్ట్రంలో సమస్యలే లేవన్నంతగా బడ్జెట్‌లో కనికట్టు చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం శరవేగంగా అభివృద్ది చెందుతోందనే ఊహల్లో తేలియాడేందుకే పరిమితమయ్యారు. అధిక రాబడిని అంచనా వేసి, కంటికింపుగా కేటాయింపులు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనే పలు కోతలు పెట్టిన ప్రభుత్వం, మరో 40 రోజుల్లో ప్రారంభమయ్యే కొత్త బడ్జెట్ ఒక్కసారిగా ఇన్ని అద్భుతాలను ఎలా చేసి చూపుతుందో వారికే తెలియాలంటూ ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇంత భారీ ఆదాయాన్ని ఎక్కడి నుంచి, ఎలా రాబడతారన్న ప్రశ్నకు బడ్జెట్‌లో బదులే లేదు! పైకి చెప్పకపోయినా, పన్నుల రూపేణా రూ.13 వేల కోట్ల దాకా రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరవడం ఖాయమని కొత్త బడ్జెట్ స్పష్టంగానే చెబుతోందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఏతావాతా తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనను కిరణ్ సర్కారు మరోసారి గుర్తుకు తెస్తోంది. అప్పులపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. ఈ ఏడాది అప్పులు రాష్ట్ర బడ్జెట్‌ను కూడా మించి రూ.1.6 లక్షల కోట్లకు చేరిన వైనంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోతలూ భారీగానే..

పేరుకు ఘనంగా కేటాయింపులు చేస్తున్నా, ఏడాది ఆఖరుకు వచ్చేసరికి మాత్రం శాఖలవారీగా భారీగా కోతలు పెట్టడం పరిపాటైంది. ఇది విస్మయం కలిగించే అంశమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 2009-10 బడ్జెట్‌కు రూ.18,378 కోట్లు కోత పడగా, 2010-11లోనూ రూ.12,800 కోట్ల మేర కోత తప్పలేదని తేలింది. భారీ బడ్జెట్లు పేరు గొప్ప ప్రహసనమేనని ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. ఎటూ లక్ష కోట్లు దాటింది కదాని ప్రజలకు లేనిపోని భ్రమలు కల్పించేందుకే ఏటేటా బడ్జెట్ పరిమాణాన్ని పెంచుతూ పోతున్న వైనమూ స్పష్టమవుతోంది. రాష్ట్రం శరవేగంగా పురోగమిస్తోందని, రాబడి బాగా పెరుగుతోందని పైకి చెబుతున్న ప్రభుత్వం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడుల ఆదాయంలో రూ.3 వేల కోట్లను తక్కువగా సవరించి చూపింది! పురోగతి నిజంగానే శరవేగంగా ఉంటే ఇలా ఎందుకు తగ్గించి చూపించారో ఆర్థిక మంత్రికే తెలియాలి! పలు రంగాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోగా, మరికొన్ని రంగాలకు చెల్లించాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం నిలుపుదల చేసింది. అనేక శాఖలకు మూడో త్రైమాసికం బకాయిల్లో కొన్నింటిని, నాలుగో త్రైమాసికంలో అన్నింటినీ ఆపేసింది! బిల్లులేవీ చెల్లుబాటు కాకుండా ట్రెజరీ కార్యాలయాలకు ఆంక్షలు పెట్టింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించకపోతే భావి తరాలు క్షమించవని భావించి బృహత్తర జలయజ్ఞం ప్రాజెక్టు చేపట్టిన వైఎస్, 2009-10 బడ్జెట్‌లో దానికి రూ.17 వేల కోట్లు కేటాయిస్తే... తరవాతి రెండేళ్లలో దానికి ప్రాధాన్యతను అమాంతంగా తగ్గించారు. రూ.15 వేల కోట్లకు పరిమితం చేశారు. అందులో కూడా ఏడాది పూర్తయ్యేటప్పటికి కనాకష్టంగా సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేదెన్నడో? 

రీయింబర్స్‌మెంట్ నిధులు బకాయిలకే సరి...

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల చెల్లింపులదీ అదే పరిస్థితి! ఏటికేడాదీ కేటాయింపులను తగ్గిస్తూ, విద్యా సంస్థలకు ఒక ఏడాది ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి రూ.4,100 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.3,600 కోట్లు కేటాయించారు. ఇదంతా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన బకాయిలకే సరిపోతుంది. పథకాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం ధరను కిలో రూ.1కి తగ్గిస్తే చాలదని.. పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలనూ తగ్గించాలని ప్రభుత్వ పెద్దలపై ప్రజలు ఏకంగా బహిరంగ సభల్లోనే తిరగబడ్డారు. బ్లాక్ మార్కెటింగ్, ప్రభుత్వ పర్యవేక్షణ లేమే ధరల సమస్యకు కారణమవుతోందని గుర్తించినా ప్రభుత్వం పరిష్కారాలు చూపడంలేదు. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదల నియంత్రణకు త్వరలోనే ‘ప్రజా మాల్స్’ పేరిట భారీ దుకాణ సముదాయాలు నెలకొల్పుతామన్న పౌర సరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటనలు బడ్జెట్‌లో ప్రస్తావనకే నోచుకోలేదు.
Share this article :

0 comments: