వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు

వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012

వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. కనీస నీతి నియమాలకు, విలువలకు, చట్ట నిబంధనలకు తిలోదకాలిచ్చి ఏకబిగిన ఎనిమిది మంది సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు... అడిగేవారుండరనే వైఖరితో నిస్సిగ్గుగా ప్రవర్తించిన ప్రభుత్వానికి గవర్నర్ నర్సింహన్ ఫైలు తిప్పిపంపడం పెద్ద షాక్. ఈ పాపిష్టి నిర్ణయంలో పాలుపంచుకున్న విపక్ష నేతకూ ఇది చెంపపెట్టు. 

ఇది నిస్సందేహంగా సమాచార హక్కు ఉద్యమకార్యకర్తల, మేథావుల విజయం. ఏడాదికి పైగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఏక వ్యక్తి ఇలాకాగా మారింది. ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమూ అవుతోంది. పౌరుల సమాచార హక్కుకు ఇలా గ్రహణం పట్టించడం సరికాదంటూ ఎందరెందరో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిచూశారు. చివరకు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ సాగుతోందని, త్వరలోనే నియామకాలు పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తీరా కమిషన్‌కు నియమించినవారి జాబితాను చూసి అందరూ విస్తుబోయారు. సమాచార హక్కు చట్టం నియమనిబంధనలు, ఆ చట్టం ప్రాముఖ్యత, దానికున్న చరిత్ర ముఖ్య మంత్రికి తెలుసో, లేదోగానీ ఆయన కానిచ్చిన నియామకాలు చూస్తే దాన్నొక రాజకీయ పునరావాస కమిషన్‌గా అర్ధం చేసుకున్నట్టు వెల్లడవుతోంది. 

రాజకీయ పక్షాలతో ప్రత్యక్ష సంబంధాలున్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషనర్లుగా ఎంపిక చేయకూడదని సమాచార హక్కు చట్టం సెక్షన్ 15(6) స్పష్టంగా చెబుతోంది. సభ్యులుగా ఎవరెవరుండాలనే అంశంలోనూ చట్టానికి చాలా స్పష్టత ఉంది. భిన్నరంగాల్లో విశేష అనుభవం, లోతైన పరిజ్ఞానం ఉన్నవారిని కమిషన్‌కు ఎంపిక చేయాలని సెక్షన్ 15(5) నిర్దేశిస్తోంది. కమిషనర్ల నియామకాల ఎంపికలో ఈ రెండు నిబంధనలనూ ప్రభుత్వం తోసిరాజంది. గవర్నర్ అభ్యంతరం చెప్పిన నలుగురిలో ఇద్దరు కాంగ్రెస్‌వారే కాగా, మరో ఇద్దరు పీఆర్‌పీనుంచి, తెలుగుదేశంనుంచీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నవారు. దాదాపు 15 నెలలుగా సమాచార హక్కు కమిషన్‌ను పట్టించుకోని సర్కారు ఒక్కసారిగా మేల్కొని ఇంతమందిని నియమించడం వెనుక అసలు ఆంతర్యం ఇదన్నమాట. 

ఈ సందర్భంలో విపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా తాను నిర్వహించవలసిన పాత్రను బాబు ఏనాడో మరిచిపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎన్ని లెక్కలు వేసుకున్నారో, చాలాకాలం తాటాకు చప్పుళ్లతో ఎలా కాలక్షేపం చేశారో, చివరకు కాంగ్రెస్ సర్కారుకు అందుమూలంగా వచ్చే ఇబ్బందేమీ లేదని గ్రహించాక ‘అవిశ్వాస నాటకాన్ని’ ఎలా రక్తికట్టించ బోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సమాచార హక్కు కమిషన్ విషయం లోనూ ఆయన అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. దివంగత నేత వైఎస్ హయాంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మోకాలడ్డిన చరిత్ర గల బాబు.. ఆ తర్వాతకాలంలో మూగనోము పాటిస్తున్న సంగతిని ప్రజలు ఏనాడో పసిగట్టారు. కమిషనర్ల నియామకం కోసం జరిగిన సమావేశంలో నోరెత్తకుండా కూర్చోవడం, ఆనక మీడియా కంటబడకుండా తప్పించుకోవడాన్ని బట్టే బాబు ముద్రను జనం పోల్చుకున్నారు. 

తీరా నియామకాలను అందరూ ఛీకొట్టాక అందులో తన పాత్రేమీ లేదని చెప్పుకోవడానికి ఆయనపడ్డ తంటాలు వర్ణనాతీతం. అంతా బట్టబయలై చేతులు కాలాక... కమిషనర్లుగా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు సంబంధించి తనకు పూర్తి సమాచారం లేదని ఒకసారి, తాను ‘అసమ్మతి నోట్’ ఇచ్చానని మరోసారి ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. అది కూడా ‘లీకు’ల ద్వారా. 
సమాచార హక్కు చట్టం ఎందరెందరో వ్యక్తుల, సంస్థల సుదీర్ఘ పోరాట ఫలం. ప్రభుత్వాలు వ్యవహరించే తీరుగురించి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ గురించి ఎలాంటి సమాచారం కోరబోయినా ఎన్నడో వలస పాలకులు తెచ్చిన అధికార రహస్యాల చట్టం పేరుచెప్పి, దేశ భద్రత సాకు చూపి పాలకులు దబాయిస్తున్న దశలో ఈ ఉద్యమం అంకురించింది. 

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వారి దయాదాక్షిణ్యాలపై మాత్రమే పాలకులు అధికారంలో ఉండగలరని చాటుతూ... పాలనలో పారదర్శకత ఉండాల్సిందేనని పట్టుబడుతూ హెచ్‌డి శౌరి చాలాకాలం ఒక్కరుగా చేసిన పోరాటం ఎన్నతగినది. ఆ తర్వాత మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్(ఎంకెఎస్‌ఎస్)లాంటి సంస్థల చొరవతో అది ఇంతింతై, పెను ఉద్యమమై నలుమూలలా విస్తరించాకగానీ ప్రభుత్వాలు దారికి రాలేదు. 2005లో చట్టం తెచ్చినప్పుడే దేశ భద్రత పేరుచెప్పి 22 సంస్థలను ఆర్టీఐ పరిధినుంచి తప్పిస్తూ అందులోనే సెక్షన్ 24 రూపంలో పొందుపరిచారు. అలా చేయడంలోని హేతుబద్ధతపై చర్చ సాగుతుండగానే మరిన్నిటిని చేర్చడానికి చూశారు. 

ఇవన్నీ ఒక ఎత్తయితే... అసలు కమిషన్‌లోనే అస్మదీయులను ప్రవేశపెట్టి పబ్బం గడుపుకుందామనుకోవడం మరో ఎత్తు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు అలాంటి ప్రయత్నంలోనే అడ్డంగా దొరికిపోయింది. నిరంతర అప్రమత్తతతో అవసరమైతే చట్టంలో తగిన సవరణలు తీసుకొచ్చేలా ఉద్యమకారులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తేనే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా వివేకంతో వ్యవహరించవలసి ఉంది. వర్తమాన రాజకీయాల తీరుతెన్నుల్ని గమనిస్తే ఢిల్లీ పెద్దల్ని సంప్రదించ కుండా గవర్నర్ ఈ నిర్ణయం తనకు తానుగా తీసుకున్నారని భావించలేం. ఏదేమైనా గవర్నర్ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, తన తప్పు సరిదిద్దుకుంటుందని ఆశిద్దాం.
Share this article :

0 comments: