ఔను.. కుమ్మక్కే: డీఎల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఔను.. కుమ్మక్కే: డీఎల్

ఔను.. కుమ్మక్కే: డీఎల్

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

 రాష్ట్రమంతటికీ తెలిసిన బహిరంగ రహస్యంపై అధికారిక ముద్ర పడింది! ఊరూవాడా కోడై కూస్తున్న బాబు-కిరణ్ బంధాన్ని సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే ధ్రువీకరించారు! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబుల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ నడుస్తోందని ఆరోగ్య మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయం ముందే ఈ మేరకు ఆయన కుండబద్దలు కొట్టారు! ‘కిరణ్‌తో బాబు ఎంతలా మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాడో ఇటీవలి సంఘటనలను చూస్తే అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. 

‘నెల్లూరులో ఓ ప్రైవేట్ కాలేజీకి సంబంధించి బాబు సిఫార్సులను కిరణ్ ఆమోదించారు. అందుకు బదులుగా సమాచార కమిషనర్ల నియామకంపై బాబు నోరు మెదపలేదు’ అంటూ ఫిక్సింగ్ తీరుతెన్నులను సోదాహరణంగా వెల్లడించారు. ‘‘2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మానవ హక్కుల సంఘం చైర్మన్, సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తే, బాబు దాన్నుంచి అర్ధంతరంగా బయటికెళ్లి, మీడియాను వెతుక్కుని మరీ విమర్శలు చేశాడు. 

కాంగ్రెస్ వాళ్లంతా దొంగలని ఆరోపించాడు. ‘అలాంటి దొంగలే మానవహక్కుల సంఘం, సమాచార కమిషనర్ పదవుల్లో దొంగల్ని నియమిస్తున్నా’రన్నాడు. అలా అప్పట్లో అన్ని నియామకాలనూ వ్యతిరేకించాడు. అలాంటి బాబు, తాజాగా మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంపై నోరెత్తలేదు. సమాచార కమిషనర్ల నియామకం అడ్డగోలుగా జరిగినా కనీసం నోరు విప్పలేదు. పెపైచ్చు మీడియాకు కనిపించకుండా తేలుకుట్టిన దొంగలా వెళ్లిపోయాడు. దానిపై ఇప్పుడు టీడీపీలోనే పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. కిరణ్‌తో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ముదరడంతో, బాబు ఇప్పుడు మాట మార్చి, ‘నేను డిసెంట్ (వ్యతిరేకత వ్యక్తం చేస్తూ) నోట్ ఇచ్చా’నంటూ మీడియాకు లీకులిస్తున్నాడు. ప్రభుత్వంతో బాబు ఎంతలా మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాడో దీన్ని చూస్తేనే అర్థమవుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. 

గురువారం సాయంత్రం ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కూడా డీఎల్ ఇవే అంశాలను ప్రస్తావించారు. సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి బాబు-కిరణ్ మధ్య తెర వెనక ఒప్పందాలు జరిగాయని అనుమానం వెలిబుచ్చారు. ‘‘నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేటు కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన పైరవీ వ్యవహారంలో బాబుకు కిరణ్ తోడ్పాటు అందించారు. అందుకు ప్రతిగా సమాచార కమిషనర్ల నియామకానికి ఏమీ మాట్లాడకుండానే బాబు ఆమోదం తెలిపినట్టున్నారు’’ అని అన్నారు. బాబు, కిరణ్‌ల గురించి మరికొన్ని విషయాలనూ వివరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని గాలివాటం పార్టీగా తాను భావించడం లేదన్నారు.

బీసీ మంత్రిని బలిపశువు చేస్తున్నారు

మద్యం సిండికేట్ల వ్యవహారంలో కిరణ్ తీరుపై డీఎల్ ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రిని రక్షించేందుకు ఓ బీసీ మంత్రిని ఆయన బలిపశువును చేస్తున్నారంటూ మండిపడ్డారు. కిరణ్ సామాజికవర్గానికి చెందిన మరో మంత్రి సిండికేట్లనుంచి డబ్బు పుచ్చుకున్నా, ఆయన పేరును ఏసీబీ రిమాండ్ డైరీ నుంచి తప్పించి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరును ఉంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పేరును నేరుగా ప్రస్తావించకుండా, ‘బీసీ వర్గానికి చెందిన మోపిదేవి మంచి వ్యక్తి. ఆయన లంచం తీసుకున్నట్టుగా రిమాండ్ రిపోర్టులో పెట్టడం చాలా బాధాకరం. ఉన్నత స్థానాల్లోని వ్యక్తి (కిరణ్)కు ప్రాంతం, కులం, మతం అనేవి ఉండరాదు. 

కానీ ఇక్కడ తన సామాజిక వర్గ మంత్రి పేరు లేకుండా చేసి, బీసీ మంత్రిని బలిపశువును చేయజూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అన్నారు. తమ సామాజిక వర్గానికి న్యాయం జరగదా అంటూ ఈ ఉదంతంపై మోపిదేవి తనతో ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఏసీబీ రిమాండ్ డైరీ నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును తీసేసిన విషయం తనకు తెలియదని డీఎల్ అన్నారు. సీఎం నిర్ణయాలు సరిగా లేకున్నా వాటిని పొగడటం తన వల్ల కాదని స్పష్టంచేశారు. తన రాజీనామాతో సీఎం బలపడతారని భావిస్తే అందుకు తాను సిద్ధమేనన్నారు. ‘సీఎం మార్పును నేను కోరుకోవడం లేదని, అయితే రాష్ట్రమంతా తన సొంత ఆస్తి అన్నట్టుగా నడిస్తేనే చిక్కులు’ అంటూ చురకలు వేశారు. విజయనగరం, చిత్తూరు బొత్స, సీఎంల సొంత జిల్లాలు గనకే ఏసీబీ దాడులు జరగలేదనే అంశం తనకు తెలియదన్నారు. ఏసీబీ నివేదికలోని అంశాలన్నింటినీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: