‘‘రెండేళ్లు ఆగండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘‘రెండేళ్లు ఆగండి.. వచ్చేది మన ప్రభుత్వమే..

‘‘రెండేళ్లు ఆగండి.. వచ్చేది మన ప్రభుత్వమే..

Written By ysrcongress on Tuesday, February 14, 2012 | 2/14/2012

ధర్మవరం దీక్ష రెండోరోజూ 
భారీగా తరలివచ్చిన జనం
జ్వరంతో బాధపడుతున్నా వారి కష్టాలు ఆసాంతం విన్న జననేత
జగన్‌ను కలిసిన ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలు 
మంచి రోజులొస్తాయని జగన్ భరోసా
టెట్ రద్దుకోసం భారీ ఎత్తున పోరాటం చేస్తామని విద్యార్థులకు హామీ
నేడు దీక్ష విరమణ

ధర్మవరం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: నాలుగు రోజుల నుంచి జ్వరం బాధిస్తున్నా.. సోమవారం ఆరోగ్యం మరింత క్షీణించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లెక్క చేయలేదు. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించినా ససేమిరా అన్నారు. విశ్రాంతి తీసుకోవా లన్న సూచననూ తోసిపుచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష రెండో రోజు సోమవారం ఆయన అక్కడికి తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ.. వారు చెప్పే సమస్యలను ఆసాంతం వింటూ.. వారి తరఫున పోరాటం చేస్తానని హామీ ఇస్తూ వారిలో ధైర్యం నింపారు. ‘‘రెండేళ్లు ఆగండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే సమస్యలను అన్నిం టినీ పరిష్కరిస్తా. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తా’’ అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. నేతన్నలకు రుణ మాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలన్న డిమాండ్లతో ఆదివారం సాయంత్రం 6గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించిన జగన్.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆ దీక్ష విరమించనున్నారు. కాగా జగన్‌కు సంఘీభావంగా సోమవారం రాష్ట్రం నలుమూలల నుంచీ జనం భారీగా తరలివచ్చారు.

ఆదుకోవాలంటూ చేనేత నాయకుల మొర

‘నెలకు రాయితీపై నాలుగు కేజీల రేషంను ఒక్కో కార్మికుడికి పంపిణీ చేస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా రాయితీ విడుదల చేయలేదు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. రుణాలను మాఫీ చేయలేదు. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల వస్త్రాల ఉత్పత్తి వ్యయం పెరిగింది. అదే సమయంలో పవర్‌లూమ్స్‌లో ఉత్పత్తయిన వస్త్రాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అందువల్లే చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు’ అంటూ చేనేత ఐక్యవేదిక నాయకులు కేఎన్‌మూర్తి, మెటికల కుళ్లాయప్ప, కోటం కృష్ణమూర్తి, గుద్దిటి జ్ఞానలోనుడు, లయన్ వెంకటస్వామి తదితరులు జగన్‌కు తమ బాధలను విన్నవించుకున్నారు. ‘మీ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడతా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అని జగన్ వారికి భరోసా ఇచ్చారు.


టెట్ పేరుతో కడుపు కొడుతున్నారు

‘టెట్‌లో ఉత్తీర్ణులైతేనే డీఎస్సీకి అర్హులని ప్రభుత్వం సరికొత్త నిబంధన పెట్టింది. దేశంలో రెండు మూడు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా టెట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. టెట్ పేరుతో ప్రభుత్వం మా కడుపులు కొడుతోంది’ అంటూ జగన్‌ను కలిసిన బీఈడీ అభ్యర్థులు రంగనాయకులు, రమణ తదితరులు తమ బాధలను విన్నవించుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘మీ డిమాండ్ సహేతుకమైనదే. టెట్‌ను ప్రవేశపెట్టడంలో అర్థం లేదు. తక్షణమే టెట్‌ను ఎత్తివేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ భారీ ఎత్తున ఆందోళన చేస్తుంది. నేనూ ఆ ఆందోళనలో పాల్గొంటా. ప్రభుత్వం మెడలు వంచే వరకూ పోరాడదాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే టెట్‌ను రద్దు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

వస్త్రాల మీద వ్యాట్‌తో భారం..

వస్త్రాలపై ప్రభుత్వం వ్యాట్‌ను విధించడం వల్ల ఇటు వ్యాపారులపై.. అటు ప్రజలపై తీవ్ర భారం పడుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలని వస్త్ర వ్యాపారుల సంఘం నేతలు ముస్తాక్ అహ్మద్, శేషాద్రిరెడ్డి తదితరులు జగన్‌ను కోరారు. ‘వాస్తవమే. ప్రభుత్వం పన్నులు పెంచుతూ ప్రజలను దోచుకుంటోంది. కానీ.. వారి సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వ్యాట్‌ను ఎత్తేయాలని మేం పోరాటాలు చేశాం. వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తేయాలని నిరంతర పోరాటం చేస్తాం. మేం అధికారంలోకి రాగానే తొలి రోజునే వ్యాట్‌ను ఎత్తేస్తాం’ అని హామీ ఇచ్చారు.

కురుబ సంఘం సంఘీభావం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కురుబ సంఘం నేతలు సంఘీభావం ప్రకటించారు. జగన్‌కు సాంప్రదాయరీతిలో కంబళి కప్పి, గొర్రెపిల్లను వారు బహూకరించారు. తమ సమస్యలను విన్నవించుకున్నారు. ‘మీ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. మా పార్టీలో కూడా చర్చించి.. మీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా’ అని కురుబ సంఘం నేతలు బోరంపల్లి ఆంజనేయులు, శంకర్ నారాయణలకు ఆయన హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ అనంతపురం జిల్లా కన్వీనర్ నూర్‌బాబా నేతృత్వంలో ముస్లింలు.. సంప్రదాయ పద్ధతిలో జగన్‌ను సన్మానించారు.

మా చదువులు ఆగిపోతాయి..

‘అన్నా.. ప్రభుత్వం తీరు చూస్తోంటే ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉంది. మా తల్లిదండ్రులు పేదవాళ్లు. ఒకవేళ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోతే మా తల్లిదండ్రులు ఫీజు కట్టలేరు. అప్పుడు మా చదువులు అర్ధంతరంగా ఆగిపోతాయి. మీరే ఆదుకోవాలి’ అని రాఘవేంద్ర, సంతోష్, మహబూబ్ బాషా అనే ఇంజనీరింగ్ విద్యార్థులు జగన్ ముందు విలపించారు. ‘ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాం. అధైర్యపడకండి. నేనున్నా..’ అంటూ వారికి హామీ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరి సమస్యలపైనా తగిన విధంగా జగన్ స్పందించారు. వారిలో ధైర్యం నింపారు.

తరలివచ్చిన నేతలు..

ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, వైఎస్సార్ సీపీ నేతలు ఆది శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ, నల్లా సూర్యప్రకాశ్, రెహమాన్, వంగపండు ఉష, తలశిల రఘురాం, బుచ్చి మహేశ్వరరావు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులు దీక్షకు తరలివచ్చారు.
Share this article :

0 comments: