అరెస్టు అంటూ ముహూర్తం కూడా పెట్టి కుట్ర కథనాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అరెస్టు అంటూ ముహూర్తం కూడా పెట్టి కుట్ర కథనాలు

అరెస్టు అంటూ ముహూర్తం కూడా పెట్టి కుట్ర కథనాలు

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012

జగన్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీల దుష్ర్పచారం 
అరెస్టు అంటూ ముహూర్తం కూడా పెట్టి కుట్ర కథనాలు 
ఆయనను అరెస్ట్ చేస్తామని ఈ పార్టీలకు సీబీఐ చెప్పిందా? 
లేదా అరెస్టు చేయాలని సీబీఐకి వీరు నిర్దేశిస్తున్నారా? 
జగన్‌ను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ నాయకులకు కిరణ్ చెప్తున్నారు 
అవే మాటలను చంద్రబాబు టీడీపీ నేతలకు చెప్తున్నారు 
మీ కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు.. 
సరైన సమయంలో బుద్ధి చెప్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏ తప్పూ చేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా.. ఆయనను భవిష్యత్తులో రాజకీయంగా ఎదుర్కోవటం కష్టమని భావించి ఆయనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా దుష్ర్పచారం సాగిస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మా నాయకుడు జగన్‌ను ఫలానా నెలలో అరెస్టు చేస్తారని, ఫలానా తేదీలోగా అరెస్టు చేస్తారని ముహూర్తాలు కూడా పెడుతున్నారు. అదే అంశాలతో ఎల్లో మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అసలు ఏ తప్పు చేశారని జగన్‌ను అరెస్టు చేస్తారు? అసలు అరెస్టు అంటూ ముహూర్తాలు ఎవరు పెట్టారు? ఫలానా సమయానికి జగన్‌ను అరెస్ట్ చేస్తామని సీబీఐ ముహూర్తం పెట్టి.. కాంగ్రెస్, టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు చెప్పిందా? లేదా వారంతా కలిసి ఫలానా సమయానికి జగన్‌ను అరెస్ట్ చేయాలని ముహూర్తం పెట్టి సీబీఐకి చెప్పారా?’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒక పథకం ప్రకారం విషప్రచారానికి ఒడిగడుతున్నారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, చదిపిరాళ్ల నారాయణరెడ్డి, మేకా శేషుబాబులు మంగళవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జగన్‌ను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇవే మాటలను తమ పార్టీ నేతల సమావేశాల్లో పదేపదే చెప్తున్నారు. ఫలానా సమయంలో జగన్‌ను అరెస్ట్ చేస్తారని, ఫలానా తేదీలోగా జగన్ అరెస్ట్ ఖాయం అని ముహూర్తాలు కూడా పెట్టి ప్రచారం చేస్తూ.. దాన్నే మీడియాకు లీకులిచ్చి ఎల్లో సిండికేట్ ద్వారా అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా రోజు మార్చి రోజు అదే దుష్ర్పచారం చేస్తోంది’’ అని దుయ్యబట్టారు. వీరి ప్రచారం చూస్తుంటే రాజకీయంగా జగన్‌ను దెబ్బతీయాలన్న దుర్బుద్ధితో ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ రెండు పార్టీల నేతలు ఇచ్చే లీకులతో ఎల్లో సిండికేట్ కూడా తమ పార్టీ అధినేతపై ఇష్టానుసారంగా రాస్తున్నాయని, పైగా జగన్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే ఉప ఎన్నికలు ఉంటాయని మరో అడుగు ముందుకేసి సీబీఐకి నిర్దేశిస్తున్నాయని.. దీనినిబట్టి వీరి సంబంధాలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. తామే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలు మొదటి నుంచి అనుమానిస్తున్నట్లుగానే జగన్‌ను టార్గెట్ చేసి కిరణ్, చంద్రబాబు, ఎల్లో సిండికేట్‌లతో పాటు సీబీఐ అంతా ఒక పథకం ప్రకారం నడుస్తున్నారని వారు ఆరోపించారు. 

ఏ కారణంతో అరెస్ట్ చేస్తారో చెప్పాలి... 

‘‘మా నాయకుడు ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది? ఏ కారణంతో ఆయనను అరెస్ట్ చేస్తారు? ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన మంత్రులెవరికైనా ఫోన్లు చేశారా? మీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారా? ఫలానా పనిచేసి పెట్టాలని ఒత్తిడి తెచ్చారా? ఏ ఒక్క రోజైనా ఆయన సచివాలయానికి వచ్చారా? ఏ అధికారికైనా ఆయన ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారా? ఒక ఎంపీగా కడప జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొనటానికి రెండు సార్లు తప్ప ఏనాడైనా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టారా? ఏదీ లేదే! మరి అలాంటప్పుడు ఏ కారణంతో జగన్‌ను అరెస్ట్ చేస్తారు? పోనీ ఫలానా మంత్రికో అధికారికో ఇంకెవరికైనా ఫోన్లు చేశారని రుజువు చేయగలరా? సచివాలయానికి కానీ క్యాంపు కార్యాలయానికి కానీ వచ్చారని నిరూపించగలరా? ఏ ఆధారాలు లేకుండా.. అరెస్టు చేస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ నాయకులు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారంటే.. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందన్న విషయం స్పష్టమవుతోంది’’ అని వారు పేర్కొన్నారు. నిజానికి ఆ రోజుల్లో ఎక్కువ కాలం జగన్ హైదరాబాద్‌లోనే లేరన్నారు. ‘‘పోనీ ఫలానా కారణాలతో అరెస్ట్ చేస్తున్నామని సీబీఐ మీకేమైనా చెప్పిందా? కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు ఎల్లో మీడియాకు లీకులిస్తూ రకరకాల వార్తలు రాయిస్తున్నారంటే దానర్థమేంటి? మీకు సీబీఐ అయినా చెప్పి ఉండాలి.. లేదా మీరే సీబీఐని నిర్దేశిస్తుండాలి...’’ అని అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ఫలానా తేదీకి లేదా ఫలనా సమయానికి జగన్‌ను అరెస్ట్ చేస్తామని ముహూర్తంతో సహా సీబీఐ ఈ నాయకులకు చెప్పి ఉంటే బయటకు చెప్పమనండి.. లేదా సీబీఐకి ఈ నాయకులే మార్గనిర్దేశం చేసి ఉంటే ఆ విషయాన్ని సీబీఐ అయినా బయటపెట్టాలి’’ అని వారు డిమాండ్ చేశారు. 

మాట మీద నిలబడినందుకు ఇంత కుతంత్రమా? 

‘‘జగన్ పదవికి ఆశ పడి ఉంటే కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు చెప్పినట్లు ఏనాడో కేంద్ర మంత్రి అయ్యేవారు. కానీ తన తండ్రి, దివంగత నేత రాజశేఖరరెడ్డి మరణించిన చోట నల్లకాలువ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇచ్చిన మాట కోసం నిలబడినందుకు ఇంతటి కుట్ర పన్నుతారా? తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పిన మాట మీద నిలబడినందుకు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేలా కుటిల తంత్రాన్ని అమలు చేశారు’’ అని ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. ‘‘జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తండ్రి ఆశయాల సాధన కోసం పార్టీని ఏర్పాటు చేసినందుకు మొత్తం రాజశేఖరరెడ్డి కుటుంబంపైన బురదజల్లుతారా? ఇంతటి దుర్మార్గమైన రాజకీయ కుట్రలు పన్ని మీ పబ్బం గడుపుకోవటానికి ఆఖరుకు పార్టీలను సైతం పక్కనపెట్టి కాంగ్రెస్, టీడీపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయంటే.. పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు’’ అని ధ్వజమెత్తారు. ‘‘వైఎస్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని.. ఆయనే తమ నాయకుడని.. ఆయన అడుగులో అడుగేసి నడుస్తామని.. ఒకటేమిటి రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులంతా చెప్పిన మాటలు ఏమయ్యాయి? ప్రజలెవరూ వాటిని మరిచిపోలేదు. గత రెండేళ్లుగా వైఎస్ కుటుంబంపై చేస్తున్న కుట్రలు, సాగిస్తున్న కుటిల రాజకీయాలు అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారం ఉంది కదా అని ఇప్పుడేదో జగన్ అరెస్టుకు ఉప ఎన్నికలకు ముడిపెట్టి కావాలని నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్న మీ అందరికీ ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు.
Share this article :

0 comments: