ఎక్కువ ప్రతులు, తక్కువ ధర కావటంతో ‘సాక్షి’వైపే మొగ్గిన సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎక్కువ ప్రతులు, తక్కువ ధర కావటంతో ‘సాక్షి’వైపే మొగ్గిన సర్కారు

ఎక్కువ ప్రతులు, తక్కువ ధర కావటంతో ‘సాక్షి’వైపే మొగ్గిన సర్కారు

Written By ysrcongress on Thursday, February 23, 2012 | 2/23/2012

పీడబ్ల్యూసీ ఆడిట్ ప్రకారం ఆదిలోనే ‘సాక్షి’ సర్క్యులేషన్ 12.73 లక్షలు
నాటికి ఏబీసీ ప్రకారం ‘ఈనాడు’ విక్రయించే కాపీల సంఖ్య 11 లక్షలు
2008-09 ఆర్‌ఎన్‌ఐ ప్రకారమూ ‘సాక్షి’ సర్క్యులేషన్ 12.83 లక్షలు
అప్పట్లో ‘సాక్షి’కన్నా ‘ఈనాడు’ యాడ్ రేట్లు 20 శాతం ఎక్కువ
అదివారాల్లో అయితే యాడ్ రేట్లు సాక్షి కన్నా ఏకంగా 40% అధికం
ఎక్కువ ప్రతులు, తక్కువ ధర కావటంతో ‘సాక్షి’వైపే మొగ్గిన సర్కారు
అవే ప్రకటనల్ని ‘ఈనాడు’కిస్తే మరో రూ.20 కోట్లు అదనంగా వదిలేవి
దాన్ని సవాలు చేస్తూ ఎవరైనా కోర్టుకెళితే అధికారుల ఉద్యోగాలు పోయేవి
నిబంధనల మినహాయింపులో వార్త, ఆంధ్రజ్యోతి, సూర్య తరవాతే ‘సాక్షి’
వార్తకు, ఆంధ్రజ్యోతికి మినహాయింపునిచ్చిన బాబును సీబీఐ పిలవదేం?

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)

మీరో నోట్‌బుక్ కొనాలనుకున్నారు. చాన్నాళ్ల నుంచి ఆ బిజినెస్‌లో ఉన్న ఒకాయనేమో తక్కువ పేజీలున్నా ఎక్కువ ధర చెబుతున్నాడు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మరొకాయన మాత్రం ఎక్కువ పేజీలున్న పుస్తకాన్ని తక్కువ ధరకే ఇస్తున్నాడు. మరి మీరు ఎవరి దగ్గర కొంటారు? ఎక్కువ పేజీలు - తక్కువ ధర ఉన్న కొత్త వ్యక్తి దగ్గరా? లేక చాన్నాళ్ల నుంచి అమ్ముతున్నాడు కాబట్టి ఎక్కువ ధరకు అమ్మే వ్యక్తి దగ్గరా? 

సహజంగా ఎవరైనా ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా నాణ్యత-ధర అనే రెండే చూస్తారు. పత్రికల్లో ప్రకటనలివ్వటమూ అలాంటిదే. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక తక్కువ ధరకే ప్రకటనలు ప్రచురిస్తామంటే ఎవరైనా దానికే ఓటేస్తారు. 2008-09, 2009-10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిందీ అదే. అధిక సర్క్యులేషన్‌తో ఆవిర్భవించటంతో పాటు ‘ఈనాడు’లో ప్రకటనల రేట్లు ‘సాక్షి’ కన్నా 20 శాతం ఎక్కువ కావటంతో ప్రభుత్వం ‘సాక్షి’ వైపే మొగ్గు చూపింది. దానికి కాస్త ఎక్కువ ప్రకటనలిచ్చి... తన విధానాల ప్రకారం తగు నిష్పత్తిలో మిగతా పత్రికలకూ ప్రకటనలిచ్చింది. 

ఈ రాష్ట్రంలో ఏదైనా తాను అనుకున్నట్లు మాత్రమే జరగాలని భావించి... 2004 నుంచి ఆ విషయంలో ఫెయిలవుతూ వస్తున్న రామోజీరావుకు ప్రభుత్వం ఇలా చేయటం ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే సర్క్యులేషన్ తక్కువున్నా, అడ్వర్టయిజ్‌మెంట్ ఛార్జీల్ని దండిగా వసూలు చేస్తూ దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న దందాకు ‘సాక్షి’ రాకతో తెరపడింది. ప్రభుత్వం ఆయన బ్లాక్‌మెయిలింగ్ రాతల్ని ఖాతరు చేయలేదు. అందుకే ఆయన సాక్షిని, జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు. ఎలా రాయాలంటే అలా రాస్తున్నారు. సీబీఐ అధికారులు నేరుగా తన చెవిలోనే చెప్పినట్లు... సమాచార శాఖ అధికారులు తన ఇంటికి వచ్చి మాట్లాడినట్లు బుధవారం ఆయన వండిన కథనం కూడా ఇలాంటిదే. ‘‘వై‘ఎస్’ అన్నాం’’ అంటూ అధికారులకు వ్యాఖ్యలు అంటగడుతూ... పెపైచ్చు సీబీఐ వర్గాలు తనతో చెప్పాయంటూ... ఆయన వార్చిన రోత వార్త దీన్లో భాగమే. కాకుంటే రామోజీ ఎన్ని రాసినా సీబీఐ పన్నెత్తకుండా ఎల్లో సిండికేట్ చెప్పు చేతల్లోను, ఢిల్లీ కాంగ్రెస్ అడుగు జాడల్లోను నడుస్తుండటమే ఈ రాష్ట్రం దురదృష్టం. కావాలంటే ఆ కథనంలోని నిజానిజాలేంటో మీరే చూడండి.

సర్క్యులేషన్ ఎక్కువ.. ధర తక్కువ..

2008 మార్చిలో ఆరంభమవుతూనే ‘సాక్షి’ 12.73 లక్షల సర్క్యులేషన్‌ను సాధించింది. అంతర్జాతీయ టాప్-5 ఆడిటింగ్ దిగ్గజాల్లో ఒకటైన ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ సంస్థ ఆడిట్ చేసి నిర్ధారించిన సంఖ్య ఇది. అప్పటికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నిర్ధరించినదాని ప్రకారం ‘ఈనాడు’ సర్క్యులేషన్ అన్ని ఎడిషన్లూ కలిపి 11.55 లక్షలు (జనవరి-జూన్ 2008) మాత్రమే. ప్రకటనల విషయానికొచ్చేసరికి మాత్రం ‘ఈనాడు’ అధిక రేటు వసూలు చేసేది. కంబైన్డ్ ఎడిషన్లకిచ్చే ప్రకటనలకు కాలమ్ సెంటీమీటర్‌కు మామూలు రోజుల్లో రూ.1,350, ఆదివారాల్లో రూ.1,570 చొప్పున వసూలు చేసేది. ‘సాక్షి’ మాత్రం సర్క్యులేషన్ ఎక్కువున్నా సరే ప్రకటనల ధర ఆదివారం సహా అన్ని వారాల్లోనూ కాలమ్ సెంటీమీటర్‌కు రూ.1,100గానే నిర్ణయించింది. అంటే ‘సాక్షి’ కన్నా ఈనాడు ప్రకటనల ధర ఆదివారాల్లో 40 శాతం, మిగతా రోజుల్లో 20 శాతం ఎక్కువ. దీంతో ప్రభుత్వం తక్కువ ఖర్చుతో తన పథకాల్ని ప్రజలకు వివరించడానికి ‘సాక్షి’ని ఎంచుకుంది. అందుకే ‘సాక్షి’కి కొంత ఎక్కువ ప్రకటనలిస్తూ... ప్రభుత్వ విధానాల ప్రకారం తగు నిష్పత్తిలో మిగిలిన పత్రికలకూ వాటిని జారీ చేసింది.

పీడబ్ల్యూసీ ఆడిట్‌ను ధ్రువీకరించిన ఆర్‌ఎన్‌ఐ ఆడిట్...

ఆర్‌ఎన్‌ఐ అంటే... కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా. ఈ సంస్థ ఆడిట్ చేసి ఏ పత్రిక సర్క్యులేషన్‌నైనా నిర్ధరించవచ్చు. దీని సర్టిఫికేషన్ ఆధారంగానే ప్రభుత్వాలు ప్రకటనలు జారీ చేస్తాయి. ‘సాక్షి’ ఆరంభమైన వెంటనే దాని సర్క్యులేషన్‌ను పీడబ్ల్యూసీ 12.73 లక్షలుగా నిర్ధరించేనాటికి ఏబీసీ ప్రకారం ‘ఈనాడు’ సర్క్యులేషన్ 11.55 లక్షలు. నాలుగు నెలల తరవాత ‘సాక్షి’ తన సర్టిఫికేషన్ కోసం ఆర్‌ఎన్‌ఐని ఆహ్వానించింది. ఆర్‌ఎన్‌ఐ ఆడిట్ ప్రకారం 2008 ఏప్రిల్ 1నుంచి 2009 మార్చి 31 మధ్య ‘సాక్షి’ సర్క్యులేషన్ 12.83 లక్షలు . అంటే పీడబ్ల్యూసీ సర్టిఫికెట్ కన్నా కూడా అధికమన్న మాట. అయితే 2008 జులై-డిసెంబర్ మధ్య ఏబీసీ ప్రకారం ‘ఈనాడు’ సర్క్యులేషన్ 11.72 లక్షలు. 
40 శాతం అధికంగా చెల్లించి ‘ఈనాడు’కిస్తే...?

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకటనల రూపంలో ‘సాక్షి’కి వందల కోట్ల రూపాయలు దోచి పెట్టేశారంటూ రామోజీరావు రాసిన రాతల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం కాదన్నది వాస్తవాలు చూసినవారికి తెలియకమానదు. నాలుగు వందల కోట్లని ఒకసారి, రెండు వందల కోట్లని ఒకసారి... ఇలా చేతికొచ్చినట్లు రామోజీ రాసినా... వాస్తవంగా 2008-09, 2009-10 సంవత్సరాల్లో ఐ అండ్ పీఆర్ ‘సాక్షి’కి ఇచ్చిన మొత్తం ప్రకటనల విలువ రూ.67.15 కోట్లు. ఆ రెండు సంవత్సరాల్లో ‘ఈనాడు’ పత్రికకు ఇచ్చిన మొత్తం ప్రకటనల విలువ రూ.34 కోట్లు. ఈ విషయంలో అప్పటి ‘సాక్షి’ సర్క్యులేషన్‌ను కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకుంది.

పోనీ... రామోజీ వాదిస్తున్నట్లు ‘సాక్షి’కన్నా అధిక రేటు పెట్టి ‘ఈనాడు’కే ఎక్కువ ప్రకటనలిచ్చారనుకుందాం! ఏం జరుగుతుంది. ‘సాక్షి’కి 67 కోట్లిచ్చారు కనక... అవే ప్రకటనల్ని ‘ఈనాడు’లో ఇవ్వాలంటే దాని రేట్ల ప్రకారం మామూలు రోజుల్లో మరో 20 శాతం అధికంగా చెల్లించాలి. అంటే మరో 13.50 కోట్ల రూపాయల్ని అదనంగా వెచ్చించాలి. ఆదివారాల నాటి రేట్లను పరిగణనలోకి తీసుకుంటే అదనంగా చెల్లించాల్సింది దాదాపు 28 కోట్లు. రెంటికీ మధ్యస్థంగా చూసినా రూ.15 నుంచి 20 కోట్లు అదనంగా వెచ్చించాలన్న మాట. ఒకవైపు ఎక్కువ మందికి చేరే పత్రికలో తక్కువ రేట్లకే ప్రకటనలిచ్చే అవకాశాన్ని వదిలేసి... రూ.20 కోట్లు అదనంగా వెచ్చించి మరీ ‘ఈనాడు’కు ప్రకటనలివ్వటం సమంజసమేనా? ఒకవేళ ప్రభుత్వం ఇదంతా చేసి... ఎవరైనా కోర్టులో ఏ ప్రజాహిత వ్యాజ్యమో వేస్తే అలా ప్రకటనలిచ్చిన అధికారుల గతేమవుతుంది? వారి ఉద్యోగాలేమవుతాయి? ప్రకటనల జారీలో ప్రభుత్వం ‘సహజ న్యాయం’ పాటించలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన కిరణ్ కేసును కోర్టు కొట్టేయలేదా? తాను ప్రభుత్వ వ్యతిరేక ధోరణి అవలంభించినందుకే తనకు ప్రకటనలు తక్కువ ఇచ్చారని ఆ కేసులో కిరణ్ స్వయంగా పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ధోరణి అవలంబించిన పత్రికలకు ప్రకటనలివ్వకుండా ఉండొచ్చన్న నిబంధన ఉందనే విషయం కిరణ్‌కు తెలియదనుకోవాలా? లేక అన్నీ తెలిసే ఇవన్నీ చేస్తున్నారనుకోవాలా?

తండ్రి గొడుగుజాడల్లోనే కిరణ్ కూడా...

‘సాక్షి’ తొలి 6 నెలలు గడిచాక... 2008 సెప్టెంబరులో ఏబీసీ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2008 జులై-డిసెంబరు మధ్య తన సర్క్యులేషన్‌ను ఆడిట్ చేయాలని కోరింది. అప్పుడు ఆడిట్ చేస్తే... అధికారికంగా ‘సాక్షి’ నెంబర్-1గా అవతరించే అవకాశం ఉండేది. కానీ అప్పుడే రొటేషన్ పద్ధతిలో ఏబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ దీన్ని అడ్డుకున్నారు. వాదనకు నిలబడని చిన్న కారణాలు చూపించి ‘సాక్షి’ని ఏబీసీ నుంచి బహిష్కరించారు. అదెలాగంటే...

ఏబీసీ నిబంధనల ప్రకారం ఆడిట్ కోసం దరఖాస్తు చేశాక... ఏబీసీ నిర్ధారించేదాకా నిర్ణీత కాలంపాటు ఏ పత్రికా తన సర్క్యులేషన్‌ను బయటకు చెప్పుకోకూడదు. ఏబీసీకి దరఖాస్తు చేయక ముందు మాత్రం అలాంటి నిబంధనలేవీ వర్తించవు. ఏబీసీకి దరఖాస్తు చేయక ముందు ‘సాక్షి’ పలుమార్లు తన సర్క్యులేషన్ వివరాల్ని ప్రకటనల్లో వెల్లడించింది. కాకపోతే ఏబీసీకి దరఖాస్తు చేశాక కూడా ఆ ప్రకటన కొన్నిసార్లు ప్రచురితమైంది. ఈ చిన్న కారణంతో ‘సాక్షి’ని ఏబీసీ నుంచే బహిష్కరించారు కిరణ్. ‘సాక్షి’ దాన్ని సవాల్ చేసి... మరుసటి ఏడాదికల్లా ఏబీసీ ఆడిట్ సర్టిఫికేషన్‌ను సాధించటం ఇక్కడ గమనార్హం.

ప్రత్యేక జీవో అంటూ దగుల్బాజీ రాతలు..

‘సాక్షి’కి ప్రకటనలివ్వటానికి ఏకంగా ప్రత్యేక జీవోనే విడుదల చేశారంటూ రామోజీ రాసిన రాతల్లో ఆయన నిస్పృహ, ‘సాక్షి’పై పెంచుకున్న కసి, వాస్తవాల్ని విస్మరించే దివాలాకోరుతనం, నచ్చనివారిపై విషం చిమ్మే దగుల్బాజీతనం తప్ప ఇంకేమీ కనిపించవు. ఎందుకంటే పత్రికలకు ప్రకటనలివ్వాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి. అందులో ఆర్‌ఎన్‌ఐ సర్టిఫికెట్ కలిగి ఉండటం, 6 నెలలుగా ప్రచురితమవుతుండటం వంటివి కొత్త పత్రికలకు సాధ్యం కాదు. అందుకని కొత్త పత్రికలకు ప్రకటనలివ్వటానికి వీటిని మినహాయించటమనేది ఎప్పటి నుంచో ఉన్నదే. గతంలో ఇలా ఎవరికి మినహాయింపులిచ్చారో చూస్తే...

వార్త: జీవో4121 (తేదీ: 19.7.1996)
ఆంధ్రజ్యోతి: జీవో 5739 (తేదీ: 29.10.2002)
ఎతెమాద్: జీవో 1016 (తేదీ: 25.2.2006)
సూర్య: జీవో 7630 (తేదీ: 19.12.2007)
సాక్షి: జీవో 226 (తేదీ: 24.4.2008)

పైన పేర్కొన్న జీవోల్లో వార్త, ఆంధ్రజ్యోతి పత్రికల కోసం నిబంధనల్ని మినహాయించింది చంద్రబాబు నాయుడు. మరి ఆంధ్రజ్యోతికి ఆయన ఎందుకలా ఇచ్చారు? అనుచిత లబ్ధి చేకూర్చడానికేనా? ఈ విషయంలో చంద్రబాబును సీబీఐ ఎందుకు పిలవకూడదు? అప్పటి అధికారుల్ని ఎందుకు విచారించకూడదు? అసలు సీబీఐ ఈ కోణాన్ని ఎందుకు విస్మరిస్తోంది? ఇవన్నీ ఇక్కడ ప్రశ్నలే. కాకుంటే మిగిలినవారికి ఇచ్చినపుడు ప్రశ్నించని ‘ఈనాడు’... సాక్షి విషయంలో మాత్రమే ఎందుకిలా విషం చిమ్ముతోందనేది ఈ రాష్ట్ర ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేదే.
Share this article :

0 comments: