అధినేత తీరుతో పార్టీకి దూరమైన విద్యార్థి, యువజన వర్గాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధినేత తీరుతో పార్టీకి దూరమైన విద్యార్థి, యువజన వర్గాలు

అధినేత తీరుతో పార్టీకి దూరమైన విద్యార్థి, యువజన వర్గాలు

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

ఏటా రెండు శాతం ఉద్యోగులను తగ్గిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో ఒప్పందం
యువజనంకోసం ఒక్క పథకమూ ప్రవేశపెట్టలేదు 
స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు రోడ్లెక్కినా పట్టించుకోలేదు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి పథకాలను ఆహ్వానించలేదు
అధినేత తీరుతో పార్టీకి దూరమైన విద్యార్థి, యువజన వర్గాలు
ఆలస్యంగా గుర్తించిన నాయకత్వం...
 తెలుగుదేశం పార్టీకి యువత దూరమైంది. ఓటర్లలో 40 శాతానికి పైబడి ఉన్న యువజనులు దూరం కావడంపై ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. టీడీపీ స్థాపించిన తర్వాత యువత ఇంతగా దూరం కావడానికి అధినేత తీరే కారణమని ఆ పార్టీనేతలే విమర్శిస్తున్నారు. దివంగత ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పుడు రాష్ట్రంలో యువత పెద్దఎత్తున ఆ పార్టీ పక్షాన నిలిచింది. ఆయన కూడా యువతకు పెద్దపీట వేశారు. ఈనాడు సీనియర్ నాయకులుగా ఉన్నవారందరూ ఆనాటి యువనేతలే. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న నారా చంద్రబాబునాయుడు మొదట్లో యువత పాట పాడినప్పటికీ... రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యువజన వ్యతిరేక విధానాలనే అనుసరించారు. 

యువకులు, విద్యార్థులకు రాజకీయాలు అనవసరమని, విద్యార్థి సంఘాలను రద్దు చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా పార్టీ అనుబంధ తెలుగు విద్యార్థి విభాగాన్ని రద్దు చేశారు. దీంతోపాటు ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించారు. ఇదే సందర్భంలో సీపీఎం శాసనసభాపక్షం నాయకుడు నోముల నర్సింహయ్య నేతృత్వంలో కార్మిక నేతల బృందం కలిసినప్పుడు కూడా కార్మిక నేతలు అడ్డగోలు డిమాండ్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉత్పత్తిని పెంచడానికి కార్మిక సంఘాలను సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఒక్కో వర్గాన్ని దూరం చేసుకోవడం వల్లే ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పార్టీ ఓటమిపాలైందని... ఎన్టీఆర్ హయాంలో గండిపేటలో రాజకీయ శిక్షణా తరగతులకు హాజరైన ఒక సీనియర్ నేత విశ్లేషించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకత్వంలో మార్పు కనిపించకపోవడంతో యువకులు, విద్యార్థులు పార్టీ పట్ల ఆకర్షితులు కావడం లేదని అభిప్రాయపడ్డారు. 

ఆ తొమ్మిదేళ్లూ యువతకు చీకటే: చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే సంస్కరణల పేరుతో ప్రజలపై పెనుభారం మోపే నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయకపోగా ఏటా 2శాతం ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడానికి ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఆయన పాలనలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయిన ఉద్యోగాలు వేళ్లమీద లెక్కించవచ్చు. డీఎస్సీ మినహాయిస్తే ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరక్కపోవడంతో ఆ తదనంతర కాలంలో జరిగిన నియామకాలకు వయోపరిమితి దాటిపోయి అసలు ఉద్యోగాలకే అనర్హులై న యువకులు లక్షల్లో ఉండిపోయారు. 

కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్‌మెంట్లు లేని కారణంగా ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ల సమయంలో వయోపరిమితి పెంచాలని కోరుతూ అనేక సందర్భాల్లో ఆందోళనలు చేసినా చంద్రబాబు స్పందించలేదు. స్కాలర్‌షిప్‌లకోసం విద్యార్థులు రోడ్లెక్కినా పట్టించుకోలేదు. వారికోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టలేదు. ఇలా యువతను దూరం చేసుకున్న కారణంగానే 2004 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందని పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యార్థినీ విద్యార్థుల కోసం చారిత్రాత్మకమైన ఫీజు రీ-యింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. అలాగే పూర్తిస్థాయిలో (సాచ్యురేషన్) స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారు. నిర్వీర్యమైన ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా అనేక పథకాలు ప్రారంభించారు. వీటిని కూడా చంద్రబాబు ఆహ్వానించలేదు. దీంతో 2009లో మరోసారి ఓడిపోయా రు. వైఎస్సార్ మరణానంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నిలిపివేసిన సందర్భంలోనూ విద్యార్థుల పక్షాన బాబు పోరాటం చేయలేకపోయారు. ఆఖరుకు టీడీపీ అనుబంధ విభాగం తెలుగు యువతకు రెండేళ్లుగా కార్యవర్గాన్ని సైతం నియమించలేదు. ఇలా అధినేత అడుగడుగునా నిర్లక్ష్యం చేయడంవల్లే విద్యార్థులు, యువజనులు టీడీపీకి పూర్తిగా దూరమయ్యారని పార్టీలో పరిమితంగా మిగిలిన యువనేతలు విశ్లేషిస్తున్నారు.

నేటి నుంచి ప్రాంతీయ సదస్సులు
యువత పార్టీకి దగ్గరకు చేర్చలేనంత దూరం వెళ్లిందని గమనించిన పార్టీ నేతల హెచ్చరికలతో తిరిగి ఎలాగైనా వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ నెల 8 నుంచి 11 వరకు యువతకోసం ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌ల్లో తలపెట్టిన ఈ సదస్సుల్లో ఒక్కో కేంద్రంలో 25 వేలకు తగ్గకుండా యువతను తరలించాలని నేతల్ని బాబు ఆదేశించినట్లు సమాచారం. యువకులంతా పార్టీకి దూరమైన విషయాన్ని ఆలస్యంగానైనా గుర్తించినందువల్లే వచ్చే ఎన్నికల్లో యువతకు 30% సీట్లు కేటాయిస్తామన్న ప్రకటన చేశారని నేతలు గుర్తుచేస్తున్నారు.
Share this article :

0 comments: