సభలో మ్యాచ్‌ఫిక్సింగే ఉభయ తారకమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సభలో మ్యాచ్‌ఫిక్సింగే ఉభయ తారకమా?

సభలో మ్యాచ్‌ఫిక్సింగే ఉభయ తారకమా?

Written By ysrcongress on Monday, February 13, 2012 | 2/13/2012

* బీఏసీ బహిష్కరణ అందులో భాగమేనా?
* కాంగ్రెస్-టీడీపీ రాజీలేని పోరుపైనే సర్వత్రా ఆసక్తి!
* తెలంగాణ తీర్మానంపైనే టీఆర్‌ఎస్ పట్టు
* ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు లెఫ్ట్ సిద్ధం
* కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టనున్న వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు
* నేడు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయ వాతావరణంలో సోమవారం నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు భారీగా జరిగినప్పటికీ ఆయా పార్టీలు అనుసరించే వ్యూహంపైనే అందరి దృష్టి నిలిచింది. ప్రజా సమస్యలే అస్త్రాలుగా అధికారపక్షంపై కత్తులు దూయాల్సిన ప్రధాన ప్రతిపక్షం రాజీలేని పోరాటం చేస్తామని పైకి చెబుతున్నా లోలోపల మాత్రం గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా ‘రాజీ’ మంత్రమే పఠించేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి రాష్ట్రం మునుపెన్నడూ లేనంతటి సంక్షోభంలో పడిపోయింది. కరువు సహాయక పరిస్థితులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, విద్యుత్ చార్జీల వడ్డన, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వంటి కీలకమైన సమస్యలతో పాటు జూనియర్ డాక్టర్ల సమ్మె, సర్కారు ఆస్పత్రుల్లో పెరుగుతున్న మరణాలసంఖ్య, మద్యం సిండికేట్ల కుంభకోణం వంటి ఎన్నో అంశాలు రాజకీయ పార్టీల ముందున్నాయి. అయితే తెలుగుదేశం తీరు చూస్తుంటే ఆయా సమస్యలను గాలికొదిలేసి కిరణ్ సర్కార్‌తో రాజీ మంత్రం పఠించే అవకాశాలే కన్పిస్తున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్-టీడీపీ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. 

నిజానికి గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీ సమావేశాలు ఏనాడూ సజావుగా జరిగిన దాఖలాల్లేవు. ప్రాంతీయ ఉద్రిక్తతలతో కొంతకాలం, రాజీనామాలతో మరికొంతకాలం... అర్థవంతమైన చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ఎజెండా ఏమిటో నిర్ణయించే కీలకమైన శాసనసభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ఇరు పార్టీల మధ్య కుదిరిన మ్యాచ్‌ఫిక్సింగ్ మరోసారి బయటపడింది. మరోవైపు సొంతపార్టీ నేతల అసమ్మతి దెబ్బలకు తలబొప్పి కట్టి విలవిల్లాడుతున్న కిరణ్ సర్కార్ సైతం ప్రజా సమస్యలతో నిమిత్తం లేకుండా బడ్జెట్ సమావేశాలను ‘మమ’ అన్పించేందుకే మక్కువ చూపుతోంది. సమావేశాలు సజావుగా సాగి ప్రజా సమస్యలను విపక్షాలు ఎండగడితే ప్రభుత్వం ఇరకాటానపడే ప్రమాదముందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ భావన. సొంతపార్టీ అసమ్మతి నేతలు కూడా సభలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తారనే భయం కూడా ఆయనను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఎప్పటి మాదిరిగానే తెలుగుదేశంతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని ముందుకుపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరమన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు కనబడుతోంది.

సిద్ధమవుతున్న టీడీపీయేతర విపక్షాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ఈ సమావేశాల్లో ‘తెలంగాణపై తీర్మానం’ చేయాలనే ఏకసూత్ర కార్యక్రమంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందుకోసం కలిసొచ్చే పార్టీలతో అధికార, ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై మజ్లిస్... పేద, బడుగు, బలహీనవర్గాల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్సీ సబ్‌ప్లాన్ అమలుపై లెఫ్ట్ పార్టీలు సభలో సర్కార్‌ను నిలదీయాలని భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం మ్యాచ్‌ఫిక్సింగ్ నేపథ్యంలో సంఖ్యాబలంగా మైనారిటీగా మారిన తమ పార్టీల గొంతు సభలో వినపడేది అనుమానమేనని లెఫ్ట్ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు, రైతు కూలీలు, కరువు సహాయ చర్యలు, చేనేత కార్మికుల సమస్యలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నీరుగారుస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది.

తొలిరోజు నుంచే డ్రామా షురూ..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచే అధికార, విపక్షాల డ్రామా మొదలుకాబోతుంది. సభలో ఏ రోజు ఏయే అంశాలను చర్చించాలో నిర్ణయించే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తెలుగుదేశం పార్టీ డ్రామాకు అంకురార్పణ చేయనుంది. మరోవైపు గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోతే ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సకలజనుల సమ్మె విరమణ సందర్భంగా ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలుచేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, తెలంగాణ ప్రాంతంలో కరువు, సహాయక చర్యల్లో విఫలం, రైతుల, చేనేత కార్మికుల సమస్యలపై సర్కార్‌ను నిలదీయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు.

నేడు బీఏసీ సమావేశం..
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. అనంతరం మంగళవారం నుంచి జరపాల్సిన అసెంబ్లీ ఎజెండాపై చర్చించేందుకు స్పీకర్ శాసనసభ వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మార్చి నెలాఖరు వరకు జరిగే ఈ సమావేశాల ఎజెండాపై సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రకటించినందున సమావేశాల ఎజెండా ఖరారు అధికార పార్టీకి మరింత తేలిక కానుంది.

సభలో ఇవి చర్చకు రానట్లే..
ఇటీవలికాలంలో సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగిందని మంత్రులే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియామకాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్చకు పట్టుబట్టే ఆస్కారమే కన్పించడం లేదు. భూ కేటాయింపులకు సంబంధించి ఏర్పాటు చేసిన సభాసంఘానికి నిర్దేశించిన విధి విధానాల్లో స్పష్టత లేనిసంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రిజమ్ సిమెంట్ కంపెనీకి వెయ్యి ఎకరాలు కేటాయించడం, కె.రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ధారాదత్తంచేసిన అమీర్‌పేట భూముల విషయాన్ని ఈ సభాసంఘం విచారణ పరిధిలో తేవాలని ఎవరైనా కోరినా దానికి మద్దతునివ్వకూడదని టీడీపీ నిర్ణయించినట్టు టీడీఎల్పీ నాయకుడొకరు చెప్పారు. 

ఇలాంటి కీలకాంశాలను టీడీపీ లేవనెత్తే అవకాశాలు లేవని, కేవలం కొందరిని టార్గెట్ చేసుకుని రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులు, సిండికేట్లలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా ఇతర కాంగ్రెస్ నేతల పాత్ర, అధికారులకు ముడుపులు, ఫోక్స్‌వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ క్లీన్ చిట్, పోలవరం టెండర్ల కేటాయింపు, రద్దు అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. 

అందరి చూపు ‘వైఎస్’ ఎమ్మెల్యేలపైనే!
అవిశ్వాస తీర్మానంలో విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలపై శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ ఇప్పటివరకు అనర్హత చర్యలు తీసుకోకపోవడంతో అందరిచూపు ఇప్పుడు వారిపైనే ఉంది. ‘రైతుల కోసం స్పీకర్ సమక్షంలోనే విప్‌ను ధిక్కరించాం. చర్య తీసుకోండి’ అని ఆయా ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి విన్నవించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు ధరించి సభకు హాజరు కావాలని నిర్ణయించారు.
Share this article :

0 comments: