రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మోత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మోత

రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మోత

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

* రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.56 వేల కోట్ల నుంచి రూ.67వేల కోట్ల పెంపునకు కసరత్తు
* అప్పుల రూపంలో రూ.20,500 కోట్లు సమకూర్చుకునేందుకు ప్రణాళిక
* సీఎం విచక్షణ నిధి రూ.600 కోట్లకు పెంపు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మోత మోగించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా ఏకంగా రూ.11 వేల కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకోవాలని సర్కారు భావిస్తోంది. వచ్చే వార్షిక బడ్జెట్ (2012-13)లో ఈ మేరకు ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై.. అధికారులు ఈ మేరకు కసరత్తు కొనసాగిస్తున్నారు. కొత్త పద్ధతి అంటూ కేవలం ఆన్‌లైన్‌లోనే వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు స్వీకరించిన ఆర్థిక శాఖ.. పుస్తకాలకు బదులు కేవలం సీడీల్లో బడ్జెట్‌ను అందరికీ అందజేయాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో పుస్తకాలు కూడా ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి బడ్జెట్‌లో.. రాష్ట్ర పన్నుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పన్నుల రూపంలో రూ.56 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలాగైనా రూ.67 వే ల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని భావిస్తోంది. అంటే వచ్చే ఏడాది రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.11 వేల కోట్ల భారం పడనుందన్నమాట. ప్రధానంగా మద్యం, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, గనులతోపాటు రవాణా శాఖల ద్వారా ఆదాయం పెంచుకోవడంపై సర్కారు దృష్టిసారించే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కింద రూ.3 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. 

కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.18 వేల కోట్ల వరకు ఉంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.21 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదిలావుండగా రూ.20,500 కోట్ల మేరకు అప్పులు తెచ్చుకునే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,900 కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతిస్తుందని రాష్ట్ర అధికారులు భావించినప్పటికీ అది రూ.14,500 కోట్లకు మించే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ప్రభుత్వ రాబడులు ఈసారి 20% మేరకు పెరిగిన నేపథ్యంలో వార్షిక బడ్జెట్ ఆ మేరకు పెరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మొత్తం రూ.1.28 లక్షల కోట్లు. అందులో ప్రణాళిక పద్దు రూ.43 వేల కోట్లుగా చూపెట్టారు. 

బడ్జెట్‌ను భారీగానే రూపొందిస్తున్నా.. వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి కోతలు అనివార్యం అవుతున్నాయి. గత రెండుమూడు బడ్జెట్లను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారంతో ఎమ్మెల్యేలకు కేటాయించేందుకు.. ప్రస్తుతం రూ.400 కోట్లుగా ఉన్న నిధిని, వచ్చే బడ్జెట్‌లో రూ.600 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. సీఎం విచక్షణా నిధిని కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వినియోగించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పెంపుదల ఆసక్తి రేకెత్తిస్తోంది.
Share this article :

0 comments: